AP Elections 2024: కేశినేని చిన్నికి ఎంపీ టికెట్ ఎలా దక్కింది..?
ABN , Publish Date - Mar 23 , 2024 | 08:19 AM
Kesineni Chinni Vs Nani: కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని (Kesineni Chinni) ఏడాది క్రితం వరకు టీడీపీలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ ఏడాది నుంచి ఆయన పేరు విజయవాడ పార్లమెంటు ప్రజలకు సుపరిచితమైపోయింది..
కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని (Kesineni Chinni) ఏడాది క్రితం వరకు టీడీపీలో కొద్ది మందికి మాత్రమే తెలిసిన పేరు. కానీ ఏడాది నుంచి ఆయన పేరు విజయవాడ పార్లమెంటు ప్రజలకు సుపరిచితమైపోయింది. ఓవైపు సేవా కార్యక్రమాలతో జనం మదిలో చోటు సంపాదించుకుంటూనే మరోవైపు పార్టీని కష్టకాలంలో అన్నీ తానై ముందుకు నడిపించారు. ఈ అంశాలన్నీ ఆయన్ను విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో తిరుగులేని టీడీపీ నాయకుడిగా నిలబెట్టాయి.
నాని శైలితో..!
కేశినేని చిన్ని 1994 నుంచి టీడీపీ కుటుంబ సభ్యుడిగా ఉన్నా సామాన్య కార్యకర్తగానే కొనసాగుతూ వచ్చారు. తన సోదరుడు కేశినేని నాని (Kesineni Nani) రాజకీయ ఎదుగుదలలో చిన్నిది కీలక పాత్ర. 2019లో ఎంపీగా గెలుపొందిన తర్వాత కేశినేని నాని శైలి మారిపోయింది. పార్టీ అధినేత చంద్రబాబుపైన, యువనేత లోకేశ్‌పైన పదే పదే నోరుజారడం.. బహిరంగంగానే పార్టీని విమర్శించడంతో పార్టీ నాయకులకు నానికి దూరం పెరుగుతూ వచ్చింది. నాని శైలిని జీర్ణించుకోలేకపోయిన చిన్ని సోదరుడితో విభేదించి ఆయనకు దూరమయ్యారు. ఆయనతోపాటే ఒకప్పుడు నానికి అత్యంత సన్నిహితులుగా ఉన్న టీడీపీ నాయకులు కూడా ఒక్కొక్కరుగా దూరమవుతూ వచ్చారు. వారందరిపైనా నాని నోరు పారేసుకునేవారు. నాని తీరుతో ఇబ్బందిపడుతున్న పార్టీ నాయకులు నెమ్మదిగా చిన్ని వైపు మొగ్గుచూపారు. క్రమంగా చిన్ని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా మారారు. ఒకప్పుడు తెరవెనుక రాజకీయాలకే పరిమితమైన చిన్ని ఏడాది కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా విజయవాడ పార్లమెంటు పరిధిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టి నిర్వహిస్తున్నారు.
సేవలకు గుర్తింపు..
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ప్రారంభించి నిత్యం మూడువేల మందికి అన్నదానం చేస్తున్నారు. వైద్యశిబిరాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందేలా చూస్తున్నారు. బసవతారకం ఇండో కేన్సర్ ఆసుపత్రి సహకారంతో అత్యంత ఖరీదైన కేన్సర్ పరీక్షలు మొబైల్ మెడికల్ వ్యాన్ ద్వారా మారుమూల పల్లెల్లోనూ ఉచితంగా చేయిస్తున్నారు. కృష్ణానది తీరాన ఉండి కూడా సరైన నీటి సౌకర్యం లేకపోవడంతో ఎ.కొండూరు గిరిజన ప్రాంతంలోని ప్రజలు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. సుమారు 500 మందికిపైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా ఉచితంగా మందులు, పౌష్టికాహారం అందజేస్తున్నారు. చంద్రబాబు (Chandrababu) అక్రమ అరెస్టును నిరసిస్తూ విజయవాడ పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించడంలో చిన్ని తనదైన ముద్ర వేశారు. యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రను జయప్రదం చేయడంలోనూ చిన్ని కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ చిన్నిని విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపింది.
పేరు : కేశినేని శివనాథ్ (చిన్ని)
పుట్టిన తేదీ : 3–8–1969
విద్యార్హత : బీటెక్(మెకానికల్ ఇంజనీరింగ్)
వృత్తి : రియల్ ఎస్టేట్, కేశినేని డెవలపర్స్ సీఈవో
తండ్రి : రామస్వామి
తల్లి : ప్రసూనాంబ
భార్య : జానకీ లక్ష్మి
పిల్లలు వెంకట్ చౌదరి, స్నిగ్ధ.
మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..