Abhishek Sharma: పాపం అభిషేక్.. కెప్టెన్ దెబ్బకు చెత్త రికార్డ్.. కోహ్లీ తర్వాత అతడే!
ABN , Publish Date - Jul 11 , 2024 | 02:35 PM
భారత విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ జింబాబ్వేతో జరుగుతున్న టీ20I సిరీస్‌లో మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో..
భారత విధ్వంసకర ఆటగాడు అభిషేక్ శర్మ (Abhishek Sharma) జింబాబ్వేతో జరుగుతున్న టీ20I సిరీస్‌లో మరో చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో డకౌట్ అయిన నాలుగో భారతీయ ఆటగాడిగా అతను చెత్త రికార్డును నెలకొల్పాడు. ఇప్పుడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) చేసిన పనికి.. అతని ఖాతాలో మరో చెత్త ఫీట్ చేరింది. అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ చేసిన వెంటనే ఓపెనింగ్ స్థానం నుంచి వన్ డౌన్‌కి (మూడో స్థానం) డిమోట్ అయిన రెండో భారత ప్లేయర్‌గా నిలిచాడు.
జింబాబ్వే సిరీస్‌లో భాగంగా.. తొలి మ్యాచ్‌లో అభిషేక్ డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. అయితే.. రెండో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను తన విశ్వరూపం చూపించాడు. గ్రౌండ్లో అడుగుపెట్టినప్పటి నుంచే బౌండరీల మోత మోగించేశాడు. ఎడాపెడా షాట్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా.. 46 బంతుల్లోనే అతను శతకం (100) నమోదు చేశాడు. ఇంత అద్భుతంగా రాణించాడు కాబట్టి, మూడో మ్యాచ్‌లోనూ ఓపెనర్‌గా దిగి.. మరోసారి ఊచకోత కోస్తాడని అంతా భావించారు. కానీ.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అందరి ఫ్యూజులు ఎగిరిపోయేలా ఓ నిర్ణయం తీసుకున్నాడు. జట్టులోకి యశస్వీ జైస్వాల్ రావడంతో.. అతడ్ని ఓపెనర్‌గా దింపి, అభిషేక్‌ను మూడో స్థానానికి డిమోట్ చేశాడు.
గతంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2022లో జరిగిన ఆసియా కప్‌లో భాగంగా.. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ ఓపెనర్‌గా దిగాడు. ఆ మ్యాచ్‌లో అతను 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ.. తదుపరి మ్యాచ్‌లో అనూహ్యంగా అతను మూడో స్థానానికి డిమోట్ అయ్యాడు. అందులో అతను కేవలం రెండు పరుగులే చేసి ఔట్ అయ్యాడు. కోహ్లీ తరహాలోనే ఇప్పుడు అభిషేక్ డిమోట్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై విమర్శలు వస్తున్నాయి. సెంచరీ చేసిన అభిషేక్‌ని కాకుండా.. సరిగ్గా రాణించని తాను ఓపెనర్‌గా దిగడమేంటంటూ గిల్‌ని ట్రోల్ చేస్తున్నారు. సెల్ఫిష్ కెప్టెన్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Latest Sports News and Telugu News