Share News

PM Modi: రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. సాదర స్వాగతం పలికిన రష్యన్ అధికారులు

ABN , Publish Date - Jul 08 , 2024 | 07:09 PM

ప్రధాని మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రష్యాకి(Russia) చేరుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రధాని విమానం ల్యాండ్ కాగానే అక్కడి అధికారులు మోదీకి రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం తెలిపారు.

PM Modi: రష్యా చేరుకున్న ప్రధాని మోదీ.. సాదర స్వాగతం పలికిన రష్యన్ అధికారులు

మాస్కో: ప్రధాని మోదీ(PM Modi) రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం రష్యాకి(Russia) చేరుకున్నారు. రష్యా రాజధాని మాస్కోలో ప్రధాని విమానం ల్యాండ్ కాగానే అక్కడి అధికారులు మోదీకి రెడ్ కార్పెట్ వేసి సాదర స్వాగతం తెలిపారు. దాండియా, గర్భా నృత్యాలతో రష్యా అధికారులు ఆయనకు వెల్‌కం చెప్పారు. మోదీ కోసం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇవాళ రాత్రి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.

ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య పలు ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. రష్యా ఐదవ తరం ఫైటర్ జెట్ సుఖోయ్ 57కు సంబంధించి ఇద్దరు నేతలు చర్చించనున్నారు. యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారు చేయడంపై ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. ప్రధాని మోదీ రష్యా పర్యటనలో రక్షణ, చమురు రంగాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.


22వ ద్వైపాక్షిక సదస్సు పేరుతో మోదీ-పుతిన్ భేటీ జరుగుతున్నప్పటికీ.. ఈ సమావేశం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుండి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో పాటు జెలెన్స్‌కీ నుండి నాటో వరకు ప్రతి ఒక్కరూ ఈ సమావేశంపై దృష్టి పెట్టారు. 2025 నాటికి భారత్, రష్యాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. రష్యా 2025 నాటికి 50 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది.

చెన్నై-వ్లాడివోస్టాక్ కారిడార్‌లో పెట్టుబడి ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది. రష్యా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశం కానున్నారు. భారతీయ సమాజాన్ని కూడా కలవనున్నారు. భారత్, రష్యాలు తమ ఆర్థిక సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు దీర్ఘకాలిక దృక్పథాన్ని అనుసరిస్తున్నాయి. దీనిపై దృష్టి సారిస్తూ ఇరు దేశాలు ముందుకు సాగుతున్నాయి. భారతదేశం రష్యాను తన బలమైన స్నేహితుడిగా భావిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.


రక్షణపర అంశాల్లో కీలక చర్చలు..

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. వాటిలో ప్రధానంగా ఫైటర్ జెట్ SU-57పై ఒప్పందం. భారతదేశంలో యాంటీ ట్యాంక్ షెల్స్‌ను తయారీ పరిశ్రమకు సంబంధించి ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. మ్యాంగో ఆర్మర్-పియర్సింగ్ ట్యాంక్ రౌండ్ ఫ్యాక్టరీ డీల్, సైనిక లాజిస్టిక్స్ ఒప్పందంపై చర్చ, ప్రాంతీయ, ప్రపంచ భద్రతకు ప్రాధాన్యత, ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై చర్చ, రక్షణ, చమురు, గ్యాస్‌కు సంబంధించిన అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు.


పదేళ్లలో ఆరోసారి..

2019 తర్వాత రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా పుతిన్ ఆహ్వానం మేరకు మోదీ మాస్కో వెళ్తున్నారు. మాస్కోలో నివసిస్తున్న భారతీయులు ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకనున్నారు. గత 10 ఏళ్లలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇది ఆరోసారి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు 22వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. రష్యా పర్యటన ముగించుకుని మోదీ 9వ తేదీన ఆస్ట్రియాకు వెళ్తారు. రెండు రోజుల పాటు ఆస్ట్రియాలో పర్యటించనున్నారు. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి.

For Latest News and National News click here

Updated Date - Jul 08 , 2024 | 07:09 PM