Share News

Tanya Singh: మోడల్ ఆత్మహత్య వెనుక రహస్యం ఏంటి? అభిషేక్ శర్మకు సమన్లు ఎందుకు?

ABN , Publish Date - Feb 22 , 2024 | 02:58 PM

మోడల్ తాన్యా సింగ్ (Tanya Singh) ఆత్మహత్య కేసు తాజాగా ఊహించని మలుపు తిరిగింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మకు (Abhishek Sharma) ఈ ఆత్మహత్య కేసులో ఏదో ఒక కనెక్షన్ ఉండొచ్చని గుజరాత్ పోలీసులు కుండబద్దలు కొట్టారు. ఈ తరుణంలోనే అతడిని విచారణకు పిలిచారు.

Tanya Singh: మోడల్ ఆత్మహత్య వెనుక రహస్యం ఏంటి? అభిషేక్ శర్మకు సమన్లు ఎందుకు?

మోడల్ తాన్యా సింగ్ (Tanya Singh) ఆత్మహత్య కేసు తాజాగా ఊహించని మలుపు తిరిగింది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అభిషేక్ శర్మకు (Abhishek Sharma) ఈ ఆత్మహత్య కేసులో ఏదో ఒక కనెక్షన్ ఉండొచ్చని గుజరాత్ పోలీసులు కుండబద్దలు కొట్టారు. ఈ తరుణంలోనే అతడిని విచారణకు పిలిచారు. తమ ప్రాథమిక విచారణలో భాగంగా.. తాన్యాసింగ్, అభిషేక్ శర్మ స్నేహితులన్న విషయం తేలిందని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వీఆర్ మల్హోత్రా తెలిపారు. తాము తాన్యా ఫోన్‌ని పరిశీలించగా.. వాట్సాప్‌లో అభిషేక్‌కు ఆమె ఒక మెసేజ్ పంపిందని, అయితే అందుకు అతను సమాధానం ఇవ్వలేదని వెల్లడించారు. ప్రస్తుతం తాము ఈ కేసుని విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆయన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.


కాగా.. పోలీసులు ఇంతవరకు అభిషేక్ శర్మను సంప్రదించలేదని, అయితే మరింత వివరణ కోసం పోలీసులు అతనిని విచారణకు పిలిచారని తెలిసింది. వాట్సాప్‌లో (WhatsApp) ఆమె సందేశానికి అభిషేక్ సమాధానం ఇవ్వకపోవడం, వీరి ‘స్నేహం’ అనే అంశాలు.. ఈ కేసు దర్యాప్తులో ప్రధానంగా నిలిచాయి. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. ఆమె ఫోన్ నంబర్‌ను అభిషేక్ శర్మ బ్లాక్ చేశాడని, సోషల్ మీడియాలోనూ (Social Media) ఆమె మెసేజ్‌లకు రిప్లై ఇవ్వలేదని తెలుస్తోంది. గత కొంతకాలం నుంచి వీరి మధ్య దూరం పెరిగిందని సమాచారం. చాలాకాలం నుంచి మంచి స్నేహితులుగా మెలుగుతున్న వీరి మధ్య దూరం పెరగడానికి గల కారణాలేంటి? అనే కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఏదేమైనా.. అభిషేక్‌ను ఈ కేసు విచారణకు పిలవడంతో.. తాన్యా ఆత్మహత్యకు, అతనికి ఏమైనా లింక్ ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇదిలావుండగా.. గుజరాత్‌కు చెందిన తాన్యా సింగ్ ఆదివారం రాత్రి సూరత్‌లోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం ఆమెను నిద్రలేపడానికి తండ్రి భన్వర్ సింగ్ రూమ్‌లోకి వెళ్లి చూడగా.. తాన్యా విగతజీవిగా కనిపించింది. దీంతో.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు వెంటనే రంగంలోకి దిగారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలేంటో వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ శర్మ అంశం తెరమీదకి వచ్చింది. మరి, ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Updated Date - Feb 22 , 2024 | 02:58 PM