National : ఆర్మీ.. రాజకీయ సాధనమా?
ABN , Publish Date - May 31 , 2024 | 04:11 AM
మన సైన్యాన్ని విపక్ష ‘ఇండీ’ కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.
ఇంతకంటే పెద్ద పాపం ఉందా?.. ‘ఇండీ’ కూటమిపై మోదీ ఫైర్
సైన్యాన్ని కాంగ్రెస్ అవమానించిందంటూ
ప్రధానమంత్రి ధ్వజం
హోషియార్‌పూర్, మే 30: మన సైన్యాన్ని విపక్ష ‘ఇండీ’ కూటమి రాజకీయ సాధనంగా వాడుకుంటోందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఇంతకంటే పెద్ద పాపం ఏదైనా ఉంటుందా అని ప్రశ్నించారు. ఈ పార్టీలకు సైనిక బలగాల అవసరాలు పట్టవని.. కాంగ్రెస్ హయాంలో బోఫోర్స్ స్కాం, జలాంతర్గాములు, జీపులు, ఆర్మీ ట్రక్కుల స్కాంలు జరిగాయని గుర్తుచేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని కాంగ్రెస్ హత్య చేసిందని దుయ్యబట్టారు. ఆయన తన లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని పంజాబ్‌లోని హోషియార్‌పూర్ గురువారం ముగించారు.
అక్కడి చివరి ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. అగ్నిపథ్ స్కీంను రద్దుచేస్తామన్న కాంగ్రెస్, ఇండీ కూటమిపై విరుచుకుపడ్డారు. భారత సైన్యాన్ని బలహీనపరిచేందుకు అవి చేయని ప్రయత్నాలులేవన్నారు. ‘రిపబ్లిక్ దినోత్సవ పరేడ్‌లలో పాల్గొనేందుకు సైన్యాన్ని తయారుచేయలేదు. ఆర్మీ ఉన్నది శత్రువుతో పోరాడి ఓడించడానికి, మాతృభూమిని రక్షించడానికే! ఇండీకి ఒకటే చెబుతున్నా. ఇప్పుడు నేను మౌనంగా ఉన్నా. నేను నోరు తెరిచానంటే మీ ఏడు తరాల పాపాలు బయటపెడతా’ అని హెచ్చరించారు. పంజాబ్ వీరభూమి అని, ఇండీ కూటమి ఆ వీరులను ప్రతిసారీ అవమానిస్తోందన్నారు.
‘దివంగత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్‌ను కాంగ్రెస్ గల్లీ గూండా అంది. ఇది ఆయన్నే కాదు.. ప్రతి సైనికుడినీ అవమానించినట్లే. సర్జికల్ దాడికి రుజువులు అడిగారు. 1962 యుద్ధంలో చైనాకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ప్రతి రోజూ భారత సైన్యాన్ని కించపరుస్తున్నారు. తేజస్ ఫైటర్ల పథకాన్ని కాంగ్రెస్ అటకెక్కించింది. రక్షణ దళాల చీఫ్ (సీడీఎస్) పదవిని ఏళ్లతరబడి నాన్చారు.
వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌పై 40ఏళ్లు కాంగ్రెస్ అబద్ధాలాడింది. నా ప్రభుత్వం వచ్చాకే దీన్ని అమలు చేశాం’ అన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకివస్తే రాజ్యాంగాన్ని రద్దుచేస్తుందన్న కాంగ్రెస్ ఆరోపణలను మోదీ ఖండించారు.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించి రాజ్యాంగం గొంతుకోసింది ఆ పార్టీయేనన్నారు. 1984 అల్లర్లలో సిక్కులను ఊచకోత కోస్తే పట్టించుకోలేదన్నారు.
బలహీనవర్గాల రిజర్వేషన్లు లాగేస్తారు..
రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్, ఇండీ కూట మి ఉద్దేశాలు ప్రమాదకరమైనవని ప్రధాని హెచ్చరించారు. దళితులు, బలహీనవర్గాల నుంచి రిజర్వేషన్‌ను లాక్కుని ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేడ్కర్ మనోభావాలను ఈ పార్టీలు అవమానించాయన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలు, క్రీడలు, టెండర్లు, యూనివర్సిటీల్లో ప్రవేశాల్లో మతప్రాతిపదికన రిజర్వేషన్లు కావాలని అవి కోరుతున్నాయని చెప్పారు. దేశాన్ని విభజించేందుకు ఇది అతిపెద్ద కుట్రగా అభివర్ణించారు. ఆమ్ ఆద్మీ పార్టీపై ప్రధాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అది కఠోర అవినీతిమయ పార్టీ.
కాంగ్రె్‌సతో చేతులు కలిపి డ్రామాలాడుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ మద్దతుతోనే ఆప్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఎలా అవినీతి చేయాలో ఆ పార్టీ నుంచి నేర్చుకుంది.
ఢిల్లీలో లిక్కర్ స్కాం చేసింది. పంజాబ్‌లో డ్రగ్స్ నిర్మూలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కానీ గద్దెనెక్కాక దానినే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుంది. పంజాబ్‌లో అక్రమ మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది’ అని విరుకుచుకుపడ్డారు.
వారాణసీలో జన్మించిన గురు రవిదా్‌సకు హోషియార్‌పూర్ తపోభూమిగా మారిందని, ఇక్కడ ప్రచారం ముగించడం గర్వంగా భావిస్తున్నానని మోదీ తెలిపారు.
76 రోజులు.. 206 సభలు
ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ 200కిపైగా సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. 2019లో 68 రోజుల ప్రచారంలో 145 సభల్లో పాల్గొనగా ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి గురువారం వరకు 76 రోజుల్లో 206 ర్యాలీల్లో పాల్గొన్నారు. మీడియాకు ఈ సారి 80 ఇంటర్వ్యూలు ఇవ్వడం విశేషం.