Share News

One Nation One Election: 41 ఏళ్ల క్రితమే ప్రతిపాదన.. జమిలీ వెనక చరిత్ర తెలుసా

ABN , Publish Date - Sep 18 , 2024 | 04:08 PM

జమిలీ ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. సుమారు 41 ఏళ్ల క్రితమే1983లో జమిలి ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

One Nation One Election: 41 ఏళ్ల క్రితమే ప్రతిపాదన.. జమిలీ వెనక చరిత్ర తెలుసా

ఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పుడూ ప్రత్యేకమే. సాధారణంగా భారత్‌లో కేంద్రానికి, రాష్ట్ర అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్‌కు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు. శాసనసభ గడువు ముగిసే ఏడాది మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. దీంతో ఏటా ఏదో ఒక చోట ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ కారణంతో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని, ప్రభుత్వ ఖర్చు పెరిగిపోతోందని కేంద్ర ప్రభుత్వం గత కొన్నేళ్లుగా జమిలీ ఎన్నికలపై ఆలోచిస్తోంది.


ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలంపాటు విచారించి14 మార్చి, 2024న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కమిటీ నివేదిక అందించింది. 18 వేల పేజీలకు పైగా ఉన్న ఈ నివేదికలో లోక్‌సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్లకు ఒకే ఓటరు జాబితా సిద్ధం చేయాలని నివేదికలో సూచించారు. 2023, సెప్టెంబర్ 2 న ఏర్పాటైన ఈ కమిటీ నివేదికను రూపొందించడానికి 191 రోజులు పట్టింది. సెప్టెంబర్ 18, 2024న కేంద్ర కేబినెట్ జమిలీ ఎన్నికలు జరపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీకు తెలుసా.. జమిలీ ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. సుమారు 41 ఏళ్ల క్రితమే1983లో జమిలి ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.


చరిత్ర ఇదే..

1983లో వన్ నేషన్ వన్ ఎలక్షన్‌ జరపాలని ఎన్నికల సంఘం సూచించింది. 1999లో లా కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల చట్ట సంస్కరణలపై 170వ నివేదికను సమర్పించింది. 2018లో లా కమిషన్ ఆఫ్ ఇండియా జమిలీ ఎన్నికలపై నివేదిక విడుదల చేసింది. 15 ఆగస్టు, 2019 నాటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో దేశమంతటా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట సాక్షిగా ప్రకటించారు. 1 సెప్టెంబర్, 2023న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన 'ఒక దేశం, ఒకే ఎన్నిక'పై కమిటీ ఏర్పాటైంది. 2 సెప్టెంబర్ 2023న కమిటీ సభ్యులను ప్రకటించారు.


హోం శాఖ మంత్రి అమిత్ షా సహా ఏడుగురు సభ్యులు ఇందులో ఉన్నారు. వారిలో రామ్‌నాథ్ కోవింద్ కూడా ఒకరు. 23 సెప్టెంబర్ 2023న కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ అంశంపై ముందుగా అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. రోడ్‌మ్యాప్‌కు సంబంధించి లా కమిషన్‌తో చర్చించి ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. మొత్తానికి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని నివేదిక రూపొందించారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

One Nation One Election: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఇకపై ఒకేసారి.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

For Latest News and National News click here

Updated Date - Sep 18 , 2024 | 04:15 PM