Share News

Devendra Fadnavis: ప్రభుత్వంలో ఉండేందుకు షిండే అంగీకరించారు: ఫడ్నవిస్

ABN , Publish Date - Dec 04 , 2024 | 06:03 PM

ఎన్నికల ఫలితాలకు, సీఎం ప్రకటనకు మధ్య రెండు వారాల జాప్యం తలెత్తడాన్ని దేవేంద్ర ఫడ్నవిస్ తేలిగ్గా కొట్టివేశారు. సీఎం పదవి అనేది కేవలం సాంకేతిక అంశమేనని, తామిద్దరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటామని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని తెలిపారు.

Devendra Fadnavis: ప్రభుత్వంలో ఉండేందుకు షిండే అంగీకరించారు: ఫడ్నవిస్

ముంబై: మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఎంపికైన దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను బుధవారం మధ్యాహ్నం కోరారు. ఆయనతో పాటు 'మహాయుతి' భాగస్వామ్య నేతలైన ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సైతం గవర్నర్‌ను కలిశారు. అనంతరం ఫడ్నవిస్, షిండే సంయుక్తంగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య మైత్రీబంధం వెల్లివిరిసింది. ఎన్నికల ఫలితాలకు, సీఎం ప్రకటనకు మధ్య రెండు వారాల జాప్యం తలెత్తడాన్ని తేలిగ్గా కొట్టివేశారు. సీఎం పదవి అనేది కేవలం సాంకేతిక అంశమేనని, తామిద్దరూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటామని, ఇక ముందు కూడా అదే కొనసాగుతుందని ఫడ్నవిస్ తెలిపారు.

Maharashtra: ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం.. గవర్నర్‌ను కలిసిన 'మహాయుతి' నేతలు


షిండేకు ప్రత్యేక కృతజ్ఞతలు: ఫడ్నవిస్

ఏక్‌నాథ్ షిండేకు ఫడ్నవిస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, మంగళవారంనాడు ఆయనను తాను కలిసానని, మంత్రివర్గంలో కొనసాగాలని తాను కోరానని చెప్పారు. ''నా కోరికను ఆయన కాదనరని నమ్మకంగా ఉన్నాను. ముఖ్యమంత్రి పదవి అనేది కేవలం మా మధ్య ఒక సాంకేతిక ఒప్పందమే. కలిసికట్టుగానే మేము నిర్ణయాలు తీసుకుంటాం. ఆ విధంగానే ముందుకు వెళ్తాం'' అని తెలిపారు.


సీఎంగా మేమే సిఫారసు చేశాం: షిండే

ఏక్‌నాథ్ షిండే మాట్లాడుతూ, రెండున్నరేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా తన పేరును ఫడ్నవిస్ సిఫారసు చేశారని, ఈసారి ముఖ్యమంత్రి పదవికి ఆయన పేరును తాము సిఫారసు చేశామని తెలిపారు.


బీజేపీ కీలక సమావేశంతో ఉత్కంఠకు తెర

ముఖ్యమంత్రి పదవికి ఫడ్నవిస్, షిండే మధ్య పోటీకి బుధవారంనాడు జరిగిన బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంతో తెరపడింది. పార్టీ కేంద్ర పరిశీలకులు సమక్షంలో మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఫడ్నవిస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన సీఎం పదవిని చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రెండు వారాల ఉత్కంఠకు సైతం తెరపడింది. అనంతరం కొద్ది సేపటికే షిండే, అజిత్ పవార్‌తో కలిసి ఫడ్నవిస్ రాజ్‌భవన్‌కు చేరి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ రాధాకృష్ణన్‌కు విజ్ఞాపన పత్రం అందజేశారు.


ఇవి కూడా చదవండి

Sukhbir Singh Badal: సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిందెవరంటే

Uttarakhand: ఆ గంగాజలం స్నానానికి తప్ప తాగడానికి పనికిరాదు: పీసీబీ

Rahul Gandhi: ఘాజీపూర్ సరిహద్దుకు చేరుకున్న రాహుల్, ప్రియాంక గాంధీ

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Dec 04 , 2024 | 06:03 PM