Wayanad disaster : వయనాడ్ విపత్తుకు.. మానవ తప్పిదాలే కారణం!
ABN , Publish Date - Aug 15 , 2024 | 04:40 AM
కేరళలోని వయనాడ్ జిల్లాలో గత నెల 30న సంభవించిన ప్రకృతి విపత్తుకు మానవ ప్రేరేపిత తప్పిదాల కారణంగా తలెత్తిన వాతావరణ మార్పులే కారణమని వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్(డబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యయనం
భవిష్యత్తులోనూ ముప్పు తప్పదు
వరల్డ్ వెదర్ అధ్యయనం వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు 14: కేరళలోని వయనాడ్ జిల్లాలో గత నెల 30న సంభవించిన ప్రకృతి విపత్తుకు మానవ ప్రేరేపిత తప్పిదాల కారణంగా తలెత్తిన వాతావరణ మార్పులే కారణమని వరల్డ్ వెదర్ ఆట్రిబ్యూషన్(డబ్ల్యూడబ్ల్యూఏ) అధ్యయనం వెల్లడించింది. గత నెల జూలై 30న ఒక్కరోజే 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది లండన్ వార్షిక వర్షపాతంలో నాలుగో వంతుకు సరిసమానమని పేర్కొంది. ఈ విపత్తు కారణంగా 350 మందికిపైగా ప్రజలు మృతి చెందారని, ఇది కనీవినీ ఎరుగని ఉత్పాతమని తెలిపింది. మానవ తప్పిదాల కారణంగానే 10ు అధిక వర్షపాతం నమోదైనట్టు అధ్యయనం వివరించింది. వాతావరణం వేడెక్కినప్పుడు ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని అధ్యయనంలో పాలుపంచుకున్న భారత్, అమెరికా, బ్రిటన్, స్వీడన్ దేశాలకు చెందిన 24 మంది పరిశోధకులు తెలిపారు. కేరళలోని ఉత్తర ప్రాంతంలోనూ కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని, దీనిని ముందుగానే అంచనా వేసి చర్యలు చేపట్టాలని అధ్యయనం పేర్కొంది. అధ్యయనంలోని మరిన్ని వివరాలు..
శిలాజ ఇంధనాల వినియోగం స్థానంలో పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచే వరకు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది. ఉత్తర కేరళ ప్రాంతంలో క్వారీ అటవీ నిర్మూలనను తగ్గించడం ద్వారా ప్రకృతి ఉత్పాతాల నుంచి ప్రజలను కాపాడవచ్చు.
వయనాడ్ కొండచరియలు విరిగి పడిన ఘటన వాతావరణ మార్పుల కారణంగా సంభవించే విపత్తులకు ఒక ఉదాహరణ. పారిశ్రామికీకరణ కాలం కంటే ప్రస్తుతం 1.3 డిగ్రీల మేరకు వాతావరణం వేడెక్కిందని, ఫలితంగా ప్రతి 50 ఏళ్లకు ఇలాంటి ఉత్పాతం జరిగే అవకాశం ఉంటుంది.
1924, 2019లలో కేరళలో సంభవించిన విపత్తులతో పోల్చుకుంటే ప్రస్తుతం సంభవించింది మూడో అతి పెద్ద విపత్తు.
వయనాడ్ ఉత్పాతానికి ప్రధానంగా క్వారీయింగ్, అటవీ విస్థీర్నాన్ని 62 శాతానికి తగ్గించడం ప్రధాన కారణం. దీనివల్ల అతిభారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. అదేవిధంగా భూముల వినియోగ మార్పులు కూడా కూడా ఈ విపత్తుకు కారణమని అధ్యయనం వివరించింది.
వయనాడ్‌లో భారీ వర్షాలు!
కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆరంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. రానున్న 24 గంటల్లో 7-11 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ఎర్నాకులం, త్రిస్సూర్, కన్నూర్, కొజికోడ్లలో 12-20 సెంటీమీటర్ల మేర అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇక, లక్షద్వీ్‌పలో 20 సెంటీమీటర్లకు పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వరదల నుంచి అప్రమత్తం చేసే యాప్
న్యూఢిల్లీ, ఆగస్టు 14 : ప్రాణాంతక వరదల గురించి ముందే హెచ్చరించి, ప్రాణనష్టం తగ్గించేందుకు ‘రియల్ టైమ్ ఫ్లడ్ అలర్ట్’ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలోని 592 మోనెటరింగ్ స్టేషన్లు అందించే వరద అంచనాలను ఇకపై ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ప్రజలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. కేరళలోని వయనాడ్‌లో జరిగినట్టు పెను వరదలు, కొండచరియల బీభత్సం చోటుచేసుకోవడానికి ముందే ఆ ప్రాంతాలను ఖాళీ చేయించి, ఆస్తి, ప్రాణ నష్టం పెద్దగా లేకుండా చూడటం దీని లక్ష్యం. ‘ఫ్లడ్ వాచ్ ఇండియా 2.0’ పేరిట రూపొందించిన ఈ యాప్‌ను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ బుధవారం ఆవిష్కరించారు. కేంద్ర జల సంఘం ఆ యాప్‌ను తయారుచేసింది. ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో ‘ఫ్లడ్ వాచ్ ఇండియా యాప్’ పేరిట డౌన్లోడ్ చేసుకోవచ్చు.