Share News

New York: అమెరికాలో ఇప్పటి వరకు 550మందికిపైగా విద్యార్థులను అరెస్టు

ABN , Publish Date - Apr 28 , 2024 | 04:22 AM

పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా విద్యార్థుల ఆందోళనలతో అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి.

New York: అమెరికాలో ఇప్పటి వరకు 550మందికిపైగా విద్యార్థులను అరెస్టు

పాలస్తీనాకు సంఘీభావంగా వర్సిటీల్లో ఆందోళనలు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 27: పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా విద్యార్థుల ఆందోళనలతో అమెరికా వ్యాప్తంగా యూనివర్సిటీలు అట్టుడుకుతున్నాయి. ఇప్పటి వరకు 550మందికిపైగా విద్యార్థులను అరెస్టు చేసినా, ఆందోళనలు విరమించేందుకు ససేమిరా అంటున్నారు. ఇజ్రాయిల్‌లో పెట్టుబడులను వర్సిటీలు నిలిపివేయాలని, గాజాపై యుద్ధానికి ఆజ్యం పోస్తున్న ఆయుధాల తయారీలోనూ పెట్టుబడులను ఆపేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.


హార్వర్డ్‌, కొలంబియా, యేల్‌, యూసీ బెర్కెలే తదితర ప్రఖ్యాత యూనివర్సిటీల్లోనూ విద్యార్థులు ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రదర్శనలన్నీ అనధికారికమేనని వర్సీటీల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులను పిలిపించారు. అట్లాంటాలోని ఎమోరీ యూనివర్సిటీలో గత రెండు రోజులుగా యాజమాన్యం పోలీసులను రప్పించి, నిరసనకారులపై టియర్‌ గ్యాస్‌ తదితరాలను ప్రయోగించింది.

ఆస్టిన్‌లోని టెక్సాస్‌ యూనివర్సిటీలో అశ్విక దళాలను రంగంలోకి దించి నిరసనకారులను చెదరగొట్టారు. పలు చోట్ల విద్యార్థులతోపాటు ప్రొఫెసర్లు కూడా ఆందోళనల్లో పాల్గొన్నారు. తామంతా పాలస్తీనా పౌరులకు సంఘీభావం తెలుపుతున్నామని ఆందోళనకారులు చెబుతున్నారు. అయితే, విద్యార్థుల డిమాండ్లను వర్సిటీల యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి. ఆ డిమాండ్లు దేశ విధానాలకు వ్యతిరేకమని వర్సిటీలు తేల్చిచెబుతున్నాయి.

Updated Date - Apr 28 , 2024 | 06:38 AM