UP Teacher: ఫోన్ దెబ్బకు టీచర్ ఉద్యోగం హుష్‌కాకి.. అసలు అందులో ఏముందంటే?
ABN , Publish Date - Jul 11 , 2024 | 05:46 PM
ఈరోజుల్లో ప్రతిఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఎంతో ముఖ్యమైంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ.. ఆ పరికరానికి బానిసగా మారితేనే అసలు సమస్యలు వచ్చిపడతాయి. లేనిపోని చిక్కుల్లో..
ఈరోజుల్లో ప్రతిఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ (Mobile Phone) అనేది ఎంతో ముఖ్యమైంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ.. ఆ పరికరానికి బానిసగా మారితేనే అసలు సమస్యలు వచ్చిపడతాయి. లేనిపోని చిక్కుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యమే తాజా ఉదంతం. ఓ ఉపాధ్యాయుడు తన విధుల్లో తరచూ మొబైల్ ఫోన్ వాడటం వల్ల.. ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిణామం ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
గురువారం సంభల్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర పన్సియా తనఖీలు నిర్వహించడానికి వెళ్లారు. అక్కడ విద్యార్థుల కాపీస్‌లో మొదటి నుంచి చివరి పేజీ వరకూ అనేక తప్పులను ఆయన గమనించారు. అప్పుడు ఆయన ఉపాధ్యాయులను పిలిపించి.. ఆ విషయంపై ప్రశ్నించారు. అనంతరం టీచర్ల ఫోన్లను పరిశీలించారు. ఈ క్రమంలోనే.. ప్రియమ్ గోయల్ అనే ఓ టీచర్ బండారం బట్టబయలైంది. అతని ఫోన్‌లోని ఒక ఫీచర్ (ఫోన్‌ని ఎన్ని గంటలు వాడారో చూపించే యాప్).. పాఠశాల సమయంలో దాదాపు రెండు గంటల పాటు క్యాండీ క్రష్ ఆడుతూ గడిపాడని చూపించింది. అంతేకాదు.. 26 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడాడని, 30 నిమిషాల పాటు సోషల్ మీడియా యాప్స్ చూస్తూ గడిపాడని తేలింది.
దీంతో.. ప్రియమ్ గోయల్‌పై, అలాగే పాఠశాల యాజమాన్యంపై రాజేంద్ర పన్సియా తీవ్ర కోపాద్రిక్తులయ్యారు. పాఠశాల సమయాల్లో విధులు నిర్వర్తించకుండా, ఫోన్‌లతో కాలక్షేపం చేస్తారా? అంటూ మండిపడ్డారు. ‘‘ఉపాధ్యాయులు విద్యార్థుల క్లాస్‌వర్క్, హోంవర్క్‌లను తనిఖీ చేయడంపై దృష్టి పెట్టాలి. వారికి నాణ్యమైన విద్య అందేలా చూడాలి. మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం సమస్య కాదు, కానీ పాఠశాల సమయంలో వ్యక్తిగత కారణాల కోసం వాటిని ఉపయోగించడం సరికాదు’’ అని మెజిస్ట్రేట్ తెలిపారు. కాగా.. ఈ విషయాన్ని ఆయన రాష్ట్ర విద్యాశాఖకు తెలియజేశారు. దీనిని విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తూ.. ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది.
Read Latest National News and Telugu News