Share News

చెన్నైపై పంజా

ABN , Publish Date - May 02 , 2024 | 03:39 AM

ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌.. చెపాక్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెక్‌ పెట్టింది. రిలీ రొసో (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), బెయిర్‌స్టో (30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 46) బ్యాట్‌తో రాణించగా...

చెన్నైపై పంజా

నేటి మ్యాచ్‌

హైదరాబాద్‌ X రాజస్థాన్‌, రాత్రి 7.30 గం.

వేదిక: హైదరాబాద్‌

  • అదరగొట్టిన రొసో, బెయిర్‌స్టో

  • తిప్పేసిన బ్రార్‌, చాహర్‌

  • 7 వికెట్లతో పంజాబ్‌ గెలుపు

చెన్నై: ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పంజాబ్‌ కింగ్స్‌.. చెపాక్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు చెక్‌ పెట్టింది. రిలీ రొసో (23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), బెయిర్‌స్టో (30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 46) బ్యాట్‌తో రాణించగా.. స్పిన్నర్లు హర్‌ప్రీత్‌ బ్రార్‌ (2/17), రాహుల్‌ చాహర్‌ (2/16) ఒక్క బౌండ్రీ కూడా ఇవ్వకుండా కట్టడి చేయడంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ 7 వికెట్ల తేడాతో చెన్నైను ఓడించింది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 162/7 స్కోరు చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (62), రహానె (29) పోరాటం వృథా అయింది. మిచెల్‌ (1 నాటౌట్‌) స్థానంలో వన్‌డౌన్‌లో శివమ్‌ దూబేను బరిలోకి దించిన వ్యూహం బెడిసికొట్టగా.. ధోనీ (14) ఈ సీజన్‌లో తొలిసారి అవుటయ్యాడు. ఛేదనలో పంజాబ్‌ 17.5 ఓవర్లలో 163/3 స్కోరు చేసి నెగ్గింది. కర్రాన్‌ (26 నాటౌట్‌), శశాంక్‌ సింగ్‌ (25 నాటౌట్‌) రాణించారు. కేవలం 2 బంతులే బౌల్‌ చేసిన దీపక్‌ చాహర్‌ నొప్పితో మైదానం వీడడం కూడా చెన్నైను బలహీన పరిచింది. బ్రార్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ లభించింది.


ఒత్తిడి లేకుండా..: బెయిర్‌స్టో, రొసో దూకుడైన బ్యాటింగ్‌తో పంజాబ్‌ సునాయాసంగా గెలిచింది. ఛేదనలో తొలి ఓవర్‌లోనే 6,4 బాదిన ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (13) ఎక్కువసేపు క్రీజులో నిలవలేక పోయాడు. కానీ, మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో, రొసో అటాకింగ్‌ గేమ్‌తో.. పవర్‌ప్లేలో పంజాబ్‌ 52/1తో నిలిచింది. 7వ ఓవర్‌లో జడేజా బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు బాదిన బెయిర్‌స్టో.. అలీ వేసిన ఆ తర్వాతి ఓవర్‌లో 6,4తో బ్యాట్‌ ఝుళిపించాడు. స్పిన్నర్లు ప్రభావం చూపలేక పోవడంతో.. పేసర్‌ దూబేకు బంతిని అప్పగించడం ఫలితాన్నిచ్చింది. దూకుడుగా ఆడుతున్న బెయిర్‌స్టోను దూబే క్యాచవుట్‌ చేయడంతో.. రెండో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కానీ, రొసో.. శశాంక్‌ సహకారంతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. 12వ ఓవర్‌లో శార్దూల్‌ బౌలింగ్‌లో రొసో 6,4తో 14 పరుగులు రాబట్టినా.. అదే ఓవర్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఈ దశలో జాగ్రత్తగా ఆడిన శశాంక్‌, కెప్టెన్‌ కర్రాన్‌.. నాలుగో వికెట్‌కు అజేయంగా 50 పరుగులు జోడించడంతో పంజాబ్‌ మరో 13 బంతులు మిగిలుండగానే గెలుపు గీత దాటింది.

ఆదుకొన్న రుతురాజ్‌: పంజాబ్‌ స్పిన్నర్లు హర్‌ప్రీత్‌, చాహర్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా.. కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ అర్ధ శతకంతో చెన్నై పోరాడగలిగే స్కోరు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు ఓపెనర్లు రహానె, రుతురాజ్‌ తొలి వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యంతో నిలకడైన ఆరంభాన్నిచ్చారు. అర్ష్‌దీప్‌ తొలి రెండు ఓవర్లలో గైక్వాడ్‌ నాలుగు బౌండ్రీలు బాదగా.. కర్రాన్‌ బౌలింగ్‌లో రహానె హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగాడు. దీంతో పవర్‌ప్లేను చెన్నై 55/0తో మెరుగ్గా ముగించింది. అయితే, మధ్య ఓవర్లలో స్పిన్‌ మాయాజాలానికి చెన్నై విలవిల్లాడింది. 8వ ఓవర్‌లో రహానెతోపాటు శివమ్‌ దూబే (0)ను అవుట్‌ చేసిన బ్రార్‌ ప్రత్యర్థికి షాకిచ్చాడు. జడేజా (2)ను చాహర్‌ ఎల్బీగా వెనక్కి పంపాడు. కేవలం 6 పరుగుల తేడాతో 3 కీలక వికెట్లు కోల్పోయిన సీఎస్‌కే 70/3తో కష్టాల్లో పడింది. ఈ దశలో రిజ్వీ (21), గైక్వాడ్‌ నాలుగో వికెట్‌కు 37 పరుగుల పార్ట్‌నర్‌షి్‌పతో జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. క్రీజులో ఉన్నంతసేపు తడబడిన రిజ్వీని రబాడ వెనక్కి పంపాడు. దాదాపు 11 ఓవర్లపాటు ఒక్క బౌండ్రీ కూడా కొట్టని రుతురాజ్‌.. 17వ ఓవర్‌లో కర్రాన్‌ బౌలింగ్‌లో 4,6తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. మొయిన్‌ అలీ (15)తో కలసి 5వ వికెట్‌కు 38 పరుగులు జోడించిన గైక్వాడ్‌ను అర్ష్‌దీప్‌ బౌల్డ్‌ చేశాడు. అలీని చాహర్‌ వెనక్కిపంపినా.. ఆఖరి ఓవర్‌లో ధోనీ 4,6తో టీమ్‌ స్కోరును 160 మార్క్‌ దాటించాడు. అయితే, చివరి బంతికి రన్‌ తీసే క్రమంలో మహీ అవుటయ్యాడు.


స్కోరుబోర్డు

చెన్నై: రహానె (సి) రొసో (బి) హర్‌ప్రీత్‌ 29, రుతురాజ్‌ (బి) అర్ష్‌దీప్‌ 62, శివమ్‌ దూబే (ఎల్బీ) హర్‌ప్రీత్‌ 0, జడేజా (ఎల్బీ) రాహుల్‌ చాహర్‌ 2, సమీర్‌ రిజ్వీ (సి) హర్షల్‌ (బి) రబాడ 21, మొయిన్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 15, ధోనీ (రనౌట్‌) 14, మిచెల్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: 20 ఓవర్లలో 162/7;

వికెట్లపతనం: 1-64, 2-65, 3-70, 4-107, 5-145, 6-147, 7-162; బౌలింగ్‌: రబాడ 4-0-23-1, అర్ష్‌దీప్‌ 4-0-52-1, కర్రాన్‌ 3-0-37-0, హర్‌పీత్ర్‌ బ్రార్‌ 4-0-17-2, రాహుల్‌ చాహర్‌ 4-0-16-2, హర్షల్‌ పటేల్‌ 1-0-12-0.

పంజాబ్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) రుతురాజ్‌ (బి) గ్లీసన్‌ 13, బెయిర్‌ స్టో (సి) ధోనీ (బి) దూబే 46, రొసో (బి) శార్దూల్‌ 43, శశాంక్‌ (నాటౌట్‌) 25, కర్రాన్‌ (నాటౌట్‌) 26, ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 17.5 ఓవర్లలో 163/3; వికెట్లపతనం: 1-19, 2-83, 3-113; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 0.2-0-4-0, శార్దూల్‌ 3.4-0-48-1, గ్లీసన్‌ 3.5-0-30-1, ముస్తాఫిజుర్‌ 4-1-22-0, జడేజా 3-0-22-0, మొయిన్‌ 2-0-22-0, శివమ్‌ దూబే 1-0-14-1.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

రాజస్థాన్‌ 9 8 1 0 16 0.694

కోల్‌కతా 9 6 3 0 12 1.096

లఖ్‌నవూ 10 6 4 0 12 0.094

చెన్నై 10 5 5 0 10 0.627

హైదరాబాద్‌ 9 5 4 0 10 0.075

ఢిల్లీ 11 5 6 0 10 -0.442

పంజాబ్‌ 10 4 6 0 8 -0.062

గుజరాత్‌ 10 4 6 0 8 -1.113

ముంబై 10 3 7 0 6 -0.272

బెంగళూరు 10 3 7 0 6 -0.415

గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;

ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్‌ రన్‌రేట్‌

5

చెన్నైతో గత

ఐదు మ్యాచ్‌ల ముఖాముఖిలో 5-0తో పంజాబ్‌దే పైచేయి.

Updated Date - May 02 , 2024 | 03:39 AM