Share News

Navya : నీవు ఎవరు..?

ABN , Publish Date - May 30 , 2024 | 11:28 PM

ఒకసారి వేసవిలో కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు. విపరీతమైన ఎండగా ఉంది. మిట్టమధ్యాహ్నానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి.

Navya : నీవు ఎవరు..?

సద్బోధ

మహాకవి కాళిదాసు విద్వత్తు గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.

అలాంటి కాళిదాసుకు ఒక సమయంలో తనకు అన్నీ తెలుసుననే

అహంభావం బాగా పెరిగిందట. దీనిని సరిచేయటానికి సరస్వతీదేవే

స్వయంగా పూనుకుందట.

దీనికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది.

కసారి వేసవిలో కాళిదాసు పరదేశానికి బయలుదేరాడు. విపరీతమైన ఎండగా ఉంది. మిట్టమధ్యాహ్నానికి ఒక గ్రామానికి చేరుకున్నాడు. తెచ్చుకున్న నీళ్లు అయిపోయాయి. గ్రామంలోని ఒక గుడిసె దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక బాలిక కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్లి- ‘‘బాలికా్‌ నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇస్తావా?’’ అని అడిగాడు.

ఆ బాలిక- ‘‘మీరు ఎవరో నాకు తెలియదు. అలాంటప్పుడు నీళ్లు ఎలా ఇస్తాను’’ అంది.

కాళిదాసు అహం దెబ్బతింది. ‘‘నా పేరు కాళిదాసు. మహా పండితుడిని. శాస్త్ర విషయాల్లో అత్యంత బలవంతుడిని. ఈ రాజ్యంలో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు’’ అన్నాడు.

అప్పుడా బాలిక నవ్వి- ‘‘మీరు అసత్యం చెబుతున్నారు. మీరు అత్యంత బలవంతులు కారు.. సరే... మీరు ఈ ప్రపంచంలో బలవంతులు ఎవరో చెబితే నీళ్లు ఇస్తా’’ అంది.

కాళిదాసుకు సహనం నశిస్తోంది. కోపంగా- ‘‘దానికి సమాధానం నా దగ్గర లేదు.. దాహంగా ఉంది.. నీళ్లు ఇవ్వు’’ అన్నాడు.

అప్పుడు ఆ బాలిక- ‘‘సమాధానం తెలియదు అన్నారు కాబట్టి వదిలేస్తున్నా. ఈ ప్రపంచంలో అత్యంత బలవంతులు- ఆకలి, దాహం- వీటి బారినపడితే ప్రమాదమే! ఇప్పుడు మరో ప్రశ్న అడుగుతా. దానికి సరైన సమాధానం చెబితే నీళ్లు ఇస్తా’’ అంది.

ఒక బాలిక చేతిలో తాను ఓడిపోతున్నాననే ఆలోచన కాళిదాసులో అసహనాన్ని మరింత పెంచింది. ‘‘అడుగు. నువ్వు ఏం ప్రశ్న అడిగినా చెబుతాను’’ అన్నాడు.

ఆ బాలిక నవ్వి- ‘‘మీరు ఎవరు’’ అని అడిగింది.

కాళిదాసు మొహంలో చిరునవ్వు వెలిసింది. ‘‘నేను బాటసారిని..’’ అని నేరుగా సమాధానం చెప్పాడు.

అప్పుడు ఆ బాలిక- ‘‘బాటసారికి అలుపు ఉండదు. అన్ని విపత్తుల నుంచి తప్పించుకోవటానికి వ్యూహాలు ఉంటాయి. కానీ మీరు అలసిపోయారు. కాబట్టి మీరు బాటసారి కారు. ఈ ప్రపంచంలో అలాంటి బాటసారులు- సూర్య చంద్రులే’’ అంది.


ఇంతలో గుడిసెలో అలికిడి అయితే ఆ బాలిక లోపలికి వెళ్లింది. కాళిదాసుకు శోష వచ్చేలా ఉంది. దాంతో - ‘‘లోపల ఉన్నవారికి నా విన్నపం. విపరీతమైన దాహంగా ఉంది. శోష వచ్చేలా ఉంది. కరుణించి నీళ్లు ఇవ్వండి’’ అని అరిచాడు.

కాళిదాసు అరుపులకు లోపలి నుంచి ఒక పండు ముసలి అవ్వ బయటకు వచ్చింది. ‘‘ఎందుకయ్యా! అంత పెద్దగా కేకలు పెడతావు. నువ్వు ఎవరో నాకు చెప్పు. నీకు నీళ్లు ఇస్తా’’ అంది.

అప్పుడు కాళిదాసు కొద్ది సేపు ఆలోచించి- ‘‘నేను ఈ ప్రపంచంలో అతిథిని’’ అన్నాడు.

అప్పుడు ఆ ముసలి అవ్వ - ‘‘నువ్వు సరైన సమాధానం చెప్పటం లేదు. ఈ సృష్టిలో ధనం, యవ్వనం- ఈ రెండే అతిధులు. ఇవి ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు వెళ్తాయో ఎవరికీ తెలియదు’’ అంది.

కాళిదాసుకు తనను ఎవరో పరీక్ష పెడుతున్నారనే విషయం అర్థమయింది. శరణాగతి కోరటం తప్ప వేరే మార్గం లేదని గ్రహించి- ‘‘అవ్వా! నేను సహనం కోల్పోయి సరైన సమాధానాలు చెప్పలేకపోయా. ఇప్పుడు నాకు తత్వం బోధపడింది. నేను సహనశీలిగా మారాను. దయ ఉంచి నాకు మంచినీళ్లు ఇవ్వండి’’ అన్నాడు.

అప్పుడు అవ్వ- ‘‘ఇంకా నీకు ఈ ప్రపంచతత్వం అర్థం కాలేదు. ఈ భూమిపై సహనశీలులు ఇద్దరే. ఒకటి భూమి. రెండు వృక్షం. ఈ ఇద్దరూ అందరికీ ఇవ్వటమే తప్ప ఏది వెనక్కి తీసుకోరు. సహనంతో ఉంటారు’’ అంది. కాళిదాసుకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు.

అవ్వకు నమస్కరించి- ‘‘నాకు సమాధానం చెప్పే ఓపిక కూడా లేదు. నేను ఒక మూర్ఖుడిని. దయచేసి నాకు నీళ్లు ఇప్పించు’’ అని ప్రాధేయపడ్డాడు.

అప్పుడు ఆ అవ్వ-‘‘ ఈ సారి సరైన సమాధానం చెప్పావు. ఈ ప్రపంచంలో ఇద్దరు మూర్ఖులున్నారు.

ఒకటి తనకు అర్హత లేకపోయినా ప్రజలను పాలించే రాజు. ఆ అర్హత లేని ప్రభువును కీర్తించే కవి. కాబట్టి నీవు ఎవరో నీకు అర్థమయిందా?’’ అంది.

అప్పుడు కాళిదాసుకు తన ముందు ఉన్నది - సరస్వతీదేవేనని అర్థమయి.. ఆమెకు సాష్టాంగ నమస్కారం చేసి- ఆశీస్సులు అందుకున్నాడు.

Updated Date - May 30 , 2024 | 11:28 PM