Share News

Delhi : స్వదేశీ న్యాయం

ABN , Publish Date - Jul 01 , 2024 | 05:10 AM

దేశ నేర న్యాయవ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి.

Delhi : స్వదేశీ న్యాయం

  • నేటి నుంచి అమలులోకి కొత్త నేరచట్టాలు

  • భారతీయ న్యాయ సంహిత, నాగరిక్‌ సురక్ష, సాక్ష్య అధినియమ్‌

  • ఐపీసీ ఇక బీఎన్‌ఎస్‌, సీఆర్‌పీసీ-బీఎన్‌ఎస్‌ఎస్‌, ఎవిడెన్స్‌ యాక్ట్‌- బీఎస్‌ఏగా మార్పు

  • పోలీసులకు మరిన్ని అధికారాలు

  • దేశద్రోహం.. రాజద్రోహంగా పరిగణన

  • నిందితుల చేతులకు బేడీల పునరుద్ధరణ

  • కొత్త చట్టాలపై పలు వర్గాల అభ్యంతరాలు

  • ఇవి మన కోసం చేసుకున్న చట్టాలు: అమిత్‌షా

న్యూఢిల్లీ, జూన్‌ 30: దేశ నేర న్యాయవ్యవస్థలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చే కొత్త నేర చట్టాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. బ్రిటిష్‌ కాలం నాటి ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) ఇక మీదట భారతీయ న్యాయ సంహితగా (బీఎన్‌ఎస్‌), కోడ్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ప్రొసీజర్‌ (సీఆర్‌పీసీ) భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బీఎన్‌ఎ్‌సఎస్‌)గా, ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ భారతీయ సాక్ష్య అధినియమ్‌ (బీఎ్‌సఏ)గా మారనున్నాయి. అయితే, వివిధ వర్గాల నుంచి నూతన చట్టాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వీటి అమలును నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇప్పటికే ఓ పిటిషన్‌ దాఖలైంది.

గత ఏడాది డిసెంబరులో సదరు చట్టాల తాలూకు బిల్లుల ఆమోదం సందర్భంగా లోక్‌సభ, రాజ్యసభల నుంచి ఏకంగా 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేశారని, చర్చ జరపకుండానే బిల్లులను ఆమోదించారని పిటిషనర్లు అంజలీ పటేల్‌, ఛాయామిశ్రా పేర్కొన్నారు. ప్రజల నుంచి కూడా ఈ కొత్త చట్టాలపై అభిప్రాయాలను సేకరించలేదన్నారు. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు ముఖ్యమంత్రులు ఈ చట్టాల అమలును వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు.


ఈ చట్టాల ప్రకారం నిందితులకు బెయిల్‌ ఇచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని, పోలీసులకు విపరీతమైన అధికారాలు లభిస్తాయని పేర్కొన్నారు. మరోవైపు, కొత్త నేరచట్టాల అమలును వాయిదా వేయాలని కోరుతూ పౌరహక్కుల ప్రజాసంఘం (పీయూసీఎల్‌) కేంద్ర న్యాయశాఖమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌కు లేఖ రాసింది. క్రిమినల్‌ లాయర్లు, దర్యాప్తు సంస్థలు, న్యాయమూర్తులు, సాధారణ పౌరుల నుంచి విస్తృతస్థాయిలో అభిప్రాయాలు సేకరించకుండానే ఈ చట్టాలను తీసుకొచ్చారని గుర్తు చేసింది.

భారతదేశ ప్రజాస్వామ్యంపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపే ఈ చట్టాలపై ఇప్పటికైనా దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చలు జరపాలని, అప్పటి వరకూ వాటి అమలును వాయిదా వేయాలని పీయూసీఎల్‌ కోరింది. వలస చట్టాల నుంచి బయటపడుతున్నామని చెబుతూనే.. నాటి బ్రిటీష్‌ చట్టాల్లోని అనేక అంశాలను యథాతథంగా తీసుకొచ్చారని(కట్‌ అండ్‌ పేస్ట్‌) పీయూసీఎల్‌ వెల్లడించింది. మరోవైపు నూతన నేర చట్టాలు పేరులోనేగాక సారంలోనూ భారతీయతను కలిగి ఉన్నాయని, వాటి ఆత్మ, శరీరం, స్ఫూర్తి భారతీయత అని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. ‘భారతీయుల కొరకు భారతీయుల చేత భారత పార్లమెంటు ద్వారా ఇవి రూపొందాయి. వలసకాలపు చట్టాలకు దీంతో తెరపడింది’ అన్నారు.

నూతన చట్టాల్లోని వివాదాస్పద అంశాలు

  • న్యాయసంహిత చట్టంలో గ్యాంగ్‌, వ్యవస్థీకృత నేరముఠాల వంటి పదాలున్నాయిగానీ వాటిని నిర్వచించలేదు. ఫలితంగా అమాయకులను కూడా కేసులతో ఇరికించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు.

  • న్యాయసంహిత ప్రకారం మానసిక వికలాంగులకు విచారణ నుంచి రక్షణ లభిస్తుంది. అయితే, బుద్ధిమాంద్యం ఉన్న వారిని ఈ క్యాటగిరీలో చేర్చలేదు. దీంతో, బుద్ధిమాంద్యం ఉన్న వారిపై కేసు నమోదు చేయొచ్చు.

  • నాగరిక్‌ సురక్ష సంహిత ప్రకారం.. పోలీసులు నిందితులను తమ కస్టడీలో 15 రోజులపాటు ఉంచుకోవచ్చు. అంతేకాదు, ఆ తర్వాత కూడా 40 నుంచి 60 రోజుల అదనపు కస్టడీని కోరవచ్చు. ఈ కస్టడీని ఒకేదఫాలోగానీ పలుదఫాల్లోగానీ అమలుపరచవచ్చు. తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసినా కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.


  • ఎలకా్ట్రనిక్‌ రికార్డులను ఎవిడెన్సు యాక్ట్‌ ద్వితీయస్థాయి సాక్ష్యాధారాలుగా పరిగణిస్తే.. దానిస్థానంలో వచ్చిన భారతీయ సాక్ష్య అభినియమ్‌ వాటిని ప్రథమ స్థాయి సాక్ష్యాధారాలుగా పరిగణిస్తోంది. తద్వారా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టా్‌పల వంటి సాధనాలతోపాటు సెమీకండక్టర్‌ మెమొరీలో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని కూడా సాక్ష్యాధారంగా భావిస్తుంది. వీటిని సాక్ష్యంగా పరిగణించే కొత్త చట్టం.. పోలీసులు వీటిని నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నప్పుడు లేదా తనిఖీ నిర్వహించినప్పుడు వాటిల్లో లేని సమాచారాన్ని తామే స్వయంగా చొప్పిస్తే పరిస్థితి ఏమిటి? అన్నదానిని మాత్రం చర్చించలేదు. అటువంటి పరిస్థితి తలెత్తకుండా ఎటువంటి చర్యలనుగానీ, నిబంధనలనుగానీ పేర్కొనలేదు.

ఇతర ముఖ్యాంశాలు

క్రిమినల్‌ కేసుల్లో విచారణ ప్రారంభమైన తర్వాత 60 రోజుల్లోపు అభియోగాలు నమోదు చేయాలి. విచారణ పూర్తయిన 45 రోజుల్లోపు న్యాయమూర్తి తీర్పు వెలువరించాలి. గరిష్ఠంగా కేసును రెండుసార్లు మాత్రమే వాయిదా వేయాలి. రేప్‌ బాధితుల వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి బాధితురాలి సంరక్షకుల సమక్షంలో నమోదు చేయాలి. ఘటన జరిగిన తర్వాత ఏడు రోజుల్లోపు వైద్య నివేదిక సిద్ధం కావాలి. సాక్షులకు రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాలి. లింగసమానత్వంలో భాగంగా లింగం (జెండర్‌) అనే క్యాటగిరీ కింద ట్రాన్స్‌జెండర్లకు కూడా అవకాశం.

స్వాతంత్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టటానికి బ్రిటీష్‌ ప్రభుత్వం ఉపయోగించిన దేశద్రోహ చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసింది. ఈ చట్టంపై సమీక్ష జరుపుతామని కేంద్రం నాడు సుప్రీంకోర్టులో తెలిపింది. కానీ, కొత్త చట్టంలో తిరిగి దేశద్రోహ చట్టాన్ని రాజద్రోహం పేరుతో తీసుకొచ్చింది. ప్రభుత్వ విధానాలను విమర్శించటానికి ప్రజలకు ఉన్న హక్కును అణచివేయటానికి ఈ చట్టం ఉపయోగపడుతుందన్న విమర్శలు ఎంతో కాలంగా ఉన్నాయి.

అరెస్టు సందర్భంగా నిందితుల చేతులకు బేడీలు వేయటాన్ని పునరుద్ధరించటం, తప్పనిసరిగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలన్న ప్రస్తుత నిబంధనను తొలగించటం.. పాతకాలపు పోకడలకు దేశాన్ని మళ్లీ తీసుకెళ్లటంగా పలువురు భావిస్తున్నారు.

Updated Date - Jul 01 , 2024 | 05:13 AM