Share News

UPSC aspirants’ death: లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ సిద్ధం

ABN , Publish Date - Jul 29 , 2024 | 09:54 AM

న్యూఢిల్లీలో వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో న్యూఢిల్లీలో మౌలిక సదుపాయాల సరిగ్గా లేవని.. అందువల్లే ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు అయితే సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.

UPSC aspirants’ death: లోక్‌సభలో చర్చకు కాంగ్రెస్ సిద్ధం

న్యూఢిల్లీ, జులై 29: న్యూఢిల్లీలో వరద నీటిలో చిక్కుకుని ముగ్గురు సివిల్స్ ఆశావహులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో న్యూఢిల్లీలో మౌలిక సదుపాయాల సరిగ్గా లేవని.. అందువల్లే ఈ తరహా ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు అయితే సర్వత్ర వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని సోమవారం పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అందులోభాగంగా ఢిల్లీలో మౌలిక సదుపాయాల విషాదాలతోపాటు అందుకు సంబంధించిన నష్టాలకు జవాబుదారీతనంపై చర్చకు అవకాశం ఇవ్వాలని లోక్‌సభలో వాయిదా తీర్మానాన్ని ఎంపీ మాణిక్ ఠాగూర్ ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రకటించింది.

Also Read: Rajasthan: సీఎంను హత్య చేస్తామంటూ బెదిరింపు.. రంగంలోకి దిగిన పోలీసులు


శనివారం భారీ వర్షం..

జులై 27వ తేదీ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఆ క్రమంలో ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌ బేస్‌మెంట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ వరద నీటిలో చిక్కుకుని సివిల్స్ ఆశావహులు తానియా సోని, శ్రియా యాదవ్, నవీన్ డెల్విన్ మరణించారు. అయితే ఈ స్టడీ సర్కిల్‌లోని బేస్‌మెంట్‌లోకి భారీగా వరద నీరు ప్రవేశించిన వీడియోలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి.


అంతేకాదు రావుస్ సంస్థ.. నిబంధనలను అతిక్రమించి మరి ఈ నిర్మాణం చేపట్టిందంటూ విమర్శలు సైతం వెల్లువెత్తాయి. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యజమానితోపాటు కో ఆర్డినేటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో వారికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని కోర్టు విధించింది.


ఆప్‌ ప్రభుత్వం లక్ష్యంగా బీజేపీ ఆరోపణలు..

మరోవైపు ఈ ఘటనపై అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్రంలోని అధికార బీజేపీ విమర్శలు సంధిస్తుంది. ఆ క్రమంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని అందువల్ల ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శించింది. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసిన హత్యగా బీజేపీ అభివర్ణించింది.


ఈ నేపథ్యంలో జులై 29వ తేదీ.. అంటే ఈ రోజు న్యూఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీజేపీ పిలుపునిచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు న్యూఢిల్లీలోని పలువురు విద్యుత్ షాక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో వరుసగా చోటు చేసుకుంటున్న ఈ తరహా ఘటనలపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతుంది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 29 , 2024 | 09:54 AM