రాయ్‌బరేలీ నుంచి రాహుల్
ABN , Publish Date - May 04 , 2024 | 03:17 AM
యూపీలోని రాయ్‌బరేలీ, అమేఠీ సీట్లపై కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. రాయ్‌బరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని బరిలో దింపింది.
అమేఠీ బరిలో స్థానిక సీనియర్ నేత, గాంధీ కుటుంబ విధేయుడు కిషోరీలాల్ శర్మ
చివరి రోజున నామినేషన్ దాఖలు
అమేఠీలో ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించింది
కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ విమర్శ
న్యూఢిల్లీ, మే 3 (ఆంధ్రజ్యోతి): యూపీలోని రాయ్‌బరేలీ, అమేఠీ సీట్లపై కొంతకాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. రాయ్‌బరేలీ నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని బరిలో దింపింది. అమేఠీ నుంచి అనూహ్యంగా గాంధీ కుటుంబానికి చెందిన వారిని కాకుండా, ఆ కుటుంబానికి విధేయుడిగా ఉన్న స్థానిక సీనియర్ నేత కిషోరీలాల్ శర్మను అభ్యర్థిగా ప్రకటించింది. నామినేషన్లకు శుక్రవారం చివరిరోజు కావటంతో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆయన తల్లి సోనియాగాంధీ, పార్టీ అధ్యక్షుడు ఖర్గే, ప్రియాంకా గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రా కూడా రాహుల్ వెంట ఉన్నారు. అంతకుముందు వేలాది మంది కార్యకర్తలు రాయ్‌బరేలీలో రాహుల్‌కు స్వాగతం పలికారు. అమేఠీలో కిషోరీలాల్ శర్మ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రియాంకగాంధీ మాట్లాడుతూ.. శర్మను భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. తాను ప్రచారం చేస్తానన్నారు. అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాలకు మే 20న పోలింగ్ జరగనుంది.
ప్రియాంకను ఒప్పించేందుకు విఫల యత్నం
గత ఐదు ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి సోనియాగాంధీ విజయం సాధించారు. ఈసారి సోనియా రాజ్యసభకు వెళ్లటంతో ప్రియాంకా గాంధీని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయించాలన్న డిమాండ్ కాంగ్రెస్ శ్రేణుల నుంచి వచ్చింది. కానీ, పోటీకి ప్రియాంక అంగీకరించలేదని సమాచారం. ప్రియాంకను ఒప్పించటానికి రాహుల్‌గాంధీ కూడా ప్రయత్నించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్‌తోపాటు రాయ్‌బరేలీలో కూడా గెలిస్తే వయనాడ్ స్థానాన్ని వదులుకోలేనని.. కాబట్టి, రాయ్‌బరేలీ నుంచి పోటీ చేయాలని రాహుల్ చెప్పినప్పటికీ ప్రియాంక అంగీకరించలేదని పేర్కొన్నాయి. యూపీ నుంచి గాంధీ కుటుంబ సభ్యుల్లో ఎవరూ పోటీ చేయకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని, అమేఠీ కంటే రాయ్‌బరేలీ సురక్షితమైదని పార్టీ నేతలు భావించడంతో రాహుల్ అక్కడి నుంచి పోటీకి అంగీకరించినట్లు తెలిపాయి. రాహుల్ నామినేషన్ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందిస్తూ.. పార్టీ నాయకత్వం విస్తృతంగా చర్చించిన మీదటే ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. మోదీ అబద్ధాలను దీటుగా ఎదుర్కోవటానికి వీలుగా ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారంలో నిమగ్నమయ్యారని, అందుకే ఆమెను రాయ్‌బరేలీలో బరిలో దింపి ఆ నియోజకవర్గానికే పరిమితం చేయలేదన్నారు. తర్వాత ఏదైనా ఉప ఎన్నికలో ప్రియాంక పోటీ చేసి పార్లమెంటుకు వెళ్తారని జైరాం తెలిపారు. కాంగ్రెస్ నిర్ణయంపై అమేఠీ ఎంపీ, కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ స్పందిస్తూ.. ఎన్నికలు జరగకముందే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓటమిని అంగీకరించినట్లని వ్యాఖ్యానించారు.
50 ఏళ్ల అనుబంధం
రాయ్‌బరేలీకి తొలుత ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్‌గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆయన తదనంతరం 1967, 1971 లలో ఇందిర పోటీ చేసి గెలిచారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన ఎన్నికల్లో రాజ్‌నారాయణ్ చేతిలో ఇందిర ఓడిపోయారు. మళ్లీ 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిర విజయం సాధించారు. 1996, 1998లో బీజేపీ నేత అశోక్ సింగ్ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో గాంధీ కుటుంబ విధేయుడు కెప్టెన్ సతీష్ శర్మ గెలిచారు. సోనియాగాంధీ రాజకీయ రంగప్రవేశం తర్వాత 2004, 2006, 2009, 2014, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. రాయబరేలీని కాంగ్రెస్ కంచుకోటగా పరిగణిస్తారు.
రాహుల్ ఆస్తులు రూ.20 కోట్లు
రాయ్‌బరేలీ నామినేషన్ పత్రాల్లో రాహుల్ తనకు రూ.20 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. వీటిలో రూ.9.5 కోట్లు చరాస్తులు కాగా, రూ.11 కోట్లు స్థిరాస్తులు. గత ఆర్థిక సంవత్సరంలో తన ఆదాయం రూ.1.02 కోట్లు అని తెలిపారు.
అమేఠీలో 1998 తర్వాత తొలిసారిగా ‘ఇతరులకు’
యూపీలోని అమేఠీని గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా భావిస్తారు. 1980లో ఇందిర తనయుడు సంజయ్ గాంధీ, 1981, 1984, 1989, 1991 ఎన్నికల్లో మరో తనయుడు రాజీవ్ గాంధీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. రాజీవ్ మరణానంతరం 1991, 1996లలో జరిగిన ఎన్నికల్లో రాజీవ్ సన్నిహిత మిత్రుడు సతీ్‌షశర్మ గెలుపొందారు. 1998 ఎన్నికల్లో ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. 1999లో సోనియాగాంధీ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2004 నుంచి ఆమె రాయ్‌బరేలీకి మారగా, 2004, 2009, 2014 ఎన్నికల్లో రాహుల్ పోటీ చేసి విజయం సాధించారు. 2019లో రాహుల్‌పై బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.