Hero Vishal: తేల్చిచెప్పేశారు... ఇప్పట్లో పార్టీ స్థాపన లేదు
ABN , Publish Date - Feb 08 , 2024 | 10:34 AM
తాను రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి సినీ హీరో విశాల్(Hero Vishal) ఫుల్‌స్టాప్ పెట్టారు. అయితే, భవిష్యత్తులో ఏదేని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రజల్లో ఒకరిగా, ప్రజల కోసం గళం వినిపిస్తానని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

- భవిష్యత్తు కాలగమనం మేరకు నిర్ణయం
- ప్రజల్లో ఒకరిగా గళం వినిపిస్తానని ప్రకటన
- నటుడు విశాల్
చెన్నై: తాను రాజకీయ పార్టీ స్థాపించనున్నట్లు జరుగుతున్న ప్రచారానికి సినీ హీరో విశాల్(Hero Vishal) ఫుల్‌స్టాప్ పెట్టారు. అయితే, భవిష్యత్తులో ఏదేని నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ప్రజల్లో ఒకరిగా, ప్రజల కోసం గళం వినిపిస్తానని ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. సమాజంలో కొన్నేళ్లుగా నటుడిగా, వ్యక్తిగా, సమాజ సేవకుడిగా తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలతో పాటు హోదా ఇచ్చిన రాష్ట్ర ప్రజానీకానికి ఎన్నటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. గత కొంతకాలంగా తనకు సాధ్యమైనంత మేరకు సాయం చేసేందుకు ఏర్పాటు చేసిన తన అభిమాన సంఘం.. సాదాసీదాగా ఉండరాదన్న భావనలో ప్రజలకు వివిధ రూపాల్లో చేయూత అందిస్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండా, తన తల్లి పేరుతో దేవి చారిటబుల్ ట్రస్ట్‌తో పాటు మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం పేరుతో పేద పిల్లల విద్యాభ్యాసం కోసం సాయం చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా, విశాల్ మక్కల్ ఇయ్యకాన్ని రాష్ట్ర, అసెంబ్లీ, విభాగాల స్థాయిలో విస్తరించడమే కాకుండా, తన తల్లిపేరుతో స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తన వంతు సాయం చేస్తున్నట్టు గుర్తు చేశారు. అలాగే షూటింగుల కోసం తాను వెళ్లే ప్రదేశాల్లో కనీస సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పనుల చేయడం వెనుక ఎలాంటి రాజకీయ లబ్ధిని ఆశించడం లేదన్నారు. తన శక్తిమేరకు సాయం అందజేస్తూనే ఉంటానని వెల్లడించారు. ఇపుడు మక్కల్ ఇయ్యక్కం తరపున చేస్తున్న పనులు యఽథావిధిగా కొనసాగుతాయని, భవిష్యత్తులో నిర్ణయం తీసుకోవాల్సివస్తే అపుడు ప్రజల్లో ఒకడిగా, ప్రజల కోసం గళం వినిపిస్తానని ఆయన పేర్కొన్నారు.