BJP: హరియాణా అసెంబ్లీ ఎన్నికలు.. ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన బీజేపీ
ABN , Publish Date - Sep 05 , 2024 | 12:22 PM
హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేయగా.. గురువారం బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.
చండీగఢ్: హరియాణా అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలన్నీ అస్త్రశస్త్రాలతో సన్నద్ధమవుతున్నాయి. జమ్ముకశ్మీర్‌కి సంబంధించి కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కాగా.. హరియాణాకు సంబంధించి గురువారం బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది. 90 అసెంబ్లీ నియోజకవర్గాలున్న హరియాణాలో 67 స్థానాలకుగానూ బీజేపీ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కాగా ఇటీవలే ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి చేరిన వారికి టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇచ్చారు.
పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్న బీజేపీ మాజీ చీఫ్ ఓం ప్రకాశ్ ధంకర్ బద్లీ నుంచి, సీనియర్ నేత అనిల్ విజ్ అంబాలా కాంట్ నుంచి మళ్లీ బరిలో నిలిచారు. కొద్దిరోజుల క్రితం జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) నుంచి బీజేపీలో చేరిన దేవేందర్ సింగ్ బబ్లీ, సంజయ్ కబ్లానా, శృతి చౌదరి వరుసగా తోహానా, బెరీ, తోషమ్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి సైనీ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కర్నాల్ నుంచి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సన్నిహితుడిగా భావించే సీనియర్ నాయకుడు జగ్‌మోహన్ ఆనంద్‌ను బీజేపీ బరిలోకి దింపింది.
నయాబ్ సింగ్ సైనీని లాడ్వా స్థానం నుంచి పోటీ చేయనున్నారు. బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాలో మంత్రి సంజయ్ సింగ్, మాజీ మంత్రి సందీప్ సింగ్ సహా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేల ప్రస్తావన లేదు. నరేందర్ గుప్తా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఫరీదాబాద్ నుంచి మాజీ మంత్రి విపుల్ గోయల్ బరిలోకి దిగారు. మంత్రులు కన్వర్ పాల్, కమల్ గుప్తా, జై ప్రకాష్ దలాల్, మహిపాల్ ధండా, అభే సింగ్ యాదవ్, మూల్ చంద్ శర్మ పేర్లు జాబితాలో ఉన్నాయి.
వారికి సిట్టింగ్ స్థానంలోనే తిరిగి టికెట్లు కేటాయించారు. అక్టోబరు 1న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైనీనే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుపెడుతూ ఓట్లు అభ్యర్థిస్తోంది. అక్టోబర్ 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది.