Share News

Chandrababu Naidu : దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది

ABN , Publish Date - Sep 14 , 2024 | 04:16 AM

పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు.

Chandrababu Naidu : దేశం గొప్ప నాయకుడ్ని కోల్పోయింది

  • ఏచూరి పేదల కోసం పోరాడిన నేత.. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా: చంద్రబాబు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పేద ప్రజల కోసం పోరాడిన వ్యక్తి సీతారాం ఏచూరి అని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని వాళ్లు శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరితో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని తెలిపారు. అందుకే ఆయన్ను కడసారి చూసి, నివాళులు అర్పించేందుకు ఢిల్లీ వచ్చినట్లు చెప్పారు. చంద్రబాబు శుక్రవారమిక్కడ సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఏచూరి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏచూరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానన్నారు. 40 ఏళ్లుగా ఆయన్ను దగ్గరి నుంచి చూశానని, మంచి నాయకుడని చెప్పారు. ఎన్నో పోరాటాల్లో ఆయనతో కలిసి నడిచినట్లు తెలిపారు. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన సీతారాం అసాధారణ వ్యక్తిగా ఎదిగారన్నారు. కమ్యూనిజం పట్ల ఆసక్తి పెంచుకుని, ఆ పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగి, పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారని కొనియాడారు. అందరినీ నవ్వుతూ పలకరిస్తూ కలుపుగోలుగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. దేశం గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయినందుకు బాధగా ఉందని చెప్పారు. అంతకుముందు ఏచూరి మృతదేహన్ని ఎయిమ్స్‌ నుంచి జేఎన్‌యూకు తరలించారు. తర్వాత ఆయన స్వగృహానికి తరలించారు.


మరోవైపు, కేరళ సీఎం పినరయి విజయన్‌, జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ నేత, కాంగ్రెస్‌ నేత కన్నయకుమార్‌ తదితరులు ఏచూరి మృతదేహనికి నివాళులు అర్పించారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, పార్టీ నేతలు జూలకంటి రంగారెడ్డి, వీరయ్య, బి.వెంకట్‌ తదితరులు నివాళులర్పించారు.

  • నేడు ఎయిమ్స్‌కు భౌతిక కాయం

సీతారాం ఏచూరి భౌతిక కాయాన్ని నేడు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీపీఎం ప్రధాన కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం ఏచూరి కోరిక మేరకు ఆయన మృతదేహన్ని ఎయిమ్స్‌కు అప్పగించనున్నారు.

Updated Date - Sep 14 , 2024 | 04:17 AM