Share News

NRI: యూఎస్ఏలో ‘అన్నమయ్య డే’! సిలికానాంధ్ర ఆధ్వర్యంలో సంకీర్తనోత్సవం

ABN , Publish Date - Sep 01 , 2024 | 08:48 AM

అలెన్ నగర మేయర్ కార్యాలయం శాస్త్రీయ సంగీతానికి, హిందు సాంప్రదాయానికి, ఉనికికి విశేష సేవలందించిన తాళ్లపాక అన్నమాచార్యుల సేవలను, భక్తిప్రపత్తులను గుర్తిస్తూ ఆగష్టు 31వ తేదీని “అన్నమయ్య డే”గా ప్రకటించారు.

NRI: యూఎస్ఏలో ‘అన్నమయ్య డే’! సిలికానాంధ్ర ఆధ్వర్యంలో సంకీర్తనోత్సవం

తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, నిగమాగమ పండితుడు తాళ్లపాక అన్నమాచార్యుల కీర్తనలకు ఉత్తర అమెరికాలో టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో ఘననీరాజనం దక్కింది (NRI). అలెన్ నగర మేయర్ కార్యాలయం శాస్త్రీయ సంగీతానికి, హిందు సాంప్రదాయానికి, ఉనికికి విశేష సేవలందించిన తాళ్లపాక అన్నమాచార్యుల సేవలను, భక్తిప్రపత్తులను గుర్తిస్తూ ఆగష్టు 31వ తేదీని “అన్నమయ్య డే”గా ప్రకటించారు.

NRI: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో తెలంగాణ టెకీలకు ప్రాధాన్యత

ఆరు శతాబ్దాల పూర్వం అన్నమయ్య రచించిన 32 వేల సంకీర్తనల నుండి ఏడింటిని ఎంపిక చేసి సిలికానాంధ్ర సంస్థ “అన్నమయ్య సంకీర్తనోత్సవం - మహా బృంద గళార్చన” పేరిట ఏడుకొండల వాడికి అమెరికా వేదికగా సమర్పించిన నాద - నాట్య -గళాభిషేకాలలో ప్రవాసులు ఆర్తి నిండిన తమ హృదయాలను నైవేద్యంగా సమర్పించి భక్తుడికి, భగవంతుడికి సత్కారం చేశారు. 7 వేలకు పైగా భక్తులు చేసిన ఆలాపనలో గోవింద నామ శక్తి ప్రతిధ్వనించింది. అమెరికాలో తొలిసారిగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన ఘనత సిలికానాంధ్ర సంస్థకే దక్కుతుందని వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ తెలిపారు. డల్లాస్ పరిసర ప్రాంతాలే గాక అమెరికా నలుమూలల నుండి ఈ ఉత్సవంలో భాగస్వామ్యం అయ్యేందుకు తరలివచ్చిన ప్రవాస భక్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడతామని వెల్లడించారు. భారతీయ సంస్కృతికి, వినోదానికి మధ్య ఒక సన్నని గీత ఉందన్న ఆనంద్, అదే వినోదాన్ని సంస్కృతికి జోడించి అన్నమయ్య ఆశించిన జీవనవిధానాన్ని ప్రవాసులు కూడా అన్వయించుకునే వేదిక కల్పించడమే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమని వెల్లడించారు. 1408లో పుట్టిన అన్నమయ్యకు 16వ ఏట 1424లో వెంకన్న సాక్షాత్కారం జరిగి ఆయన పాటలు రాశారని, 600 సంవత్సరాల అనంతరం 2024లో అవే పాటలు 10వేల మైళ్ల ఆవల ఉన్న అమెరికాలో పాడుకోవడం తెలుగు అక్షరానికి, భక్తికి, మన సాంప్రదాయానికి ఉన్న బలమని ఆనంద్ అన్నారు.

7.jpg


అమెరికా వచ్చిన అన్నమయ్య

సిలికానాంధ్ర సంకల్పాన్ని అర్థం చేసుకున్న అన్నమయ్య వంశస్థులు 8 తరాలుగా తమ ఇలవేల్పుగా కొలుస్తున్న ఆయన చెక్క విగ్రహాన్ని ఈ సంకీర్తనోత్సవానికి సాక్షీభూతంగా ఉండేందుకు అమెరికా పంపారు. 600 ఏళ్ల కిందట తిరుమల కొండనెక్కి, తన పదవిన్యాసాలతో శ్రీవారిని మెప్పించి ఆపైన వైకుంఠానికి ఎక్కిన అన్నమయ్య … సప్త సముద్రాలు దాటి తన పాటలకు తరిగిపోని గౌరవం తీసుకువస్తున్న ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు అమెరికా రావడం ప్రవాసులను మైమరపించింది.

3.jpg

తితిదే సహకారం

అన్నమయ్య సంకీర్తనోత్సవం పేరిట అమెరికాలో తొలిసారిగా నిర్వహిస్తున్న మహా బృంద గళార్చనకు తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి సహకారాన్ని అందించింది. భక్తులకు అందించేందుకు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని, సన్నిధానం పట్టువస్త్రాలను సిలికానాంధ్రకు అందజేసి తమ కృతజ్ఞత చాటుకుంది.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

ఈ ఉత్సవంలో మూడు రకాలుగా శ్రీవారిని అర్చించారు. నాదార్చన విభాగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీత అవసరాల కన్యాకుమారి వాయులీన, ఫణి నారాయణ వీణ ప్రదర్శనలు అలరించాయి. అవసరాల కన్యాకుమారిని “వాయులీన సామ్రాజ్ఞి” బిరుదుతో సత్కరించారు. నాట్యార్చన విభాగంలో కూచిపూడి-భరతనాట్యం-ఓడిస్సి నృత్యాలను స్థానిక గురువులు వారి శిష్య బృందాలు ప్రదర్శించి ఆకట్టుకున్నాయి. చివరగా భక్తులు ఏడు కీర్తనలను పారుపల్లి రంగనాథ్ - గరిమెళ్ల అనిల కుమార్‌ల సమన్వయంలో ఆలపించి గళార్చన చేశారు.

4.jpg


మరో రెండేళ్లలో సిలికానాంధ్ర వైద్య విశ్వవిద్యాలయం

రానున్న రెండేళ్లలో సిలికానాంధ్ర ఆధ్వర్యంలో వైద్య విశ్వవిద్యాలయాన్ని అమెరికాలో ఏర్పాటు చేస్తామని ఆనంద్ తెలిపారు. ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యులు డా. ముక్కామల అప్పారావు మాట్లాడుతూ అమెరికాకు వలస వచ్చినవారి ఏ దేశం తీసుకున్న ఆయా దేశాలకు చెందిన వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య విశ్వవిద్యాలయాలు ఉన్నాయని కానీ భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి ఈ లోటును భర్తీ చేసేందుకు సిలికానాంధ్ర కంకణం కట్టుకుని వైద్య విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ముందుకు రావడం హర్షణీయమన్నారు.

5.jpg

సజీవనది సిలికానాంధ్ర

క్రమశిక్షణకు మారుపేరైన సిలికానాంధ్ర సంస్థ ఈ ఉత్సవంలో కూడా తనదైన ఆచరణాశైలిని అవలంబించింది. కార్యక్రమ ఏర్పాట్లను పకడ్బందీగా చేసింది. ఈ వేడుకల ఏర్పాట్లను గత రెండువారాలుగా డల్లాస్‌లోనే ఉంటూ ఆనంద్ దంపతులు స్వయంగా పర్యవేక్షించారు. వీరికి తోడుగా కాలిఫోర్నియా నుండి ప్రియా తనుగుల, దిలీప్ కొండిపర్తి, రాజు చమర్తి, సాయి, అనూష, అరుణ్, వేదుల స్నేహ, స్థానికులు కళ్యాణి, జోస్యుల ప్రసాద్, రాయవరం విజయభాస్కర్, నూతి బాపు, పాలూరి రామారావు తదితరులు సహకరించారు. గతంలో లక్షగళార్చన, కూచిపూడి మహాబృంద నాట్యం, మహావాద్య సమ్మేళనం వంటి సమాజ ప్రాయోజక కార్యక్రమాలతో 10 సార్లు గిన్నీస్ రికార్డులకు ఎక్కిన సిలికానాంధ్ర ఈసారి అమెరికాలో తొలిసారిగా అన్నమయ్యకు జనరంజకంగా ఘననీరాజనం అర్పించి సనాతన సాంప్రదాయాలకు మరోసారి పెద్దపీట వేసింది.

10.jpg6.jpg9.jpg8.jpg2.jpgRead Latest NRI News and Telugu News

Updated Date - Sep 01 , 2024 | 08:57 AM