Viral Video: 'ఫిష్ మీల్' వీడియోపై నిలదీసిన బీజేపీ, మీ 'ఐక్యూ' ఇంతేనా అని ప్రశ్నించిన తేజస్వి
ABN , Publish Date - Apr 10 , 2024 | 05:25 PM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లంచ్ బ్రేక్‌లో చేపకూరతో భోజనం తీసుకోవడం, ఆయనే స్వయంగా ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడం సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించగా, మీ 'ఐక్యూ' ఇంతేనా అంటూ తేజస్వి కౌంటర్ ఇచ్చారు.
పాట్నా: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉన్న బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లంచ్ బ్రేక్‌లో చేపకూరతో భోజనం (Fish Meal) తీసుకోవడం, ఆయనే స్వయంగా ఇందుకు సంబంధించిన వీడియో పోస్ట్ చేయడం సోషల్ మీడియోలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పించగా, మీ 'ఐక్యూ'ను పరీక్షించేందుకే వీడియో పోస్ట్ చేశానంటూ బీజేపీకి తేజస్వి కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న తేజస్వి గత సోమవారంనాడు లంచ్ బ్రేక్‌లో మాజీ మంత్రి ముఖేష్ సాహ్నితో కలిసి హెలికాప్టర్‌లోనే చేప, రొట్టితో ఆహారం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ''ఈరోజు లంచ్ కోసం ముఖేష్ చేపల కూర తెచ్చారు. చేప సింగిల్ బోన్‌తో చాలా రుచిగా ఉంది. దీనితో పాటు రోటి, సాల్ట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ కూడా ఉన్నాయి. ఎన్నికల బిజీ వల్ల కేవలం 10-15 నిమిషాలు మాత్రమే బ్రేక్ దొరికింది'' అని తేజస్వి ఆ వీడియాలో పేర్కొన్నారు. ఈ చేప ఎక్కడి నుంచి తెచ్చోరో వీక్షకులకు చెప్పాలంటూ ముఖేష్ సహానిని ఆ వీడియోలో తేజస్వి కోరారు. మిథిలాంచల్‌లో ఈ చేప దొరుకుతుదని, దీనిని ఛెఛ్రా అంటారని సహాని వివరించారు.
తేజస్వి యాదవ్ వీడియో క్లిప్‌లో బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా స్పందించారు. నవరాత్రుల్లో చేరకూర తినడంపై మండిపడ్డారు. కొందరు వ్యక్తులు (తేజస్వి) తాము సనాతన ధర్మాన్ని పాటిస్తామని ఘనంగా చెప్పుకుంటారనీ, కానీ సనాతనధర్మం విలువలు పాటించరని అన్నారు. ఆహారపు అలవాట్లపై తనకు అభ్యంతరం లేదని, అయితే నవరాత్రుల్లో చేపలు తింటూ వీడియోలు పోస్ట్ చేయడం ఏమిటి? ఇది బుజ్జగింపు రాజకీయాలు కావా? అని ఆయన నిలదీశారు. ఎవరైనా తమ మతం, విలువలు, దేశం, సమాజం గురించి గర్వంగా ఫీలవ్వాలని, వాటిని దిగజార్చడం మంచిది కాదని అన్నారు. సెక్యులరిజం అంటే సొంత మతాన్ని కించపరచడం కాదని ఎద్దేవా చేశారు.
Loksabha Polls: కుటుంబం కోసమే లాలు తపన.. బీజేపీ తీవ్ర విమర్శలు
మీ ఐక్యూను పరీక్షించేందుకే..
బీజేపీ కామెంట్లపై అంతే వేగంగా తేజస్వి స్పందించారు. ''దీనిపై అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. గత మూడునాలుగు రోజులుగా ముఖేష్ సహానితో కలిసి రెస్ట్ లేకుండా ప్రచారంలో ఉన్నాను. ప్రచారంలో ఉండగానే బీజేపీ నేతల ''ఐక్యూ'' పరీక్షించాలనుకున్నాను. నవరాత్రి ప్రారంభానికి ముందు రోజైన ఏప్రిల్ 8 నాటి వీడియో క్లిప్ అది. బీజేపీ ఆలోచనా తీరు గురించి మేము అనుకున్నది కరక్టేనని వారు నిరూపించుకున్నారు. కనీసం వీడియో క్లిప్‌లో పేర్కొన్న తేదీని కూడా వాళ్లు గమనించకుండా ట్రోల్ చేస్తున్నారు'' అని తేజస్వి మండిపడ్డారు. నిరుద్యోగం, వలసలు, పేదరికం గురించి వాళ్లు ఎప్పడూ మాట్లాడరని, బీజేపీ నిజ స్వరూపం ఏమిటో మరోసారి రుజువైందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం