Delhi: తప్పుడు పత్రాలతో ఐఏఎస్?
ABN , Publish Date - Jul 13 , 2024 | 04:01 AM
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యేందుకు దివ్యాంగ, ఓబీసీ కోటాను ఆమె దుర్వినియోగం.....
పూజా ఖేద్కర్‌పై తీవ్ర ఆరోపణలు..
రుజువైతే సర్వీస్ నుంచి అవుట్
న్యూఢిల్లీ, జూలై 12: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వరుస వివాదాల్లో కూరుకుపోతున్నారు. అఖిల భారత సర్వీసుకు ఎంపికయ్యేందుకు దివ్యాంగ, ఓబీసీ కోటాను ఆమె దుర్వినియోగం చేశారని తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఆమె తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు రావడంతో విచారణ చేసేందుకు కేంద్రం ఓ కమిటీని నియమించింది.
ప్రొబేషనరీ టైమ్‌లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొన్న పూజను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. 2023 బ్యాచ్‌కు చెందిన ఆమె యూపీఎ్‌ససీ పరీక్షలో 841 ర్యాంక్ సాధించారు. ఆమె ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కోటాలో ఐఏఎ్‌సకు ఎంపికైనట్టు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలు ఉన్నట్టు పేర్కొన్నారని తెలిపారు.
అయితే శిక్షణ పొందేందుకు లాల్ బహుదూర్ శాస్త్రి అకాడమీలో జాయిన్ అయ్యాక సమర్పించిన ఆస్తుల ధ్రువీకరణ పత్రంలో రూ.22 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారని వెల్లడించారు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికెట్, ఆస్తుల ధ్రువీకరణ పత్రంలో పూజ పేర్కొన్న వివరాల్లో పొంతన లేదని..
ఈ విషయం యూపీఎ్‌ససీ, సిబ్బంది శిక్షణ విభాగం పరిశీలనలో ఉందని పలువురు ఐఏఎస్ అధికారులు తెలిపారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన పూజ తండ్రి దిలీప్ కొండిబా ఖేద్కర్ అఫిడవిట్‌లో తనకు 40 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పూజ తప్పుడు పత్రాలు సమర్పించి ఐఏఎ్‌సకు ఎంపికైనట్టు రుజువైతే ఆమెను సర్వీసు నుంచి తొలగించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.