Viral: ఇతడు పైలట్టేనా? లారీ క్లీనరా? విమానం కిటికీలోంచి బయటకొచ్చి..
ABN , Publish Date - Sep 03 , 2024 | 12:29 PM
ఓ పాకిస్థానీ పైలట్ విమానం కిటికీలోంచి బయటకు వచ్చి అద్దాలను శుభ్రపరిచిన ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జనాలు షాకైపోయేలా చేస్తోంది. అయితే, ఇది సాధారణ విషయమేనని కొందరు అన్నారు. పైలట్లు ఇలా తరచూ చేస్తుంటారని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: లారీ క్లీనర్లు, బస్ కండక్టర్లు.. తమ వాహనాల కిటికీల్లోంచి బయటకు తొంగి చూస్తూ వెహికిల్ అద్దాలను క్లీన్ చేయడం చూస్తూనే ఉంటాం. ఇదేమంత పెద్ద విషయం కాదు. అయితే, విమానం పైలట్ ఇలా చేస్తే మాత్రం కచ్చితంగా ఆశ్చర్యపోవాల్సిందే. పాకిస్థాన్‌లో సరిగ్గా ఇలాంటి ఉదంతమే వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, అది పాకిస్థాన్ - జెడ్డాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ఎయిర్‌బస్ ఏ330-200 విమానం. విమానం బయలుదేరే ముందు కిటికీలోంచి తలబయటపెట్టిన ఆ పైలట్ విమానం ముందు అద్దాన్ని బాగా తుడిచారు. దాదాపు రెండు అంతస్తుల ఎత్తున్న విమానం కిటికీలోంచి ఇలా ప్రమాదకరంగా బయటకు రావడాన్ని ఎయిర్‌పోర్టులోని వారు చూసి ఆశ్చర్యపోయారు. విమానం అద్దాలను ఇలా ఎవరైనా శుభ్రం చేస్తారా అంటూ ప్రశ్నించారు. లారీ క్లీనర్లు, బస్సు కండక్టర్లలా విమానాన్ని శుభ్రం చేయడం ఏమిటని ప్రశ్నించారు (Viral Video Shows Pilot Cleaning The Windscreen ).
Viral: వామ్మో! రోజుకు అరగంటే నిద్రపోతున్న వ్యక్తి! 12 ఏళ్లుగా ఇదే తీరు!
ఇక వీడియో వైరల్ కావడంతో జనాల నుంచి కూడా దాదాపు ఇలాంటి స్పందనే వచ్చింది. ఇలాంటి సీన్స్ పాకిస్థాన్‌లో మాత్రమే కనిపిస్తాయని కొందరు వ్యాఖ్యానించారు. విమానాన్ని శుభ్రపరిచేందుకు ఇతర సిబ్బంది ఉండరా అని కొందరు ప్రశ్నించారు. భద్రత ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని కొందరు అభిప్రాయపడ్డారు. వీడియోలోని దృశ్యాలకు పడీపడీ నవ్వుకున్నారు. అయితే, పైలట్‌లు ఇలా చేయడం సాధారణమని కొందరు చెప్పుకొచ్చారు. అద్దం శుభ్రంగా లేదని భావిస్తే పైలట్లు ఇలాగే క్లీన్ చేస్తారని అన్నారు. ఇలాంటి దృశ్యాలు చాలా చూశామని తెలిపారు.
ఇదిలా ఉంటే, పాకిస్థాన్ ఇటీవల కాలంలో ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. రాజకీయ అస్థిరత, 2022 నాటి భయంకర వరదలు, దశాబ్దాలుగా దేశ ఆర్థిక రంగ నిర్వహణలో లోపాలు వెరసి పాకిస్థాన్ ఆర్థికంగా పతనం అంచులకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కూడా పరిస్థితిని మరింత దిగజార్చింది. అయితే, అంతర్జాతీయ ద్రవ్యనిధితో పాటు పలు మిత్రదేశాలు అండగా నిలవడంతో పాకిస్థాన్ పతనం నుంచి బయటపడింది. అయితే, అధిక ద్రవ్యోల్బణం, అప్పులు వెరసి ప్రజల నడ్డి విరుస్తున్నాయి.