Share News

IND vs ENG: స్పిరిట్ ఆఫ్ క్రికెట్.. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

ABN , Publish Date - Jan 30 , 2024 | 01:52 PM

ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తీరుపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వికెట్ల వెనకాల ఫోక్స్ క్రికెట్‌ స్పిరిట్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించాడని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

IND vs ENG: స్పిరిట్ ఆఫ్ క్రికెట్.. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌పై నెటిజన్ల ఆగ్రహం

హైదరాబాద్: ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ తీరుపై అంతటా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వికెట్ల వెనకాల ఫోక్స్ క్రికెట్‌ స్పిరిట్‌కు వ్యతిరేకంగా ప్రవర్తించాడని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ 66వ ఓవర్లో టేలెండర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ బ్యాటింగ్ చేస్తున్నారు. 66వ ఓవర్‌ను ఇంగ్లండ్ స్పిన్నర్ హార్ట్‌లీ వేయగా బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే ఆ ఓవర్‌లో ఓ బంతి బుమ్రా బ్యాటుకు టచ్ అవలేదు. దీంతో అది వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ చేతిలో వెళ్లి పడింది. అయితే బుమ్రా క్రీజును వదలలేదు. క్రీజు లోపలే ఉన్నాడు. కానీ బంతిని కొట్టలేకపోయాననే నిరాశతో క్రీజులోనే కాస్త గాల్లోకి ఎగిరాడు. దీనిని గమనించిన ఫోక్స్.. బుమ్రా గాల్లోకి ఎగిరిన సమయంలో స్టంప్స్‌ను కొట్టాడు. అంపైర్‌కు అప్పీల్ చేశాడు. కానీ థర్డ్ అంపైర్ రివ్యూలో బుమ్రా నాటౌట్‌గా తేలింది. అసలు బుమ్రా క్రీజునే వదలలేదు.


దీంతో బుమ్రా క్రీజులోనే ఉన్నప్పటికీ ఫోక్స్ కావాలని స్టంప్స్‌ను కొట్టి అప్పీల్ చేశాడని నెటిజన్లు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్ వికెట్ కీపర్ బెన్ ఫోక్స్‌కు క్రికెట్ స్పిరిట్ లేదని పలువురు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో స్పిరిట్ ఆఫ్ క్రికెట్ వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో 2023 యాషెస్ సిరీస్‌లో జరిగిన ఘటనను పలువురు ప్రస్తావిస్తున్నారు. ఆ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టోను ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కూడా ఇలానే స్టంపింగ్ చేశాడు. దీంతో ఈ రెండు వివాదాలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కాగా ఉప్పల్ వేదికగా జరిగిన ఈ తొలి టెస్ట్ మ్యాచ్‌లో 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 2 నుంచి రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 01:54 PM