Share News

Bangladesh : కల్లోల బంగ్లా

ABN , Publish Date - Aug 06 , 2024 | 03:30 AM

సర్కారీ కొలువుల్లో 30% కోటా నిరసనలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికిపోతుండడంతో.. నాటకీయ పరిణామాల మధ్య బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. హింస అదుపులోకి రాకపోవడం..

Bangladesh : కల్లోల బంగ్లా

  • ప్రధాని నివాసం, సీజే నివాసం,పార్లమెంటుల్లో విధ్వంసం

  • ప్రధాని షేక్‌ హసీనా రాజీనామా.. పార్లమెంటు రద్దు.. ఖలీదా జియా విడుదల

  • హసీనాను జాతినుద్దేశించి ప్రసంగించనివ్వని ఆర్మీ

  • ఆగమేఘాల మీద భారత్‌కు.. కట్టుదిట్టమైన భద్రత

  • జాతీయ భద్రతా సలహాదారు ఢోబాల్‌ సమావేశం

  • తమవద్దకు రావొద్దన్న బ్రిటన్‌!.. కొన్నాళ్లు భారత్‌లోనే!

  • బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌ జమా నేతృత్వంలో కొత్త సర్కారు

  • ఆందోళనలు విరమించాలని ఉద్యమకారులకు పిలుపు

  • బంగ్లాదేశ్‌కు విమానాలు, రైళ్ల రాకపోకలు బంద్‌

  • అమ్మ మళ్లీ రాజకీయాల్లోకి రారు: హసీనా కుమారుడు

  • ప్రధాని మోదీకి పరిణామాలను వివరించిన జైశంకర్‌

ఢాకా/న్యూఢిల్లీ, ఆగస్టు 5: సర్కారీ కొలువుల్లో 30% కోటా నిరసనలతో దేశవ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికిపోతుండడంతో.. నాటకీయ పరిణామాల మధ్య బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. హింస అదుపులోకి రాకపోవడం.. ఆందోళనకారులు వేల సంఖ్యలో ప్రధాని అధికారిక నివాసం ‘గణభవన్‌’ వైపు చొచ్చుకువస్తుండడంతో.. పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదముందంటూ ఆర్మీ అధికారులు చేసిన హెచ్చరికలతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఆందోళనలుఉధృతమైన వేళ.. ఆమె తన పదవికి రాజీనామా చేసి.. ప్రత్యేక విమానంలో భారత్‌కు బయలుదేరారు.

Untitled-3 copy.jpg

జాతినుద్దేశించి ప్రసంగించడానికి కూడా సైన్యాధికారులు ఆమెకు అవకాశం ఇవ్వలేదు..! హసీనా తన సోదరి రెహనాతో కలిసి ఆర్మీ హెలికాప్టర్‌లో ఎయిర్‌బే్‌సకు.. అక్కడి నుంచి మిలటరీ రవాణా విమానం(సీ-130జే)లో భారత్‌కు బయలుదేరారు. 3.30 గంటల సమయంలో.. హసీనా భారత సరిహద్దుల్లోకి ప్రవేశించారని నిర్ధారించుకున్నాక.. ఆమె రాజీనామా చేసినట్లు ఆర్మీ చీఫ్‌ ప్రకటించారు. ఆ తర్వాత జాతినుద్దేశించి ప్రసంగించారు.

Untitled-4 copy.jpg

నిరసనకారులు ఆందోళనలను విరమించాలని, కర్ఫ్యూను ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. ఆదివారం నుంచి సస్పెండ్‌ చేసిన ఇంటర్నెట్‌ కనెక్షన్‌ను తిరిగి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. అధికారికంగా మిలటరీ ప్రభుత్వం ఏర్పడుతుందని వెల్లడించారు. అప్పటి దాకా నిరసనలు వ్యక్తం చేస్తున్న ఆందోళనకారులు.. ఒక్కసారిగా సంబురాలు జరుపుకొన్నారు.


అదే సమయంలో ప్రధాని అధికారిక నివాసం సహా.. అధికార అవామీ పార్టీ నేతల ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేశారు. మీడియా కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. అధికారపక్షానికి మద్దతిచ్చే వ్యాపారుల దుకాణాలు, పరిశ్రమలు లూటీ అయ్యాయి. దాంతో ఢాకా సహా.. దేశంలోని ప్రధాన నగరాలు నిప్పుల కుంపటిగా మారిపోయాయి.

Untitled-3 copy.jpg

మరోవైపు భారత్‌ చేరిన హసీనా.. ఘజియాబాద్‌లోని బివండీ ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ వద్ద దిగారు. ఆ వెంటనే.. జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ ఢోబాల్‌, వైమానిక దళం అధికారులు అక్కడికి చేరుకున్నారు. హసీనా ఢిల్లీ మీదుగా లండన్‌ వెళ్లాలని నిర్ణయించుకున్నా.. బ్రిటన్‌ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదని.. దాంతో హసీనా కొంతకాలం భారత్‌లోనే ఉండనున్నారు.


ఉదయం నుంచే

దేశంలో రిజర్వేషన్లపై జరుగుతున్న ఆందోళనల కట్టడిలో భాగంగా హసీనా.. నిరసనల్లో మృతిచెందిన 34 మంది కుటుంబ సభ్యులతో ఉదయం 10.30కు తన అధికారిక నివాసంలో భేటీ అయ్యారు. అప్పటి నుంచి పరిణామాలు వేగంగా మారిపోయాయి. మధ్యాహ్నానికి దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి.

Untitled-4 copy.jpg

దాంతో ఆర్మీ చీఫ్‌ వకార్‌-ఉజ్‌-జమా(హసీనాకు బంధువు) ప్రధాని నివాసానికి చేరుకుని, పరిస్థితిని వివరించారు. ఆయన సూచన(45 నిమిషాల అల్టిమేటం జారీ చేశారని బంగ్లాదేశ్‌ పత్రికలు పేర్కొంటున్నాయి) మేరకే మధ్యాహ్నం 3 గంటల సమయంలో హసీనా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 3.35 సమయంలో ఆర్మీ చీఫ్‌ వకార్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వ ఏర్పాటు విషయమై చర్చించేందుకు అధ్యక్షుడు షాబుద్దీన్‌ నివాసానికి వెళ్లారు. తర్వాత అధ్యక్షుడు.. పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.


ఉధృతమైన ఆందోళనలు

ఆర్మీ చీఫ్‌ ప్రసంగం తర్వాత కొంత సేపు వీధుల్లో సంబరాలు జరుపుకొన్న ప్రజలు.. ఆ వెంటనే మళ్లీ విధ్వంసకాండకు దిగారు. ప్రధాని అధికారిక నివాసంలోకి వందల మంది చొరబడ్డారు. అక్కడ దొరికిన వస్తువును దొరికినట్లు తస్కరించారు.

Untitled-4 copy.jpg

ప్రధాని అధికార నివాసంలోని ల్యాన్‌లో విద్యార్థులు విలాసంగా కూర్చున్న ఫొటోలు, స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. అదే సమయంలో హోంమంత్రి అసదుజ్జమాన్‌ ఖాన్‌ కమాల్‌ ఇంటికి నిప్పుపెట్టారు. హసీనా తండ్రి, బంగ్లాదేశ్‌ లిబరేషన్‌ నాయకుడు, బంగబంధు ముజీబ్‌-ఉర్‌-రెహ్మాన్‌ భారీ విగ్రహం పైకెక్కిన ఆందోళనకారులు.. తల భాగాన్ని సుత్తెతో మోది, పాక్షికంగా ధ్వంసం చేశారు.

రాత్రి 7.30 సమయంలో బుల్డోజర్‌తో తిరిగి వచ్చిన ఆందోళనకారులు.. ఆ విగ్రహాన్ని నేలమట్టం చేశారు. ఢాకాలోని అవామీ లీగ్‌ కార్యాలయం సుధాసదన్‌కు, బంగబంధు మ్యూజియానికి, ఇందిరాగాంధీ కల్చరల్‌ సెంటర్‌కు నిప్పుపెట్టారు. బంగ్లాదేశ్‌ ప్రధాన న్యాయమూర్తి ఇంట్లోనూ విధ్వంసం సృష్టించారు. ఆ తర్వాత పార్లమెంట్‌ భవనంలోకి చొచ్చుకువెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢాకా విమానాశ్రయాన్ని ఆరు గంటల పాటు మూసివేశారు.


ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమీక్ష

బంగ్లాదేశ్‌ పరిణామాలపై మోదీ నేతృత్వంలోని క్యాబినెట్‌ కమిటీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, విదేశాంగ మంత్రి జైశంకర్‌, ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ పాల్గొన్నారు.

Untitled-4 copy.jpg

బంగ్లాదేశ్‌లో చదువుకుంటున్న భారత విద్యార్థులు పూర్తిస్థాయిలో వెనక్కి తిరిగి రాలేదు. అక్కడ కోటా ఆందోళనలు మొదలైనప్పటి నుంచి గత నెల 22 వరకు 2,894 మంది విద్యార్థులు వెనక్కి వచ్చారు.

ఇంకా 3 వేల మంది వరకు అక్కడే ఉన్నారని.. వారిని వెనక్కి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామని విదేశాంగ శాఖ తెలిపింది. కాగా.. ఇండో-బంగ్లా మధ్య గూడ్స్‌ లారీలను నడిపే భారత డ్రైవర్లు సరిహద్దుల్లో చిక్కుకుపోగా.. ఆది, సోమవారాల్లో వారిని వెనక్కి రప్పించినట్లు బీఎ్‌సఎఫ్‌ అధికారులు తెలిపారు.


15 ఏళ్లు ప్రధానిగా..

షేక్‌ హసీనా అనూహ్య పరిణామాల మధ్య రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె తండ్రి ముజీబ్‌-ఉర్‌-రెహ్మాన్‌. 1975లో మిలటరీ తిరుగుబాటులో.. ముజీబ్‌-ఉర్‌-రెహ్మాన్‌, ఆయన భార్య, ముగ్గురు కుమారులు దారుణ హత్యకు గురయ్యారు.

Untitled-4 copy.jpg

ఆ సమయంలో హసీనా, ఆమె సోదరి రెహనా జర్మనీలో ఉన్నారు. ఆరేళ్ల పాటు ప్రవాస జీవితాన్ని గడిపిన హసీనా.. ఆ తర్వాత బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చారు. ప్రజల పక్షాన నిలబడి రాజకీయాల్లోకి వచ్చారు. 15 ఏళ్లపాటు ఐదుసార్లు ప్రధానిగా సేవలందించారు.


ఎస్సైని కొట్టి చంపిన దుండగులు

Untitled-5 copy.jpg

చాంద్‌పూర్‌ జిల్లాలోని కచువా, మత్లౌచ్‌(సౌత్‌), మత్లౌచ్‌(నార్త్‌), హెమ్చార్‌, ఫరీద్‌గంజ్‌ ఠాణాలపై ఆందోళనకారులు దాడి చేశారు. కచువా ఎస్సై మామునూర్‌ రషీద్‌ను కొట్టి చంపారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో షహదత్‌(20) అనే విద్యార్థి మృతిచెందగా.. ఇమ్రాన్‌హుస్సేన్‌ అనే విద్యార్థికి తూటా గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది.


హీరో, అతని తండ్రి హత్య

Untitled-5 copy.jpg

చాంద్‌పూర్‌ జిల్లా బగారాబజార్‌లో ఉంటున్న బంగ్లా నటుడు శాంటోఖాన్‌, అతని తండ్రి, సహ-నిర్మాత సెలీంఖాన్‌ను విద్యార్థులు కొట్టి చంపారు. విద్యార్థుల గుంపు ఇంటిని తగులబెట్టేందుకు రాగా.. వీరు తుపాకీతో కాల్పులు జరిపి, అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు వీరిని చుట్టుముట్టి, కర్రలతో కొట్టి, హతమార్చారు


ఇద్దరు క్రికెటర్ల ఇళ్లకు నిప్పు

Untitled-5 copy.jpg

బంగ్లాదేశ్‌ జాతీయ క్రికెటర్లకూ నిరసనల సెగ తాకింది. ఢాకాలోని మాజీ క్రికెటర్‌, ఎంపీ మష్రఫే మొర్తుజా, నజ్ముల్‌ హసన్‌ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించారు.


అవామీ నేత హోటల్‌లో 13 మంది సజీవ దహనం

Untitled-6 copy.jpg

జెస్సోర్‌ జిల్లాలోని అవామి లీగ్‌ ప్రధాన కార్యదర్శి షహీన్‌ చక్లాదర్‌కు చెందిన 14 అంతస్తుల ‘హోటల్‌ జబీర్‌ ఇంటర్నేషనల్‌’కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 13 మంది సజీవ దహనమయ్యారు. తప్పించుకునే ప్రయత్నంలో పైనుంచి కిందకు దూకిన 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. హోటల్‌లో ఇంకా ఎంత మంది చిక్కుకున్నారో తెలియదని స్థానికులు తెలిపారు.

Updated Date - Aug 06 , 2024 | 06:19 AM