Vasantha Panchami : మనలో మహాసరస్వతి స్థిరపడాలంటే...

ABN , First Publish Date - 2024-02-08T23:12:51+05:30 IST

మాఘ మాసం అయిదో రోజు వసంత పంచమి. ఆ రోజున కళలకు, విజ్ఞాన శాస్త్రానికి, సంగీతానికి, జ్ఞానానికి దేవత అయిన సరస్వతిని ఆరాధిస్తాం. ఆమె వాక్కు, బుద్ధి, వివేకం, విద్యలకు అధిదేవత. వసంత పంచమి శీతాకాలానికి

Vasantha Panchami  : మనలో మహాసరస్వతి స్థిరపడాలంటే...

14న వసంత పంచమి

మాఘ మాసం అయిదో రోజు వసంత పంచమి. ఆ రోజున కళలకు, విజ్ఞాన శాస్త్రానికి, సంగీతానికి, జ్ఞానానికి దేవత అయిన సరస్వతిని ఆరాధిస్తాం. ఆమె వాక్కు, బుద్ధి, వివేకం, విద్యలకు అధిదేవత. వసంత పంచమి శీతాకాలానికి ముగింపును, వసంత ఋతువు ఆగమనాన్ని సూచిస్తుంది. ఋగ్వేదంలో, ‘దేవీ భాగవతం’లో, ‘బ్రహ్మవైవర్త పురాణం’లో, పద్మపురాణంలో సరస్వతీ దేవి గురించి వివిధ గాథలు ఉన్నాయి. ఆమెను ఆద్యంతరహిత శక్తి స్వరూపిణిగా వివిధ శాస్త్రాలు స్తుతించాయి. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తిని ప్రసాదించడానికి సరస్వతిని శ్రీమాతాదేవి ప్రసాదించిందని ‘దేవీభాగవతం’ చెబుతోంది. హంసవాహినిగా, వీణాపాణిగా, మాలాపుస్తకధారిణిగా సరస్వతిని ఎక్కువగా చిత్రీకరించడం కనిపిస్తుంది. సరస్వతీ వర్ణనల్లో తెల్లని వస్తువులకు ప్రాధాన్యం. ఆమె ధరించే వీణ పేరు కచ్ఛపి. పరాశక్తి ధరించిన తొలి అయిదు రూపాల్లో సరస్వతి ఒకటి. సరస్వతీదేవి ప్రత్యేకతను సహజయోగ ప్రదాత శ్రీమాతాజీ నిర్మలాదేవి పలు సందర్భాల్లో ఈ విధంగా వివరించారు:

మహాసరస్వతీ శక్తి మన సూక్ష్మ శరీరంలోని కుడిపార్శ్వంవైపు పని చేస్తుంది. స్వాధిష్టాన చక్రంలో కొలువై ఉన్న సరస్వతీ శక్తి తన గమనంలో... ఆ చక్రంలోని ఎడమ భాగాన్ని కుండలినీ జాగృతి ద్వారా ప్రకాశింపజేసినప్పుడు... మనలో కళాత్మక ప్రతిభలన్నీ అభివృద్ధి చెందుతాయి. కానీ స్వాధిష్టాన చక్రంలో రెండవ భాగాన్ని మనం చదవడం, రాయడం లాంటి వాటికి మాత్రమే ఉపయోగిస్తున్నాం. అంతకన్నా ఉన్నత స్థాయికి ఎదగడం మీద మన చిత్తాన్ని సారించడం లేదు. దీనివల్ల స్వాధిష్ఠాన చక్రంలో అసమతుల్యత ఏర్పడుతుంది. సరస్వతీ కృపవల్ల కళాకారులు సాహిత్యం, కళలు, సంగీత సాధన విషయంలో నిష్ణాతులైనా లక్ష్మీతత్త్వం వారికి అంతగా సహకరించకపోవడం మనం చూస్తూనే ఉంటాం. అది సహకరించాలంటే మనలోని సరస్వతీతత్త్వం... మహాసరస్వతీతత్త్వ స్థాయికి చేరాలి. అందుకోసం ఆజ్ఞాచక్రాన్ని అధిగమించే స్థాయికి ఆధ్యాత్మికంగా చేరుకోవాలి. అదే మహాలక్ష్మి, మహాసరస్వతి శక్తులు కలిసే స్థానం. కళాసామర్థ్యానికి తగిన విధంగా ధనార్జన చేయలేకపోతున్నామనుకొనేవారికి... ఆజ్ఞాచక్రాన్ని దాటితేనే ఆ సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది. ఎప్పుడయితే మహాసరస్వతీతత్త్వం మనలో అభివృద్ధి చెందడం మొదలవుతుందో... వాస్తవాన్ని గ్రహించగలుగుతాం. అవగాహనలో మార్పు వస్తుంది ‘మనమందరం ఒక్కటే, విశ్వంలో మనం అంతర్భాగం’ అనే సత్యం స్థిరపడుతుంది. సరస్వతీతత్త్వం ఒక బీజం లాంటిదైతే... మహాసరస్వతీతత్త్వం ఒక వృక్షం లాంటిది. మీలో నిక్షిప్తమైన సరస్వతీ శక్తిని మహాసరస్వతీ శక్తిగా మార్చుకోకపోతే... మీ సుషుమ్నా మార్గంలో ఉన్న శ్రీమహాలక్ష్మీ శక్తితో ఐక్యం కాలేరు. శ్రీమహాలక్ష్మీ శక్తి అనుగ్రహం ద్వారా మాత్రమే మీరు ఆత్మసాక్షాత్కారం పొందగలరు. మన ఎడమ పార్శ్వంలోని ఇడానాడిలో ఉన్న మహా కాళీతత్త్వం వల్ల ఏదైనా పనిని తలపెట్టి, దాన్ని నెరవేర్చుకోవాలనే కోరికను కలిగి ఉంటారు. అయితే దాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చేది మాత్రం శ్రీమహాసరస్వతీ శక్తే. మనలోని సరస్వతీ శక్తిని జాగృతం చేసుకొని, మహాసరస్వతీ శక్తిని స్థిరపరుచుకోవడం అనేది.. కుండలినీ శక్తి ఉత్థానం ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందడం ద్వారా, నిత్య సహజయోగ ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.

rakesh.jpg

డాక్టర్‌ పి. రాకేష్‌ 8988982200

‘పరమ పూజ్యశ్రీ మాతాజీ నిర్మలాదేవి,

సహజయోగ ట్రస్ట్‌’, తెలంగాణ

Updated Date - 2024-02-08T23:12:52+05:30 IST