Share News

Bombay High Court: ఐటీ రూల్స్‌ రాజ్యాంగ విరుద్ధం!

ABN , Publish Date - Sep 21 , 2024 | 05:03 AM

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో అమల్లోకి తెచ్చిన ఐటీ రూల్స్‌ను బాంబే హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఉద్దేశించిన ఐటీ రూల్స్‌ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది.

Bombay High Court: ఐటీ రూల్స్‌ రాజ్యాంగ విరుద్ధం!

  • నిబంధనలను కొట్టేసిన బాంబే హైకోర్టు

ముంబై, సెప్టెంబరు 20: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో అమల్లోకి తెచ్చిన ఐటీ రూల్స్‌ను బాంబే హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఉద్దేశించిన ఐటీ రూల్స్‌ రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొంది. ఇద్దరు సభ్యుల డివిజన్‌ బెంచ్‌ గత జనవరిలో ఈ అంశంపై భిన్న తీర్పులు ఇవ్వడంతో జస్టిస్‌ ఎ.ఎ్‌స.చంద్రశేఖర్‌కు తీర్పు బాధ్యతను అప్పగించారు. శుక్రవారం ఆయన తీర్పును వెలువరించారు. ఐటీ రూల్స్‌ రాజ్యాంగంలోని సమానత్వం హక్కు(ఆర్టికల్‌ 14), భావ వ్యక్తీకరణ హక్కు(ఆర్టికల్‌ 19), నచ్చిన వృత్తిని చేసుకొనే హక్కు(ఆర్టికల్‌ 19(1)(జి))లను ఉల్లంఘించే విధంగా ఉన్నాయని జస్టిస్‌ చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. వ్యక్తులు నచ్చిన పని చేసుకోవడంపై ఎలాంటి నియంత్రణ విధించవచ్చో ఆర్టికల్‌ 19(6)లో ఉందని, అలాంటి పరిస్థితి ఇక్కడ లేదని చెప్పారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఐటీ రూల్స్‌లో పేర్కొన్న ‘‘తప్పుడు, అబద్దపు, తప్పుదోవ పట్టించే’’ అనే పదాలు వ్యక్తపరిచే భావం అస్పష్టంగా ఉందని, స్పష్టమైన నిర్వచనం లేదని తెలిపారు. ఐటీ రూల్స్‌ను సవాలు చేస్తూ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కర్మ, ఎడిటర్స్‌ గిల్డ్‌, మరికొందరు ఈ పిటిషన్‌ వేశారు. గత జనవరిలో ఈ అంశం విచారణకు వచ్చినపుడు జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌ ఐటీ రూల్స్‌ను కొట్టేయగా, జస్టిస్‌ నీల గోఖలే ఐటీ రూల్స్‌ను సమర్థించారు. తాజాగా జస్టిస్‌ చంద్రశేఖర్‌ కూడా ఐటీ రూల్స్‌ను కొట్టేశారు. డిజిటల్‌ మీడియా నైతిక ప్రవర్తనా నియమావళిగా భావించే 2021 నాటి ఐటీ రూల్స్‌ను సవరిస్తూ 2023 ఏప్రిల్‌ 6న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు ఇచ్చింది. ఆ ఉత్తర్వు ప్రకారం పీఐబీ ఆధ్వర్యంలో ఫ్యాక్ట్‌ చెకింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్‌ ప్రభుత్వ కార్యకలాపాలకు వ్యతిరేకంగా తప్పుడు, తప్పుదోవ పట్టించే సమాచారం ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం లాంటి సోషల్‌ మీడియా వేదికల మీద వస్తే గుర్తించి సదరు సోషల్‌ మీడియా సంస్థకు సమాచారం అందజేస్తుంది.


ఫ్యాక్ట్‌ చెకింగ్‌ యూనిట్‌ నుంచి సమాచారం అందిన వెంటనే సదరు సోషల్‌ మీడియా సంస్థ ఆ పోస్టును తీసేయడమో లేక ఈ సమాచారం విశ్వసనీయతపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పడమో చేయాలి. మౌనంగా ఉండటం కుదరదు. రెండో ఆప్షన్‌ తీసుకుంటే ఆ పోస్టుపై ప్రభుత్వం తీసుకొనే చట్టపరమైన చర్యల విషయంలో సోషల్‌ మీడియా సంస్థకు ఎలాంటి రక్షణ ఉండదు. ఈ ఏడాది మార్చి 20న ఐటీ రూల్స్‌ అమల్లోకి వచ్చాయి. మార్చి 11న విచారణ జరిగినపుడు వాటిపై స్టే ఇచ్చేందుకు జస్టిస్‌ చంద్రశేఖర్‌ నిరాకరించారు. ఒక సమాచారం తప్పా ఒప్పా అని నిర్ధారించే అధికారం కోర్టుకు ఉండాలే తప్ప ప్రభుత్వానికి కాదని పిటిషనర్లు వాదించారు. సోషల్‌ మీడియా సంస్థలు అనవసరపు న్యాయవివాదాలను, తద్వారా తలెత్తే ఖర్చులను తప్పించుకొనే ప్రయత్నంలో ప్రభుత్వం సూచించిన అన్ని పోస్టులను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కునాల్‌ కర్మ తాను రాజకీయ విమర్శకుడనని, తన కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయాల్సి ఉంటుందని, ప్రభుత్వం ఐటీ రూల్స్‌ను అడ్డం పెట్టుకొని తన కంటెంట్‌ను ఏకపక్షంగా తొలగించే అవకాశం ఉందని, తన ఖాతాలను బ్లాక్‌ చేసే ప్రమాదం ఉందని వాదించారు. బాంబే హైకోర్టు తీర్పును ఎడిటర్స్‌ గిల్డ్‌ స్వాగతించింది.

Updated Date - Sep 21 , 2024 | 05:03 AM