Viral: మహిళలూ.. హోటల్స్‌కు వెళుతున్నారా? జాగ్రత్త.. ఇలాంటోళ్లూ పొంచి ఉంటారు!
ABN , Publish Date - Jun 10 , 2024 | 04:15 PM
డెలివరీ బాయ్‌లా నటిస్తూ ఓ చెయిన్ స్నాచర్.. రెస్టారెంట్‌లోని మహిళా కస్టమర్ గొలుసు తెంపుకుని పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఇంటర్నెట్ డెస్క్: చెయిన్ స్నాచర్లు ఎప్పుడు ఎలా టార్గెట్ చేస్తారో చెప్పడం కష్టం. వీధుల్లో ఒంటరిగా వెళ్లే వాళ్లను సాధారణంగా టార్గెట్ చేస్తుండటం ఇప్పటివరకూ చూశాం. కానీ ఓ చెయిన్ స్నాచర్ మాత్రం తెలివి మీరిపోయాడు. బాధితురాలి ముందే ఏమీ తెలీనట్టు తచ్చాడుతూ అవకాశం దొరగ్గానే మెడలో చెయిన్ తెంపుకుని వెళ్లిపోయాడు. రెస్టారెంట్‌లో అందరూ చూస్తుండగా జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం విపరీతంగా వైరల్ (Viral) అవుతోంది.
హర్యానాలోని పానిపట్ జిల్లాలోని ఓ రెస్టారెంట్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దృశ్యాలు ప్రకారం, చెయిన్ స్నాచర్ ఓ డెలివరీ ఏజెంట్‌లాగా రెస్టారెంట్‌లో మాటు వేశాడు. అతడి ముందుగానే ఓ మహిళ తన కుటుంబంతో టిఫిన్ తింటోంది. హెల్మెట్ పెట్టుకున్న అతడు డెలివరీ బాయ్ లాగా కనిపించడంతో ఆమె అస్సలు పట్టించుకోలేదు. తన మానాన తాను తింటోంది. కానీ మహిళను చూడగానే దొంగ ఆమెను ఈజీగా టార్గెట్‌గా భావించాడు. ఆమెకు ఏమాత్రం అనుమానం రాకుండా ఎదురుగానే నిలబడి సమయం కోసం జాగ్రత్తగా ఎదురు చూశాడు. అతడు డెలివరీ ఏజెంట్ లా ఉండటంతో రెస్టారెంట్ సిబ్బంది, యాజమాన్యం కూడా పట్టించుకోలేదు (Chain Snatcher Posing As Delivery Guy Targets Woman In Restaurant).
Viral: ప్రతి విమానంలో ఇలాంటి ప్యాసెంజర్ ఉండాల్సిందే! నెట్టింట వైరల్‌గా మారిన వీడియో!
ఈలోపు మహిళ అటువైపు తల తిప్పి తన పిల్లలతో ఏదో మాట్లాడుతోంది. ఇదే సరైన సమయం అనుకున్న దొంగ తన ఫోన్ చూసుకుంటున్నట్టు నటిస్తూ ఆమె వద్దకు వచ్చి ఒక్కసారిగా గొలుసు లాక్కుని పారిపోయాడు. ఆమె స్పందించేలోపే అతడు రెస్టారెంట్ బయటకు వెళ్లి మాయమైపోయాడు.
ఇక వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాకైపోతున్నారు. దొంగలు మరీ తెలివి మీరిపోయారంటూ గుండెలు బాదుకుంటున్నారు. మహిళలు పిల్లలతో కలిసి రెస్టారెంట్లు, హోటళ్లు వంటి చోట్లకు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలపై ఓ కన్నేసి ఉంచాలని కొందరు సూచించారు. ముఖం కనబడకుండా హెల్మెట్ పెట్టుకుని ఎవరైనా కనిపిస్తే వారిపై నిరంతరం ఓకన్నేసి ఉంచాలని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి!