Share News

Vinesh Phogat: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకంజ

ABN , Publish Date - Oct 08 , 2024 | 11:44 AM

Haryana Election Results 2024: హర్యానాలో మెజార్టీ సీట్లు దక్కించుకుని ప్రభుత్వాని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో ఆధిక్యం కనబర్చిన హస్తం పార్టీ.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కొంచెం వెనుకపడింది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హర్యానాలో బీజేపీకి మెజార్టీ మార్క్‌కు దగ్గరగా ఉంది.

Vinesh Phogat: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. రెజ్లర్ వినేశ్ ఫోగట్ వెనుకంజ
Vinesh Phogat

Haryana Election Results 2024: హర్యానాలో మెజార్టీ సీట్లు దక్కించుకుని ప్రభుత్వాని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లలో ఆధిక్యం కనబర్చిన హస్తం పార్టీ.. ఈవీఎం ఓట్ల లెక్కింపులో కొంచెం వెనుకపడింది. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే హర్యానాలో బీజేపీకి మెజార్టీ మార్క్‌కు దగ్గరగా ఉంది. ఇప్పటివరకు ఎన్నికల సంఘం అధికారికంగా వెల్లడించిన ఫలితాల ప్రకారం బీజేపీ 49 స్థానాలో, కాంగ్రెస్ 35 స్థానాల్లో, ఐఎన్‌ఎల్‌డీ ఒకటి, బీఎస్పీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు నాలుగు స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హర్యానాలో ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటినుంచి బీజేపీపై ప్రజలు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారం జరిగింది. రైతు ఉద్యమాలు కమలం పార్టీని దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని సర్వే సంస్థలు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. ప్రస్తుతం ఫలితాల సరళి చూస్తే మాత్రం హర్యానా ప్రజలు మరోసారి బీజేపీని ఆదరించినట్లు తెలుస్తోంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఆ పార్టీ మెజార్టీ మార్క్ సాధించకపోవడానికి కారణంగా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా సీఎం అభ్యర్థి విషయంలో భూపేంద్రసింగ్ హుడా, కుమారి షెల్జా తీవ్రంగా పోటీపడ్డారు. షెల్జా ఈ ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొనలేదు. హుడాకే అధిష్టానం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపించడంతో ఆమె కొంత అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరిగింది. తాను సీఎం రేసులో ఉన్నానని బహిరంగంగానే షెల్జా ప్రకటించారు. ఇవ్వన్నీ కలిసి కాంగ్రెస్‌కు నష్టం చేసినట్లు తెలుస్తోంది. హర్యానా ఎన్నికల్లో అందరినీ దృష్టిని ఆకర్షించిన మరొకరు రెజ్లర్ వినేశ్ ఫోగట్. ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జులానా నుంచి పోటీచేశారు. ప్రస్తుతం ఆమె వెనుకంజలో ఉన్నారు.


ఫోగట్ వెనుకంజ..

పారిస్ ఒలింపిక్స్ తర్వాత వినేశ్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. పతకానికి ఒకడుగు దూరంలో బరువు ఎక్కువుగా ఉన్నారనే కారణంగా ఆమె ఫైనల్స్‌లో పాల్గొనలేకపోయింది. దీంతో ఆమె పేరు ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు రెజ్లర్ల ఉద్యమంలో ఆమె కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తూ వస్తున్నారు. రైతు చట్టాల విషయంలోనూ, రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఘటనలోనూ కేంద్రప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుపడుతూ వచ్చారు. హర్యానా ఎన్నికల వేళ ఫోగట్ కాంగ్రెస్‌లో చేరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెజ్లర్ బజరంగ్ పూనియాతో కలిసి ఫోగట్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి ఆమెను బీజేపీ సైతం టార్గెట్ చేసింది. జులానా నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ తన అభ్యర్థిగా ఫోగట్‌ను ప్రకటించింది.


హర్యానాలో కాంగ్రెస్ వేవ్‌ ఉందని, మరోవైపు ఫోగట్ హర్యానా బిడ్డ కావడంతో ఆమెపై సానుభూతి ఉందనే ప్రచారం జరిగింది. కానీ ఫలితాలు చూస్తే మాత్రం ఫోగట్‌కు ప్రతికూలంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఆరు రౌండ్ల కౌంటింగ్ పూర్తికాగా.. ఆమెపై తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ 1237 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రతి రౌండ్‌లో ఇద్దరి మధ్య ఆధిక్యం మారుతూ వస్తుంది. మొదటి రౌండ్‌లో ఫోగట్ లీడ్‌లో ఉండగా.. రెండో రౌండ్ ముగిసే సమయానికి యోగేష్ ఆధిక్యాన్ని సాధించారు. మూడో రౌండ్‌లో ఫోగట్ స్వల్ప ఆధిక్యాన్ని సాధించినప్పటికీ మూడు రౌండ్ల ఓట్లు కలిపితే బీజేపీ అభ్యర్థి ఆధిక్యాన్ని సాధించారు. నాలుగో రౌండ్‌లో యోగేష్ కుమార్ ఫోగట్‌ కంటే 1500కు పైగా ఓట్ల మెజార్టీ సాధిచారు. ఐదో రౌండ్‌లో వినేశ్ ఫోగట్ బీజేపీ అభ్యర్థి కంటే 2వేలకు పైగా ఆధిక్యాన్ని సాధించారు. ఆరో రౌండ్‌లో రెండు వందల ఓట్ల ఆధిక్యాన్ని ఫోగట్ సాధించినప్పటికీ ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి 1237 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ ఉన్నారు. మొత్తం 15 రౌండ్ల కౌంటింగ్ జరగాల్సి ఉండగా.. ఇంకా 9 రౌండ్ల కౌంటింగ్ మిగిలే ఉంది. అన్ని రౌండ్లు పూర్తయ్యేసరికి ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.

Updated Date - Oct 08 , 2024 | 11:44 AM