Share News

H-4 visa : హెచ్‌-4 వీసా ఉంటే.. ఆటోమేటిక్‌గా వర్క్‌ ఆథరైజేషన్‌

ABN , Publish Date - Feb 06 , 2024 | 03:39 AM

అమెరికాలో వివిధ రంగా ల్లో సేవలందిస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు శుభవార్త..! హెచ్‌-1బీ వీసాదారులపై ఆధారపడే వారికి (భాగస్వామి, పిల్లలు) అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అడ్డంకులు తీరిపోనున్నాయి. హెచ్‌-4 వీసా ఉన్న డిపెండెంట్లకు ఆటోమేటిక్‌గా ‘వర్క్‌ ఆథరైజేషన్‌’ వర్తించేలా కీలక బిల్లు ‘జాతీయ భద్రత ఒప్పందం’ను ఆదివారం అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల

H-4 visa : హెచ్‌-4 వీసా ఉంటే.. ఆటోమేటిక్‌గా వర్క్‌ ఆథరైజేషన్‌

హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు, పిల్లలకు అవకాశాలు

ఏటా సుమారు లక్ష మందికి లబ్ధి

ఐ1, ఐ2, ఐ3 వీసాలున్నవారికీ చాన్స్‌

కీలక బిల్లును ఆమోదించనున్న సెనేట్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి5: అమెరికాలో వివిధ రంగా ల్లో సేవలందిస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు శుభవార్త..! హెచ్‌-1బీ వీసాదారులపై ఆధారపడే వారికి (భాగస్వామి, పిల్లలు) అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అడ్డంకులు తీరిపోనున్నాయి. హెచ్‌-4 వీసా ఉన్న డిపెండెంట్లకు ఆటోమేటిక్‌గా ‘వర్క్‌ ఆథరైజేషన్‌’ వర్తించేలా కీలక బిల్లు ‘జాతీయ భద్రత ఒప్పందం’ను ఆదివారం అమెరికా సెనేట్లో ప్రవేశపెట్టారు. రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఈ బిల్లు ఆమోదానికి ఇరువర్గాలు అంగీకరించాయి. దీంతో ఈ బిల్లు ఆమోదం పొందడం లాంఛనమే..! ఈ బిల్లు వల్ల సుమారు లక్ష మందికి లబ్ధి చేకూరుతుందని అంచనా. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వృత్తి నిపుణులకు హెచ్‌-1బీ వీసాలివ్వడం తెలిసిందే. వారిపై ఆధారపడే భాగస్వాములు, పిల్లల కు హెచ్‌-4 వీసాలను జారీ చేస్తారు. 21ఏళ్లు దాటాక హెచ్‌-4 వీసా లేకుంటే అలాంటి పిల్లలు డీపోర్ట్‌ (తిరిగి స్వదేశానికి పంపడం) అయ్యే ప్రమాదముంటుంది. అలాంటి వారు ఎనిమిదేళ్లకు పైగా డిపెండెంట్‌గా అమెరికాలోనే ఉంటే హెచ్‌-4 జారీకి మార్గం సుగమమవుతుంది. ఒకవేళ హెచ్‌-4 వీసా జారీ అయినా అమెరికా హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ నిబంధనల ప్రకారం ఎంప్లాయ్‌మెంట్‌ ఆథరైజేషన్‌ డాక్యుమెంట్‌(ఈఏడీ), ఐ-765 కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తై.. ఆథరైజేషన్‌ వస్తే తప్ప హెచ్‌-4 వీసాదారులు ఉద్యోగాలు చేసుకోవడానికి వీల్లేదు. ఈఏడీ రావడానికి కనీసం ఆర్నెల్ల పాటు నిరీక్షించాల్సిందే..! ‘‘హెచ్‌-4 వీసాదారుల ఇబ్బందులను దూరం చేస్తూ ఆటోమేటిక్‌గా ఈఏడీ లభించేలా రూపొందించిన బిల్లుకు ఆమోదముద్ర పడనుంది.

ఈ బిల్లు ఆమోదం పొందితే ఏటా 18 వేల మందికి ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు జారీ అవుతాయి. ఇప్పటికే ఉన్న దరఖాస్తులకు ఇవి తోడైతే ఐదేళ్లలో 1.58 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. పర్యాటకం, వైద్యం, వ్యాపారం వంటి తాత్కాలిక పనుల నిమిత్తం అమెరికాకు వచ్చేవారికి జారీచేసే వలసేతర వీసా (ఐ1, ఐ2, ఐ3)ఉన్న వారిలో ఏడాదికి 25వేల మందికి కూడా తాజా బిల్లుతో ఉద్యోగం చేసుకోవడంలో అడ్డంకులు తొలిగిపోతాయి’’ అని వైట్‌హౌస్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా స్పందించారు. ‘‘కొత్తగా తీసుకొస్తున్న బిల్లు వలసదారుల భాగస్వాములు, పిల్లలకు అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఈ నిర్ణయం మన దేశాన్ని బలోపేతం చేస్తుంది. సరిహద్దులను సురక్షితం చేస్తుంది. చట్టబద్ధంగా వలసలకు అవకాశం కల్పిస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. 2015లోనే ఒబామా సర్కారు ఈ తరహా నిర్ణయం తీసుకుంది. దాంతో శాస్త్రసాంకేతిక రంగాల్లో నైపుణ్యం ఉన్న భారతీయులకు కొంతఊరట కలిగింది. తర్వాత అధికారంలోకి వచ్చిన ట్రంప్‌ ఈ నిర్ణయంపై ఆంక్షలు విధించారు. ఇప్పుడు హెచ్‌-4 వీసాదారులకు అవకాశాలు కల్పించేందుకు బైడెన్‌ సర్కారు సిద్ధమవుతుండడం పట్ల హెచ్‌-4వీసాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 06 , 2024 | 03:39 AM