Share News

Pongal: పొంగల్‌ సరుకుల కొనుగోళ్లకు రూ.238.92 కోట్ల నిధుల మంజూరు

ABN , Publish Date - Jan 04 , 2024 | 01:33 PM

రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతిని పురస్కరించుకుని రేషన్‌కార్డుదారులందరికీ పొంగల్‌(Pongal) సరుకులను పంపిణీ చేయడానికి సహకార, ఆహార శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేపడుతున్నారు.

Pongal: పొంగల్‌ సరుకుల కొనుగోళ్లకు రూ.238.92 కోట్ల నిధుల మంజూరు

- నగదు కానుకపై త్వరలో ప్రకటన

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతిని పురస్కరించుకుని రేషన్‌కార్డుదారులందరికీ పొంగల్‌(Pongal) సరుకులను పంపిణీ చేయడానికి సహకార, ఆహార శాఖ ఉన్నతాధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. కార్డుదారులకు ఉచితంగా ఇచ్చే పచ్చిబియ్యం, చక్కెర, చెరకు గడను బహిరంగ మార్కెట్లలో, చెరకు రైతుల సహకార సంఘాలలో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతిని జారీ చేసింది. పొంగల్‌ సరకుల కొనేందుకు ప్రభుత్వం రూ.238.92 కోట్ల నిధులను మంజూరు చేసింది.

రాష్ట్రంలో సంక్రాంతి సందర్భంగా యేటా రేషన్‌దుకాణాల్లో కిలో పచ్చిబియ్యం, కిలో చక్కెర, చెరకు గడ, రూ.1000 నగదును కానుకగా పంపిణీ చేయడం ఆనవాయితీ. సంక్రాంతి నెల రోజులకు ముందే అంటే డిసెంబర్‌ మొదటి వారంలోనే ఈ సంక్రాంతి కానుకల పంపిణీ ఏర్పాట్లు చేపడుతుంటారు. అయితే ఈ యేడాది డిసెంబర్‌ మొదటివారంలో చెన్నై సహా నాలుగు జిల్లాల్లో తుఫాను తాకిడి కుండపోత వర్షాలు, రెండో వారంలో తూత్తుకుడి సహా నాలుగు జిల్లాల్లో వర్షబీభత్సం నెలకొనటంతో పొంగల్‌ కానుకలకు సంబంధించిన పనులు చేపట్టలేకపోయారు. రెవెన్యూ అధికారులంతా వర్ష, తుఫాను బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.6వేల వరద సాయం పంపిణీలో తలమునకలయ్యారు. ఎనిమిది జిల్లాల్లో ఈ వరదసాయాన్ని పంపిణీ చేయడానికి ఇతర జిల్లాల నుంచి కూడా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను రప్పించారు. ఈ కారణాల వల్ల పొంగల్‌ కానుకగా ఇచ్చే సరుకుల కొనుగోళ్లకు సంబంధించిన పనులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సహకార ఆహార వినియోగదారుల భద్రతా శాఖ అదనపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే గోపాల్‌ మంగళవారం రాత్రి పొంగల్‌ కానుక వస్తువుల వివరాలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి సందర్భంగా రేషన్‌కార్డుదారులకు శ్రీలంక తమిళుల పునరావాస కేంద్రాలలో బస చేస్తున్నవారికి పండుగలో చక్కెర పొంగలి తయారీకి అవసరమైన బియ్యం, చక్కెరను, చెరకు గడను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 2 కోట్లా 19లక్షలా 57 వేలా402 మంది రేషన్‌కార్డుదారులకు ఈ పొంగల్‌ కానుక సరుకులను పంపిణీ చేయడానికిగాను రూ.238కోట్లా 92లక్షలా 72 వేలా 741 నిధులు మంజూరుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. బహిరంగ మార్కెట్‌లో కలొ పచ్చి బియ్యాన్ని జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య నిర్ధారించిన రూ.33.20లకు కొనుగోలు చేసి వాటిని రేషన్‌షాపులకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే విధంగా కిలో చక్కెరను రూ.40.61, చెరకు గడను రూ.33 చొప్పున కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అనుమతించిందని ఆయన తెలిపారు. బుధవారం నుంచి పచ్చిబియ్యం, చక్కెర, చెరకుగడల కొనుగోళ్లు ప్రారంభమైందన్నారు. వచ్చేవారం రేషన్‌షాపుల్లో ఈ పొంగల్‌ సరకులను పంపిణీ చేసే అవకాశం ఉందని చెప్పారు. పంపిణీకి సంబంధించి అన్ని జిల్లాల్లో కలెక్టర్ల నాయకత్వంలో కమిటీలు ఏర్పాటవుతాయన్నారు. ఈ పొంగల్‌ సరకులను టోకెన్ల పద్ధతిలో పంపిణీ చేయాలా అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇక పొంగల్‌ నగదు కానుకగా రూ.1000 పంపిణీ చేసే విషయంపై త్వరలోనే ప్రభుత్వం ప్రకటన జారీ చేస్తుందన్నారు. తొలుత పొంగల్‌ సరుకులను సిద్ధం చేయడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఈ సరకులన్నీ రేషన్‌షాపులకు చేరిన తర్వాత నగదు పంపిణీపై ప్రకటన చేసి, వాటిని కార్డుదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాలా? లేక వరదసాయం నగదును పంపిణీ చేసినట్లు రేషన్‌షాపులలోనే పంపిణీ చేయాలా? అనే విషయంపై కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రకటన జారీ చేస్తుందన్నారు. ఈ నగదు కానుకకు సంబంధించి త్వరలోనే ముఖ్యమంత్రి స్టాలిన్‌ అధికారులతో సమావేశం జరిపిన మీదట ప్రకటిస్తారని సచివాలయ అధికార వర్గాలు చెబుతున్నాయి.

చీరలు, ధోవతులు సిద్ధం

పెరంబూర్‌(చెన్నై): పొంగల్‌ పండుగ సందర్భంగా రేషన్‌ దుకాణాల ద్వారా కార్డుదారులకు అందించేందుకు 3.31 కోట్ల చీరలు, ధోవతులు సిద్ధం చేసినట్లు చేనేత, జౌళి శాఖ మంత్రి ఎంఆర్ గాంధీ(Minister MR Gandhi) తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ... పొంగల్‌కు ఉచితంగా అందించేందుకు 1.68 కోట్ల చీరలు, 1.63 కోట్ల ధోవతులు సిద్ధంగా ఉంచామన్నారు. వీటిలో 15 రకాల చీరలు, 5 రకాల ధోవతులు ఉన్నాయని మంత్రి తెలిపారు.

Updated Date - Jan 04 , 2024 | 01:33 PM