రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ ఇక్కట్లు
ABN , Publish Date - Mar 30 , 2025 | 01:04 AM
జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ కష్టాలు మరోసారి వచ్చాయి. గతంలో ఈకేవైసీలను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. సరిగా వేలిముద్రలు పడనవి ప్రస్తుతం పెండింగ్‌గా చూపడంతో పాటు కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంతో సమస్యలు తలెత్తాయి.

జిల్లాలో 5 లక్షల కార్డుదారులకు ఇంకా 1.40 లక్షలు పెండింగ్
ఈ–పోస్ ఆప్షన్లతో మరిన్ని ఇబ్బందులు
ఎట్టకేలకు ఏప్రిల్ 30 వరకు గడువు పెంపు
ఉండి, మార్చి 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ కష్టాలు మరోసారి వచ్చాయి. గతంలో ఈకేవైసీలను వైసీపీ ప్రభుత్వం చేపట్టింది. సరిగా వేలిముద్రలు పడనవి ప్రస్తుతం పెండింగ్‌గా చూపడంతో పాటు కొత్త రేషన్‌కార్డులు జారీ చేయడంతో సమస్యలు తలెత్తాయి. నూతన ప్రభుత్వం పూర్తిస్థాయిలో పిల్లలు, పెద్దలవి ఈకేవైసీ పూర్తిచేయాలని భావించింది. ఈ మేరకు ఆయా జాయింట్ కలెక్టర్లు జిల్లాలవ్యాప్తంగా సివిల్ సప్లయి స్ డిప్యూటీ తహసీల్దార్లు, రేషన్‌డీలర్లు, ఎండీయూలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. అధికారులతో పెండింగ్ కార్డుదారుల జాబితాలను సిద్ధం చేసి డీలర్లకు అందించారు. ప్రస్తుతం ఈకేవైసీ పూర్తికాకపోతే ఏప్రిల్‌లో రేషన్ బియ్యం, సరుకులు నిలిచిపోతాయని అధికారులు డీలర్లకు సూచించారు. ఈమేరకు వారు సంబఽంధిత రేషన్ దుకాణం ఏరియాల వారీగా పరుగులు తీస్తూ ఈకేవైసీ చేపట్టారు.
ఇంకా పెండింగ్‌లో 1.40 లక్షలు
జిల్లాలో సుమారుగా 5 లక్షల కార్డుదారులకు గాను ఈకేవైసీ ఇంకా పెండింగ్‌లో సుమారు 1.40 లక్షల వరకు వున్నట్టు అంచనా. వీరిలో ఐదేళ్ల లోపు వారు, 75 ఏళ్లు పైబడి వున్నవారి వేలిముద్రలు వేయడానికి అవస్థలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో వున్నవారు, చనిపోయిన వారి జాబితా తెలుసుకుని వాటి వివరాలను నమోదు చేయాలని అధికారులు సూచించారు. ఈనెల 31 నాటికి ఈకేవైసీ పూర్తిచేయాలని ప్రభుత్వం తొలుత ప్రకటించి ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ–పోస్ ఆప్ఫన్లతో ఇబ్బందులు
ఈ–పోస్ మిషన్లలో పలు ఆప్షలు నమోదయ్యాయి. ఈ మేరకు ఈకేవైసీ వేసినప్పుడు సక్సెస్ అని వస్తే పూర్తయినట్టు లేకపోతే చిన్నపిల్లలు, మరెవరైనా ఆధార్ సెంటర్లకు వెళ్లి అప్‌డేట్ చేసుకోవాలి. 300 ఎర్రర్ కోడ్ వస్తే సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ నవీకరించాలి. 330 ఎర్రర్ వస్తే బయోమెట్రిక్ లాక్డ్.. ఆధార్ హోల్డర్ ఆధార్ సెంటర్‌కు వెళ్లి అన్‌లాక్ చేయించుకోవాలి. 511 ఎర్రర్ వస్తే ఇన్‌వాలిడ్ పీఐడీ ఎక్స్ ఎంఎల్ ఫారమెట్ బయోమెట్రిక్‌లను నవీకరించాలి. 811 ఎర్రర్ వస్తే మిస్సింగ్ బయోమెట్రిక్ డేటా సీఐడీఆర్ ఆధార్‌కేంద్రంలో బయోమెట్రిక్‌లను నవీకరించాలి. 996, 997 ఎర్రర్ వస్తే ఆధార్ క్యాన్సిల్డ్ ఆధార్ కేంద్రంలో కొత్త ఆధార్‌ను చేసుకోవాలి. ఇటువంటి ఆప్షన్ల్‌తో కార్డుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
జూ వైసీపీ పాలనలో రేషన్‌కార్డులను సచివాలయం పరిధిలోకి తీసుకుని వచ్చి ఒక దుకాణంలో వున్న కార్డులను రెండు విధాలుగా విభజించి మ్యాపింగ్ చేసి అధికారులు గందరగోళం చేశారు.
ఇంటింటికి రేషన్‌తో కార్డుదారుల సమాచారం నిల్
వైసీపీ ప్రభుత్వం ఇంటింటికి రేషన్ విధానంతో రేషన్ కార్డుదారుల చిరునామా, ఫోన్ నంబర్ల సమాచారం లేకుండా పోయాయని డీలర్లు మండిపడుతున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల కార్యాలయం వారు ఇచ్చిన ఆదేశాలతో ప్రతీ కార్డుదారుని చిరునామా ఉండేది. ప్రస్తుతం అడ్రస్‌లు లేకపోవడంతో డీలర్లు అసిస్టెంట్లను ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో అడ్రస్‌లు అడుగుతూ ఈకేవైసీలు పూర్తి చేస్తున్నారు.
ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
ఈకేవైసీ నమోదు కార్యక్రమాన్ని తొలుత ప్రభుత్వం ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. నమోదు కార్యక్రమంలో నెలకొన్న సమస్యలను గమనించి ఏప్రిల్ 30 వరకు ప్రభుత్వం గడువు పెంచింది. దీంతో డీలర్లతో పాటు కార్డుదారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.