West Bengal: కుప్పకూలిన ఐఏఎఫ్ శిక్షణ విమానం.. పైలెట్లు సురక్షితం
ABN , Publish Date - Feb 13 , 2024 | 08:01 PM
భారత వైమానికి దళానికి చెందిన శిక్షణ విమానం పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అయితే, ఈ ప్రమాదంలో పైలెట్లు ఇద్దరూ సురక్షితంగా బయపడినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
మిడ్నాపూర్: భారత వైమానికి దళానికి (IAF) చెందిన శిక్షణ విమానం పశ్చిమబెంగాల్‌లోని మిడ్నాపూర్‌లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. అయితే, ఈ ప్రమాదంలో పైలెట్లు ఇద్దరూ సురక్షితంగా బయపడినట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.
''ఐఏఎఫ్ హాక్ ట్రైనర్ విమానం కాలైకుంద ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. పైలట్లు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించాం. ఎలాంటి ప్రాణనష్టం కానీ, పౌర ఆస్తులకు నష్టం కానీ జరగలేదు'' అని ఐఏఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. శిక్షణా విమానం వెస్ట్ మిడ్నాపూర్‌లోని కాలైకుండ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైందని, ఖరగ్‌పూర్ సమీపంలోని ఖాళీ స్థలంలో కుప్పకూలండంతో ఎలాంటి నష్టం జరగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఎయిర్‌ఫోర్స్, పోలీస్ రెస్క్యూ టీమ్‌లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా వెస్ట్ మిడ్నాపూర్ ఎస్‌పీకి ఫోన్ చేసి ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు.