ఈసారి బీజేపీకి 300కు పైగా
ABN , Publish Date - Apr 08 , 2024 | 04:36 AM
తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో గణనీయంగా ఓట్లు, సీట్లు సాధించి మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు.
కానీ 370 లక్ష్యం సాధించలేకపోవచ్చు
ఒడిశా, బెంగాల్‌లో నంబర్‌వన్ స్థానంలో!
తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో కాషాయపార్టీకి
సీట్లు, ఓట్లు.. గణనీయంగా పెరుగుతాయి
మోదీ నేతృత్వంలోని బీజేపీ అప్రతిహతంగా
దూసుకుపోతోందన్న వాదన వట్టి భ్రమే
ఆ పార్టీ వెనకబడిన సందర్భాలున్నాయి..
విపక్షాలు సొమ్ము చేసుకోలేకపోయాయి: పీకే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ రాష్ట్రంలో గణనీయంగా ఓట్లు, సీట్లు సాధించి మొదటి లేదా రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల సందడి నేపథ్యంలో ‘ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ)’ సంపాదకులకు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏప్రిల్ 19 నుంచి మొదలవుతున్న ఈ ఎన్నికల్లో బీజేపీ 300కి పైగా సీట్లు సాధిస్తుందని.. అయితే, ఆ పార్టీ పెట్టుకున్న 370 సీట్ల లక్ష్యాన్ని సాధించలేకపోవచ్చని పేర్కొన్నారు. బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు విపక్షాలకు గతంలో పలు అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేకపోయాయని వ్యాఖ్యానించారు. తూర్పు, దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన సీట్లను, ఓట్లశాతాన్ని గణనీయంగా పెంచుకుంటుందని పీకే అంచనా వేశారు. ముఖ్యంగా.. తెలంగాణలో మొదటి లేదా రెండో స్థానంలో నిలుస్తుందని, అది చాలా పెద్ద విషయమని పీకే తెలిపారు. అలాగే.. ‘‘ఒడిశాలో బీజేపీ తప్పకుండా అగ్రస్థానంలో నిలుస్తుంది. చెప్తే మీరు ఆశ్చర్యపోతారుగానీ.. నా లెక్క ప్రకారం బీజేపీ పశ్చిమబెంగాల్‌లో నంబర్ వన్ పార్టీగా నిలవబోతోంది’’ అని ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. తమిళనాడులో బీజేపీ ఓటు షేరు రెండంకెల శాతానికి చేరుతుందని చెప్పారు.
బీజేపీకి బాగా పట్టున్న పశ్చిమ, ఉత్తరాది రాష్ట్రాల్లోని కనీసం 100 సీట్లలో ఆ పార్టీని విపక్షాలు.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓడించగలిగితేనే కమలనాథులకు ఆ సెగ తాకుతుందని.. కానీ, అలా జరిగే అవకాశం లేదని తేల్చిచెప్పారు. ‘‘మీరు (రాహుల్/సోనియా) పోరాడాల్సింది ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో. కానీ, మీరు పర్యటిస్తున్నది మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో. ఇలా అయితే గెలుస్తారు? కేరళలో గెలిస్తే దేశమంతా గెలిచినట్టు కాదు. మీరు యూపీ, బిహార్, మధ్యప్రదేశ్‌లో గెలవనప్పుడు.. ఒక్క వయనాడ్‌లో గెలవడం వల్ల ఉపయోగమేమీ ఉండదు. అమేఠీని వదులుకోవడం ఒక తప్పుడు సందేశాన్ని పంపుతుంది’’ అని పీకే వ్యాఖ్యానించారు. బీజేపీని ఎదుర్కొనే నాయకత్వం, ఎజెండా కూటమికి లేవని.. అందుకే బీజేపీ పదేపదే గెలుస్తోందని విశ్లేషించారు. మోదీ నేతృత్వంలో బీజేపీ అప్రతిహతంగా దూసుకుపోతోందన్న వాదనను ఒక పెద్ద భ్రమగా కొట్టిపారేశారు. 2014 తర్వాత.. అధికారపార్టీ వెనకబడ్డ సందర్భాల్లో విపక్షాలు, ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిని సొమ్ము చేసుకోవడంలో విఫలమైనట్టు ఆయన పేర్కొన్నారు. మోదీ మూడోసారి గెలిచిన తర్వాత పెద్ద నిర్ణయాలు తీసుకుంటానని ప్రకటించారని.. ఆయనేమి చేస్తారో అన్న ఆసక్తి ఒక రాజకీయ పరిశీలకుడుగా తనకున్నదని ప్రశాంత్ కిశోర్ చెప్పారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఈ పెద్ద నిర్ణయాల వల్ల ప్రమాదం ఏర్పడుతుందేమోనన్న ఆందోళన వ్యక్తంచేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుకున్న ఫలితాలు సాధించలేకపోతే.. రాహుల్ గాంధీ తప్పుకోవాల్సిందేనని పీకే సూచించారు.