Team India: టీ20 ప్రపంచకప్‌లో రింకూ సింగ్ ఉంటాడా?
ABN , Publish Date - Jan 09 , 2024 | 04:09 PM
Team India: టీ20 ప్రపంచకప్ కోసం సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వస్తే ప్రస్తుత జట్టులో నిలకడగా రాణిస్తున్న రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్ల పరిస్థితేంటని పలువురు అభిమానులు చర్చించుకుంటున్నారు.
ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగబోతుంది. ఈ మెగా టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్ ఆడతారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. వన్డే ప్రపంచకప్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఐపీఎల్‌లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు అతడు తీవ్రంగా కష్టపడుతున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే పాండ్య తిరిగి జట్టులోకి వస్తే ప్రస్తుతం టీ20 జట్టులో అంచనాలకు మించి రాణిస్తున్న రింకూ సింగ్ పరిస్థితి ఏంటన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. స్వదేశంలో ఆస్ట్రేలియాపై, దక్షిణాఫ్రికా గడ్డపై రింకూ సింగ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. కానీ సీనియర్లు తిరిగివస్తే అతడికి జట్టులో చోటు ఉంటుందన్న గ్యారంటీ లేదు.
మరోవైపు ఆప్ఘనిస్తాన్‌తో మూడు టీ20ల సిరీస్‌కు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లకు సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. వీళ్లకు రెస్ట్ ఇచ్చారా.. లేదా పక్కనపెట్టారా అన్న విషయంపై స్పష్టత లేకపోయినా టీ20 ప్రపంచకప్‌కు వీళ్లు జట్టులో ఉంటే మాత్రం రింకూ సింగ్, తిలక్ వర్మ వంటి ఆటగాళ్లు చోటు కోల్పోయే అవకాశం ఉంటుందని మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. రోహిత్, కోహ్లీలను మళ్లీ టీ20లకు ఎంపిక చేయడంతో తాను ఆశ్చర్యపోయానని.. గత టీ20 ప్రపంచకప్‌లో సీనియర్ ఆటగాళ్లకు చోటు కల్పించడంపై విమర్శలు వచ్చిన సంగతిని అతడు గుర్తుచేశాడు. అయితే ప్రస్తుతం సీనియర్ ఆటగాళ్లను ఎంపిక చేయడం మంచిదేనని.. వాళ్ల అనుభవం జట్టుకు పనికొస్తుందని దీప్ దాస్ గుప్తా అన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.