Viral: రైల్లో తన చెల్లికి ఎదురైన అనుభవానికి అన్నకు భారీ షాక్!
ABN , Publish Date - Apr 15 , 2024 | 06:22 PM
రైల్లో రద్దీ కారణంగా తన చెల్లి ఎదుర్కొన్న దారుణ అనుభవం గురించి ఓ వ్యక్తి నెట్టింట పంచుకున్నాడు. ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల భారతీయ రైళ్లకు (Indian Railways) సంబంధించిన అంశాలు తరచూ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. రైళ్లల్లో రద్దీ కారణంగా తాము పడ్డ బాధల గురించి అనేక మంది నెట్టింట పంచుకుంటున్నారు. తాజాగా ఓ మహిళకు ఎదురైన అనుభవం ఆమె అన్నను కలిచివేసింది. తన గోడును నెట్టింట వెళ్లబోసుకున్న అతడు పరిస్థితులను చక్కదిద్దాలంటూ సోషల్ మీడియా వేదికగా ఏకంగా రైల్వే మంత్రినే అభ్యర్థించాడు. రచిత్ జైన్ అనే వ్యక్తి నెట్టింట పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.
Indian Railways: గూగుల్‌నే నమ్ముకుందేమో కానీ.. రైల్వేకు ఊహించని షాక్!
బిడ్డతో పాటు రైలు ఎక్కేందుకు వెళ్లిన తన చెల్లికి దారుణ అనుభవం ఎదురైందని రచిత్ జైన్ వాపోయాడు. ఆమె ఏసీ 3 టైర్ టిక్కెట్టు కొనుక్కుందని అన్నాడు. తీరా రైలు వచ్చేసరికే తలుపుల వద్ద బోలెడంత రద్దీ కనిపించిందని చెప్పాడు. రద్దీ కారణంగా తన చెల్లికి ఊహించని విపత్తు వచ్చిందన్నాడు. ఆమె రైల్లో ఎక్కినా బిడ్డ మాత్రం ప్లాట్‌ఫాంపైనే ఉండిపోయాడని, దీంతో తన చెల్లె కంగారులో కదులుతున్న రైల్లోంచి కిందకు దూకేసిందని తెలిపాడు. ఈ క్రమంలో కింద పడ్డ ఆమెకు స్వల్ప గాయాలయ్యాయని కూడా చెప్పాడు. తన చెల్లి టిక్కెట్ నంబర్, ట్రెయిన్ పీఎన్ఆర్ నెంబర్ వంటివన్నీ నెట్టింట పంచుకున్న అతడు పరిస్థితులను చక్కదిద్దాలంటూ రైల్వే శాఖకు, మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు విజ్ఞప్తి చేశాడు (Man Shares Post About Dire Condition Of AC 3 Tier Coaches).
Viral: ప్యాంటు వేసుకోకపోతే బ్యాంకులోకి రానివ్వరా? కోపంతో ఊగిపోయిన కస్టమర్! జరిగిందేంటంటే..
టిక్కెట్టు లేని వారు, వెయిటింగ్ లిస్టులో ఉన్న వారు రిజర్వేషన్ కోచుల్లో ప్రయాణిస్తున్న కారణంగా టిక్కెట్లు ఉన్న వారు ఇబ్బందులు పడుతున్నారని రచిత్ జెయిన్ తెలిపారు. ప్రమాదాల అవకాశాలు కూడా పెరుగుతున్నాయని వాపోయాడు. ఈ పోస్టుపై నెట్టింట భారీ స్పందన వచ్చింది. రిజర్వేషన్ కోచ్‌ల్లో అనేక మంది వెయిటింగ్ లిస్టులోని వారు కూడా ప్రయాణిస్తున్నారంటూ కొందరు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి తెలిసినా రైల్వే శాఖ తగు చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. గత ఐదేళ్లల్లో రైలు సేవలు దిగదుడుపుగా మారాయని కొందరు ఆరోపించారు. ఘటనపై స్పందించిన రైల్వే సేవ..ప్రయాణికురాలికి వైద్య సేవలు కావాలేమో చెప్పండంటూ మెసేజ్ పెట్టింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి