PM Modi: సియావర్ రామ్ చంద్ర కీ జై... నినాదంతో మోదీ ప్రసంగం
ABN , Publish Date - Jan 22 , 2024 | 03:16 PM
నభూతో నభవిష్యతి అనే రీతిలో అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ''శ్రీరామచంద్ర కీ జై, మన రాముడొచ్చాడు'' అంటూ అతిథులు, రామభక్తుల హర్షాతిరేకాల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అయోధ్య: నభూతో నభవిష్యతి అనే రీతిలో అయోధ్యలో బాల రాముని ప్రాణప్రతిష్ట అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉద్వేగభరితమైన ప్రసంగం చేశారు. ''శ్రీరామచంద్ర కీ జై, మన రాముడొచ్చాడు'' అంటూ అతిథులు, రామభక్తుల హర్షాతిరేకాల మధ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు. వేలాది సంవత్సరాల తర్వాత కూడా రామప్రతిష్ఠ జరిగిన ఈరోజును ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని అన్నారు. రాముని దివ్యాశీస్సులు ఈరోజు మనం అంతా చవిచూస్తున్నామని అన్నారు. శతాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ శ్రీరాముడు ఎట్టకేలకు మనముందుకు వచ్చారని అన్నారు. శతాబ్దాల సహనం, కృషి, త్యాగాల ఫలితమే ఈరోజు రాముడు తిరిగి వచ్చారని అన్నారు. దశాబ్దాల పాటు న్యాయపోరాటం జరిగిందని, న్యాయాన్ని గెలిపించిన భారతదేశ న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని అన్నారు.
ఈరోజు రాముడికి క్షమాపణ చెప్పుకుంటున్నానని, మన ప్రయత్నాలో, త్యాగాల్లో ఎక్కడో లోపం జరిగి శతాబ్దాలుగా ఈరోజు కోసం నిరీక్షించాల్సి వచ్చిందని మోదీ అన్నారు. ఈరోజు అందరి కల సంపూర్ణమైందని, శ్రీరామచంద్రుడు అందర్నీ తప్పనిసరిగా క్షమిస్తారని తాను నమ్ముతున్నానని చెప్పారు. జనవరి 22వ తేదీన సూర్యుడు అత్యద్భుతమైన మెరుపులతో కాంతులు వెదజల్లారని, 2024 జనవరి 22వ తేదీ కేవలం క్యాలెండర్ మీద రాసిన రాత కాదని, సరికొత్త టైమ్ సైకిల్‌కు కేంద్రస్థానమని అన్నారు. రామ్‌లల్లా ఇంకెంతమాత్రం టెంట్‌లో కాలం గడపాల్సిన అవసరం లేదని, ఆయన భవ్యమైన రామాలయంలోనే కొలువుతీరుతారని చెప్పారు. రామాలయం జాతీయ ప్రజ్ఞకు సంకేతమని, విశ్వాసాలకు ప్రతీక అని, రాముడు దేశానికి పునాది అనిది, భారతదేశ ఆలోచనా విధానానికి, న్యాయానికి రాముడు ప్రతీక అని కొనియాడారు. దేశ కీర్తిపతాకం శ్రీరాముడని, రాముడిని గౌరవించుకుంటే ఆ ప్రభావం శతాబ్దాలు, వేలాది సంవత్సరాల పాటు ప్రజలపై ఉంటుందని అన్నారు. రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరైన ప్రజలందరికీ పేరుపేరునా ప్రధాని అభినందనలు తెలిపారు.
ఉపవాస దీక్ష విరమించిన ప్రధానమంత్రి మోదీ
దీనికి ముందు, అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనతో యావద్దేశం పులకించింది. నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలతో ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు. ప్రధాన అర్చకుల నుంచి పవిత్ర తీర్ధాన్ని స్వీకరించి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయోధ్య రామాలయ జ్ఞాపికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి బహూకరించారు.