Share News

Delhi : సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్‌

ABN , Publish Date - Jun 27 , 2024 | 03:22 AM

ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.

Delhi : సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్‌

  • 3 రోజులకు అనుమతించిన ప్రత్యేక కోర్టు

  • మద్యం కేసులో ఆయనది కీలక పాత్ర

  • తప్పంతా సిసోడియాదేనంటున్నారు

  • సీబీఐ న్యాయవాది వాదనలు

  • ఇది మీడియా వేదికగా సీబీఐ కుట్ర: కేజ్రీవాల్‌

    Untitled-2 copy.jpg

న్యూఢిల్లీ, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మూడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు, తిహాడ్‌ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను కేసు విచారిస్తున్న ప్రత్యేకకోర్టు ఎదుట హాజరుపర్చినప్పుడు.. న్యాయాధికారి అమితాబ్‌ రావత్‌ అనుమతి మేరకు సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. మద్యం కుంభకోణంలో ప్రశ్నించటానికి వీలుగా కేజ్రీవాల్‌ను తమకు అయిదు రోజుల కస్టడీకి అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి చేసింది. దీనిపై తొలుత తీర్పును రిజర్వు చేసిన అమితాబ్‌ రావత్‌.. మూడు రోజుల కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయాన్ని వెలువరించారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. కాగా, కోర్టులో విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ తన వాదనలను స్వయంగా వినిపించారు. ‘మొత్తం తప్పంతా మనీష్‌ సిసోడియాదేనని నేను ఒక ప్రకటన చేశానంటూ సీబీఐ వర్గాలను ఉటంకిస్తూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

నేను అటువంటి ప్రకటన ఎన్నడూ చేయలేదు. సిసోడియా, ఆమ్‌ఆద్మీపార్టీ, నేను నిర్దోషులం. ఇదంతా మా ప్రతిష్ఠను దెబ్బతీయటానికి మీడియా వేదికగా సీబీఐ చేస్తున్న కుట్ర’ అని తెలిపారు. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. తాము వాస్తవాల ఆధారంగానే వాదనలు వినిపిస్తున్నామని, మీడియాతో సీబీఐ వర్గాలు ఎవరూ మాట్లాడలేదని చెప్పారు. ‘ఈ కేసులో సహనిందితుడైన విజయ్‌ నాయర్‌ తన కింద పని చేశాడన్న సంగతిని కూడా కేజ్రీవాల్‌ అంగీకరించటం లేదు. అతిషీ మర్లేనా, సౌరభ్‌ భరద్వాజ్‌ల కింద నాయర్‌ పని చేశాడని చెబుతున్నారు. మొత్తం తప్పంతా మనీశ్‌ సిసోడియాదేనని అంటున్నారు. అందువల్ల, కేసుకు సంబంధించిన పత్రాలను ఆయన ముందుపెట్టి ప్రశ్నించాల్సి ఉంది. ఈ మేరకు సీబీఐ కస్టడీకి అప్పగించాలి’ అని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, కేజ్రీవాల్‌ తరఫు న్యాయవాది సీబీఐ అభియోగాలను తప్పుబడుతూ, వారి రిమాండ్‌ అప్లికేషన్‌ పూర్తి అస్పష్టంగా ఉందని, ఇది అధికార దుర్వినియోగానికి ఒక మచ్చుతునక అని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు నుంచి పిటిషన్‌ ఉపసంహరణ

మద్యం కేసులో విచారణ కోర్టు తనకు ఇచ్చిన బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించటాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ కొనసాగించినప్పుడు.. ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకోవటానికి కేజ్రీవాల్‌ అనుమతి కోరారు. బెయిల్‌పై స్టే విధిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వటం, మరోవైపు, ఇదే కేసులో సీబీఐ కేజ్రీవాల్‌ను అరెస్టు చేయటం వంటి తాజా పరిణామాల దృష్ట్యా.. పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని, పూర్తి వివరాలతో తర్వాత అప్పీల్‌ దాఖలు చేస్తామని ఆయన తరఫు న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. దీనికి న్యాయమూర్తులు అంగీకరించారు. దీంతో పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. జైలు నుంచి తన భర్త బయటకు రాకుండా వ్యవస్థలన్నీ కట్టగట్టుకొని పని చేస్తున్నాయని, దేశంలో చట్టబద్ధపాలన లేదని, నియంతృత్వం, ఎమర్జెన్సీ నడుస్తోందని కేజ్రీవాల్‌ భార్య సునీత ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Jun 27 , 2024 | 03:25 AM