UK Scientists : పార్కిన్సన్స్‌ను ఏడేళ్ల ముందే గుర్తించే పరీక్ష
ABN , Publish Date - Jun 20 , 2024 | 03:26 AM
నాడీ వ్యవస్థను క్రమంగా క్షీణింపజేసి.. కాళ్లు చేతులు వణకడం, మతిమరుపు వంటి సమస్యలు కలిగించే పార్కిన్సన్స్ వ్యాధిని ఇప్పటిదాకా లక్షణాల ఆధారంగానే నిర్ధారిస్తున్నారు!
లండన్, జూన్ 19: నాడీ వ్యవస్థను క్రమంగా క్షీణింపజేసి.. కాళ్లు చేతులు వణకడం, మతిమరుపు వంటి సమస్యలు కలిగించే పార్కిన్సన్స్ వ్యాధిని ఇప్పటిదాకా లక్షణాల ఆధారంగానే నిర్ధారిస్తున్నారు! అలా కాకుండా.. లక్షణాలు బయటపడడానికి ఏడేళ్ల ముందే ఆ మహమ్మారిని గుర్తించే సాధారణ రక్తపరీక్షను యూనివర్సిటీ కాలేజ్ లండన్ (యూకే) శాస్త్రజ్ఞుల నేతృత్వంలోని పరిశోధక బృందం అభివృద్ధి చేసింది.
ప్రయోగాల్లో భాగంగా.. ర్యాపిడ్‌ఐ మూమెంట్ బిహేవియర్ డిజార్డర్ (ఐఆర్‌బీడీ)తో బాధపడుతున్న 72 మంది రక్త నమూనాలను సేకరించి వాటిని మెషీన్ లెర్నింగ్ ఆధారంగా విశ్లేషించారు. ఐఆర్‌బీడీ సమస్యతో బాధపడేవారిలో 75 నుంచి 80% మంది మెదళ్లలో అల్ఫాసైన్యూక్లిన్ అనే ప్రొటీన్ అసాధారణంగా పేరుకుపోతున్నట్టు ఆ టూల్ గుర్తించింది. అలాగే.. ఆ 72 మందిలో 16 మంది పార్కిన్సన్స్ బారిన పడే ప్రమాదం ఉందని ఆ టూల్ సరిగ్గా అంచనా వేసినట్టు పదేళ్ల పరిశీలన అనంతరం తేలింది. ‘‘పార్కిన్సన్‌ను ముందే గుర్తిస్తే తొలి దశల్లోనే చికిత్స అందించి ఆ వ్యాధి పురోగతిని ఆపవచ్చు. లేదా నిరోధించవచ్చు’’ అని ఈ పరిశోధకులు చెప్పారు.