Delhi: 'మీ గొంతు తగ్గించుకోండి'.. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ వార్నింగ్
ABN , Publish Date - Sep 09 , 2024 | 04:12 PM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(DY Chandrachud) అభయ హత్యాచార ఘటనపై సోమవారం విచారించారు. ఈ క్రమంలో గట్టిగా వాదించిన ఓ లాయర్‌పై అసహనం వ్యక్తం చేశారు.
ఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్(DY Chandrachud) అభయ హత్యాచార ఘటనపై సోమవారం విచారించారు. ఈ క్రమంలో గట్టిగా వాదించిన ఓ లాయర్‌పై అసహనం వ్యక్తం చేశారు. గొంతు తగ్గించుకోవాలని ఆయనకు సూచించారు. జరిగిన తప్పుకు లాయర్.. చీఫ్ జస్టిస్‌ను క్షమాపణలు కోరారు. కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారించింది.
వాదనల సందర్భంగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఆగస్టు 9న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో జరిగిన హత్యాచార ఘటన అనంతరం నిరసనకారులపై ఓ న్యాయవాది రాళ్లు రువ్వుతున్నట్లు నిరూపించే సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని ధర్మాసనానికి చెప్పారు. కపిల్ సిబల్ వాదనల సమయంలో మరో న్యాయవాది కౌస్తవ్ భాగ్చి మాట్లాడుతూ.. ఓ సీనియర్ న్యాయవాది కోర్టులో అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. కోర్టు బయట జనాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారా అని భాగ్చిని ప్రశ్నించారు. గడిచిన రెండు గంటల నుంచి ఆయన్ని గమనిస్తున్నానన్నారు. గొంతును తగ్గించి మాట్లాడాలని హెచ్చరించారు. ముగ్గురు జడ్జీల ముందు మీరు మాట్లాడుతున్నారని, మీరేమి జనాలను ఉద్దేశించి మాట్లాడటం లేదని సీజే పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ వార్నింగ్‌తో లాయర్ కౌస్తవ్ భాగ్చి క్షమాపణలు చెప్పారు. అదే సమయంలో ఏడెనిమిది మంది న్యాయవాదులు ఒకేసారి వాదనలు వినిపిస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకే సమయంలో అంత మంది వాదించడం సరికాదని సూచించారు.
వారంలోపు నివేదిక ఇవ్వండి..
వచ్చే మంగళవారం లోపు వైద్యురాలి హత్యాచార ఘటనపై కొత్త రిపోర్టును సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS) నమూనాలను ధర్మాసనానికి పంపాలని సీబీఐ నిర్ణయించినట్లు సొలిసిటర్ జనరల్ మెహతా తెలిపారు. అత్యాచార ఘటన జరిగిన సమయం, వివరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ సీబీఐకి ఇచ్చారా లేదా అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
సీబీఐ ఫోరెన్సిక్ నివేదికను అందజేసిన తర్వాత కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ‘‘శాంపిల్స్ ఎవరు సేకరించారు’’ అనేది ఈ కేసులో ముఖ్యమైన ప్రశ్న అని, అందుకే ఎవరు సేకరించారనే విషయం నిర్ధారణ అయిన తర్వాత వచ్చే తాజా రిపోర్ట్ దాఖలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది.
For Latest News and National News Click Here