Exit Polls Fail: సర్వే సంస్థల అంచనాలు బోల్తా.. ప్రజల నాడి పసిగట్టడంతో విఫలం..
ABN , Publish Date - Oct 09 , 2024 | 02:45 PM
కేకే సంస్థ అంచనాలు తప్పాయి. ఎన్‌డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్, దైనిక్ భాస్కర్, పీపుల్ పల్స్, మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్, పీ మార్క్, సీ ఓటర్ సంస్థల అంచనాలు తప్పాయి. అసలు సర్వే సంస్థల అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై భిన్నభిప్రాయాలు..
హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో సర్వే సంస్థలు బోల్తా కొట్టాయి. ప్రజల నాడిని పసిగట్టడంలో విఫలమయ్యాయి. పేరున్న సంస్థలు సైతం వెల్లడించిన అంచనాలు తలకిందులు కావడంతో ఎగ్జిట్‌పోల్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. అసలు సర్వేలు చేసి అంచనాలు ప్రకటిస్తున్నారా.. ఆఫీసుల్లో కూర్చుని అంకెలు ఇస్తున్నారా అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సంస్థల కోసం తప్పుడు అంచనాలు ఇస్తున్నాయా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్క సంస్థ తప్పు చెప్పిందంటే అనుకోవచ్చు. అన్ని సంస్థలు ఒకే రకమైన అంచనాలను వెల్లడించడంతో సామాన్య ప్రజలు సర్వే సంస్థల అంచనాలకు వాస్తవ ఫలితాలు దగ్గరగా ఉండొచ్చనే అభిప్రాయానికి వస్తాడు. ఇటీవల కాలంలో కొన్ని ఆన్‌లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్‌లు ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగ్ ఆప్షన్‌ను యాడ్ చేశాయి. దీంతో ఆన్‌లైన్ బెట్టింగ్ సంస్థల్లో పందేం వేసి కోట్లు కోల్పోయిన ఘటనలు చూస్తున్నాం. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కోసం తప్పుడు లెక్కలను ఇస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో హర్యానాలో సర్వే సంస్థలు ఎందుకు విఫలమయ్యాయనే చర్చ జోరుగా సాగుతోంది. కొన్ని జాతీయ సర్వే సంస్థలతో పాటు.. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వాస్తవ ఫలితాలకు దగ్గరగా అంచనాలను వెల్లడించిన కేకే సర్వే సైతం హర్యానా అంచనాలు చెప్పడంతో విఫలమైంది. కాంగ్రెస్‌కు 75 సీట్లు వస్తాయని, రాసి పెట్టుకోవాలంటూ ఆయన జాతీయ మీడియా సంస్థలకు సవాల్ విసిరారు. మిగతా సర్వే సంస్థలకు భిన్నంగా సింగిల్ నెంబర్ ఇస్తున్నానని.. వాస్తవ ఫలితాలు తన అంచనాలను ప్రతిబింబిస్తాయని కేకే చెప్పారు. కానీ హర్యానాపై కేకే అంచనాలు పూర్తిగా తప్పాయి. హర్యానాపై ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించినప్పుడు, అంతకంటే ముందు కేకే తన సర్వే వివరాలు వెల్లడిస్తూ దేశ వ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతోందని, రానున్న రోజుల్లో జరిగే ప్రతి ఎన్నికల్లో ఓటమి చవిచూస్తుందని అంచనా వేశారు. దీంతో ఆయన సర్వేపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. కేకే సంస్థ అంచనాలు తప్పాయి. ఎన్‌డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్, దైనిక్ భాస్కర్, పీపుల్ పల్స్, మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్, పీ మార్క్, సీ ఓటర్ సంస్థల అంచనాలు తప్పాయి. అసలు సర్వే సంస్థల అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంచనాలు ఎందుకు తప్పాయి..
ఏవైనా ఎన్నికల సమయంలో సర్వే సంస్థలు కొంతమంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించి.. వాటి ఆధారంగా అంచనాలను వెల్లడిస్తాయి. ముందుగా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణాన్ని గమనిస్తే ఏ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారనే విషయం తెలుస్తుంది. ఆ తర్వాత సామాజిక వర్గాల వారీ కొందరి అభిప్రాయాలను సేకరిస్తారు. వీటన్నింటినికి కొన్ని సూత్రలను అమలుచేసి సర్వే సంస్థలు తమ అంచనాలు వెల్లడిస్తాయి. ఒక్కో సంస్థకు సర్వే విధానం ఒకోవిధంగా ఉంటుంది. హర్యానా విషయంలో మాత్రం సర్వే సంస్థలు తక్కువ శాంపిల్స్ సేకరించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వర్గాల వారీ శాంపిల్స్ సేకరణలో విఫలమైనట్లు వాస్తవ ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. ఒకటి రెండు సంస్థలు మినహా మిగతా సంస్థలన్నీ ఒకే రకమైన అంకెలను వెల్లడించాయి. ప్రధానంగా బీజేపీ పదేళ్లుగా హర్యానాలో అధికారంలో ఉండటంతో ఆ పార్టీ మూడోసారి గెలిచే అవకాశం లేదన్న అంచనాతోనే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయా అనే అనుమానం కలుగుతోంది. ఈ కారణంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
జాట్‌ల కారణంగా..
ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు, వాస్తవ ఫలితాలు పోల్చిచూసినప్పుడు జాట్ సామాజిక వర్గం ఓటర్ల అభిప్రాయాలను సర్వే సంస్థలు ఎక్కువుగా సేకరించినట్లు అర్థమవుతోంది. హర్యానాలో జాట్ ఓటర్లు ఎక్కువుగా కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిన విషయం వాస్తవమే. అదే సమయంలో జాట్‌లకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగతా వర్గాలన్నీ బీజేపీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. జాట్ సామాజిక వర్గం హర్యానాలో బలంగా ఉండటంతో ఆ సామాజిక వర్గం పార్టీల గెలుపును ప్రభావితం చేస్తాయనే అంచనా కారణంగానే సర్వే సంస్థల ఎగ్జిట్‌పోల్స్ తప్పాయనే అభిప్రాయం వినిపిస్తోంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here