Former CM: లోక్‌సభ ఎన్నికలకు మాజీసీఎం వ్యూహం.. అప్పుడే 15 మంది అభ్యర్థుల ఎంపిక
ABN , Publish Date - Jan 07 , 2024 | 09:00 AM
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) కొత్త సంవత్సరంలో సరికొత్త వ్యూహంతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) కొత్త సంవత్సరంలో సరికొత్త వ్యూహంతో లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయక మునుపే, కూటమిని పాత పార్టీలతో కొనసాగించాలా? లేక కొత్త పార్టీలను కలుపుకుని మెగా కూటమిని ఏర్పాటు చేయాలా? అనే విషయాలపై నిర్ణయాలను పక్కనబెట్టి అత్యంత వేగంగా అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించారు. ఆ మేరకు 15 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అంతటితో ఆగకుండా ఆ నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా లోక్‌సభ ఎన్నికల ప్రచారం కూడా సాగించమంటూ పార్టీ శ్రేణులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటి నుంచి ఈపీఎస్ పార్టీని కొత్త మార్గంలో పయనింపజేస్తున్నారని ఆ పార్టీలోని సీనియర్ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే బలమైన పార్టీలతో మెగా కూటమిని ఏర్పాటు చేసుకుని బరిలోకి దిగుతుందని ఈపీఎస్ పదే పదే ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఊహించని విధంగా లోక్‌సభ ఎన్నికలకు అప్పుడే పార్టీని సిద్ధం చేసేందుకు వేగవంతమైన చర్యలు చేపడుతున్నారు. అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే మాత్రమే చేరే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే డీఎండీకే నేతలు చివరి క్షణంలో డీఎంకే కూటమిలో చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని పేర్కొంటున్నారు. కనుక ఆ పార్టీ కూటమిలో చేరినా, చేరకపోయినా పార్టీకి ఎలాంటి నష్టం కలగదని ఈపీఎస్ భావిస్తున్నారు. మెగా కూటమిలో కొత్త పార్టీలు చేరే అవకాశం లేదని నిర్ణయానికి వచ్చిన ఈపీఎస్ ప్రస్తుతం 15 లోక్‌సభ నియోజకవర్గాలకు పార్టీ అభ్యర్థుల జాబితాను రహస్యంగా విడుదల చేశారు.
అభ్యర్థులు వీరే...: సౌత్‌చెన్నైలో డాక్టర్ జయవర్థన్, సెంట్రల్ చెన్నైలో ఎస్‌ఆర్ విజయకుమార్, నార్త్ చెన్నైలో రాయపురం మనో, విరుదునగర్‌లో మాఫాయ్ పాండ్యరాజన్, సేలంలో సెమ్మలై, కోయంబత్తూరులో చంద్రశేఖర్, కరూరులో మాజీ మంత్రి విజయభాస్కర్, ఈరోడ్‌లో వి. రామలింగం, మదురైలో రాజ్‌సత్యన్, దిండుగల్‌లో కన్నన్, కృష్ణగిరిలో కేపీఎం సతీష్ కుమార్, కల్లకురిచ్చిలో రాధాకృష్ణన్, తూత్తుకుడిలో షణ్ముగనాథన్ లేదా శరవణ పెరుమాళ్‌ను పోటీకి దింపనున్నట్లు ప్రకటించారు.
మిత్ర పక్షాలకూ కొన్ని...
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మిత్రపక్షాలకు ఈ నియోజకవర్గాలు మినహా తక్కిన నియోజకవర్గాలో కొన్నింటిని కేటాయించాలని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతం నూటికి నూరుశాతం అన్నాడీఎంకే పోటీ చేయనున్న ఈ 15 లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించమని జిల్లా శాఖ నేతలకు, స్థానిక పార్టీ ప్రముఖులకు ఆదేశాలు జారీ చేశారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేలా ప్రచారం సాగాలని కూడా సూచించారు. ప్రస్తుతం తాను ఎంపిక చేసిన అభ్యర్థులపై ఆయా నియోజకవర్గాల్లో వారికున్న ప్రజల మద్దతును కూడా ఎప్పటికప్పుడు పరిశలించి ఆ వివరాలతో తనకు ప్రతినెలా నివేదిక కూడా పంపాలని ఈపీఎస్ ఆదేశించా రు. ఈపీఎస్ ఇలా తమతో సంప్రదించకుండా అభ్యర్థులను ఎంపిక చేయడం చూసి పార్టీ సీనియర్ నేత లు విస్తుపోతున్నారు. ఇక కూటమిలో ఉన్న పార్టీలకు లోక్‌సభ ఎన్నికల్లో సీట్లు పెంచే ప్రసక్తి లేదని కూడా ఈపీఎస్ చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు డీఎంకేతో ఢీకొనాలంటే కూటమిలో తక్కువ పార్టీలు ఉంటేనే మంచిదని ఆయన భావిస్తున్నారు. ప్రత్యేక ఓటు బ్యాంకు కలిగిన పార్టీలకు ఒకటి రెండు సీట్లకు మించి కేటాయించకూడదనే యోచనలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో వీలైనంత ఎక్కువ స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేస్తేనే జాతీయ స్థాయిలో పార్టీ బలం పెరుగుతుందని ఈపీఎస్ విశ్వసిస్తున్నారు.