Share News

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

ABN , Publish Date - Aug 08 , 2024 | 11:04 AM

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి..

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్జీ మృతి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ (80) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన.. కోల్‌కతాలోని తన నివాసంలో కన్నుమూశారు. గతేడాది న్యుమోనియా సోకడంపాటు పలు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో తరుచూ ఆస్పత్రికి వెళ్లి వస్తుండేవారు. అయితే గురువారం నాడు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు లోనైన బుద్ధదేవ్ మృతిచెందారు. పెద్దాయన ఇకలేరన్న వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సీపీఎం కార్యకర్తలు, నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా.. భట్టాచార్జీకి భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు.


Buddhadeb-1.jpg

ఎవరీ బుద్ధదేవ్..?

మార్చి-01, 1944న బెంగాళీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన బుద్దదేవ్.. కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత చదువులు చదివారు. బెంగాల్ సాహిత్యం చదివిన ఆయన.. ఉపాధ్యాయుడిగా కెరీర్ మొదలుపెట్టారు. ఇక ప్రజాసేవే లక్ష్యంగా 1966 రాజకీయాల్లోకి వచ్చి.. పలు ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 1968లో జరిగిన వియత్నాం ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. ఈ క్రమంలోనే.. 1968లో యువజన విభాగం అయిన డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రమోద్ దాస్‌గుప్తా.. బుద్దదేవ్‌కు గురువు అని చెప్పుకుంటూ ఉంటారు. 1977లో కాశీపూర్-బెల్గాచియా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారే గెలవడమే కాదు.. సమాచార శాఖా మంత్రిగా పదవి కూడా దక్కించుకున్నారు. 1982లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోసిపూర్ నియోజకవర్గం నుంచి 1982లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత.. 1984లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.1987లో జాదవ్‌పూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కూడా.. మొదటిసారి మాదిరిగానే సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో సమాచార శాఖతో పాటు సాంస్కృతిక వ్యవహారాలు, పట్టణాభివృద్ధి, మునిసిపల్ వ్యవహారాల శాఖలకు మంత్రిగా తన కర్తవ్యాలను నిర్వర్తించారు. అలా పార్టీకి విధేయుడిగా ఉండటంతో పాటు.. పోటీచేసిన నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనపైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయని అప్పట్లో పెద్ద చర్చే జరగడం.. కొన్ని నెలల వ్యవధిలోనే తిరిగి జ్యోతిబసు మంత్రివర్గంలో చేరారు.


Buddhadeb-2.jpg

సీఎంగా ఇలా..!

1996 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జ్యోతిబసుకు అనారోగ్యంతో బాధపడుతుండటంతో నాడు సీనియర్‌గా ఉన్న భట్టాచార్జీకి డిప్యూటీ సీఎం, హోం శాఖ కూడా బాధ్యతలు కూడా అప్పగించారు. 2000లో బసు రాజకీయాలకు దూరమైన తర్వాత బుద్దదేవ్ దశ తిరిగింది. ఆ తర్వాత పార్టీకి అన్నీ తానై 2001 ఎన్నికల్లో పార్టీని గెలిపించి.. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత జరిగిన 2006 అసెంబ్లీ ఎన్నికల్లోనూ సీపీఎం గెలుపులో ప్రధానపాత్ర పోషించారు. దీంతో రెండోసారీ సీఎంగా ఎన్నికయ్యారు. అలా.. జ్యోతిబసు తర్వాత ముఖ్యమంత్రిగా మంచి పేరు సంపాదించుకున్న భట్టాచార్జీ.. నాడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, సంస్కరణలతో పార్టీ ఓటమిని చవిచూసింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పటికీ సాధారణ జీవితాన్నే గడుపుతూ వచ్చారు. బాలీగంజ్‌లోని చిన్న ఇంట్లోనే నివసించడం, సీఎంగా కూడా ఇక్కడ్నుంచే విధులు నిర్వర్తించడం ఈయన స్పెషాలిటీ. ఆఖరికి అదే ఇంటిలోనే తుదిశ్వాస కూడా విడిచారు.


Buddhadeb-3.jpg

అన్నీ తానై..!

సాధారణ కార్యకర్తతో మొదలైన ఆయన జీవితం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వరకూ వెళ్లింది. రెండు దఫాలుగా సీఎంగా పనిచేసిన భట్టాచార్జీ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జ్యోతిబసు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు.. జాతీయ రాజకీయాల్లోనూ ఈయన పేరు ఎక్కువగా వినిపించేది. 34 ఏళ్ల పాటు పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ పాలన సాగగా.. ఇందులో బుద్ధదేవ్ పాత్ర కీలకం. మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ చారిత్రాత్మక విజయం సాధించినప్పుడు 2011 ఎన్నికల్లో భట్టాచార్జీ సీపీఎంకు అన్నీ తానై ముందుకు నడిపించారు. ఈయన హయాంలో జరిగిన సింగూర్ టాటా నానో వివాదం, నందిగ్రామ్ హింస ఎప్పటికీ రాష్ట్ర ప్రజలు మరిచిపోలేరని చెబుతుంటారు. ఈ వివాదాల కారణంగానే పార్టీ నుంచి బయటికి పంపడం, కాంగ్రెస్‌లో చేరడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఇదిలా ఉంటే జనవరి 2022లో నాటి కేంద్ర మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను అందించగా.. అవార్డును తిరస్కరించారు.

Updated Date - Aug 08 , 2024 | 12:12 PM