Digital Arrest: ఈ చిన్న మెలకువలు తెలిస్తే చాలు.. మిమ్మల్ని ఎవరూ డిజిటల్ అరెస్ట్ చేయలేరు
ABN , Publish Date - Nov 05 , 2024 | 11:39 AM
‘‘మేము ఈడీ అధికారులం. ఒక కేసులో మీ ప్రమేయం ఉంది. మీ ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలను గుర్తించాం. మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం. మీరు ఫోన్ కట్ చేయకుండా వీడియో కాల్‌లో మా ఆధినంలో ఉండాలి’’ అంటూ ఫేక్ నోలీసులు పంపిస్తూ మోసగాళ్లు ‘డిజిటల అరెస్ట్’ మోసాలకు పాల్పడుతున్నారు. డబ్బు చెల్లిస్తే కేసు నుంచి తప్పిస్తామంటూ మభ్యపెడుతున్నారు. ఈ కేసుల నుంచి బయటపడాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.
మన దేశంలో ఇటీవల ‘డిజిటల్ అరెస్ట్’ సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. సీబీఐ, ఈడీ, ఆర్బీఐ లేక పోలీసులమంటూ కేటుగాళ్లు వీడియో కాల్స్ చేసి అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. కేసుల విచారణ పేరిట బాధితులను రోజుల తరబడి తమ ఆధీనంలో ఉంచుకొని డబ్బు కాజేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఈ స్కామ్ బారిన పడ్డారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు డిజిటల్ అరెస్ట్ మోసాల రూపంలో కేటుగాళ్లు ఏకంగా రూ.120 కోట్ల మేర దోచుకున్నారంటే ఈ మోసాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈడీ, సీబీఐ, పోలీస్, ఆర్బీఐతో పాటు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల పేరిట మోసాలకు తెగబడుతున్నారు.
అంతకంతకూ పెరిగిపోతున్న ఈ డిజిటల్ అరెస్ట్ మోసాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా స్వయంగా అవగాహన కల్పించారు. ఇటీవల జరిగిన ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్‌లో డిజిటల్ స్కామ్‌ల గురించి మాట్లాడారు. ఏ దర్యాప్తు సంస్థా ఆన్‌లైన్‌లో విచారణ జరపబోదని పౌరులు గుర్తించాలని ఆయన సూచించారు. ఎవరైనా ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఫోన్ చేస్తున్నామని చెబితే నమ్మొద్దని అన్నారు. అలా ఎవరైనా చెబితే మోసగాడు అని గుర్తించాలని అన్నారు. ఇక పౌరులకు ఏమైనా అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. కాగా డిజిటల్ అరెస్టుల్లో కేటుగాళ్లు ఎక్కువగా నకిలీ నోటీసులు, నకిలీ అరెస్ట్ వారెంట్లు జారీ చేసి నమ్మిస్తున్నారు. వీటిని గుర్తించలేక చాలా మంది బాధితులుగా మారుతున్నారు. అయితే ఈ ఫేక్ నోటీసులు, అరెస్ట్ వారెంట్లను ఏవిధంగా గుర్తించవచ్చో కేంద్ర ప్రభుత్వ టెలికమ్యూనికేషన్స్ విభాగం కొన్ని ముఖ్యమైన సూచనలు చేసింది.
కేంద్ర ప్రభుత్వ సూచనలు ఇవే..
తక్షణ అరెస్టు చేస్తామంటూ బెదిరింపు
24 గంటల్లోనే అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపు నోటీసు పంపిస్తే అస్సలు నమొద్దు. అది స్కామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజమైన దర్యాప్తు సంస్థలు అరెస్టులకు సంబంధించి అవసరమైన ప్రక్రియలను కచ్చితంగా అనుసరిస్తాయి. ఈ విధంగా వెంటనే అరెస్ట్ చేస్తున్నామంటూ బెదిరించవు.
అర్థం కాని పద ప్రయోగం
బాధితులను భయపెట్టడానికి, గందరగోళానికి గురిచేయడానికి స్కామర్లు పంపించే నోటీసుల్లో అర్థం కాని సంక్లిష్టమైన పదప్రయోగం ఉంటుంది. ఫేక్ నోటీసుల్లో పేర్కొన చట్టాలు, నిబంధనలను కూడా అర్థం చేసుకోలేని విధంగా ఉంటాయి. నిజమైన చట్టపర నోటీసులు సాధారణంగా చాలా స్పష్టంగా, సంక్షిప్తంగా అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటాయి.
పేలవంగా కనిపించే స్టాంపులు, లోగోలు
నిజమైన అధికారిక నోటీసుల్లో చక్కగా డిజైన్ చేసిన స్టాంపులు, లోగోలు కనిపిస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా ఫేక్ నోటీసుల్లో కనిపించే స్టాంపులు స్పష్టంగా కనిపించవు. అందులో ఉన్న లోగో ఏంటో కూడా గుర్తించలేనట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని మోసపూరితంగా భావించవచ్చు.
సంతకాలు వృత్తికి తగినట్టుగా ఉండవు
చట్టబద్ధమైన నోటీసులపై సాధారణంగా అధికారుల డిజిటల్ సంతకాలు లేదా స్వయంగా చేతితో చేసిన సంతకాలు కనిపిస్తాయి. కానీ ఫేక్ నోటీసుల్లో అస్పష్టమైన సంతకాలు, వృత్తికి తగినట్టుగా కాకుండా అనుమానాస్పదంగా ఉంటాయి.
సంప్రదింపుల సమాచారం లేకపోవడం
నిజమైన నోటీసులను గుర్తించడానికి, వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవడానికి వాటి కింద సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు లేదా ఈ-మెయిల్ ఐడీ ఉంటాయి. వీటి ద్వారా తదుపరి సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఫేక్ నోటీసుల్లో స్కామర్లు సంప్రదింపుల కోసం సమాచారం ఇవ్వరు.
కించపరుస్తూ బెదిరింపులు
నిజమైన దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు ఎవరినీ వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడరు. బహిరంగంగా దూషిస్తూ బెదిరించరు. అయితే డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల్లో కేటుగాళ్లు ఇలాంటి పద్ధతులను అవలంభిస్తుంటారు.
ఇవి కూడా చదవండి
ఇవాళ విరాట్ కోహ్లీ బర్త్‌డే.. ఎన్నేళ్లు నిండాయో తెలుసా
రోహిత్ శర్మను ఉద్దేశించి సునీల్ గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
విమానాల్లో ప్రయాణిస్తుంటారా.. కీలక మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
అమెరికాలో ఇవాళే అధ్యక్ష ఎన్నికలు.. ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా
నాలుగేళ్ల తర్వాత తొలిసారి.. చైనా సరిహద్దులో..
For more Sports News and Telugu News