Share News

Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. క్రిస్ గేల్ తర్వాత..

ABN , Publish Date - Jan 21 , 2024 | 11:37 AM

పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగుల ల్యాండ్ మార్కును చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Shoaib Malik: చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్.. క్రిస్ గేల్ తర్వాత..

ఢాకా: పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చరిత్ర సృష్టించాడు. అన్ని రకాల టీ20 క్రికెట్‌లో 13 వేల పరుగుల ల్యాండ్ మార్కును చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా టీ20 క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్ మొదటి స్థానంలో ఉన్నాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో శనివారం షోయబ్ మాలిక్ ఈ రికార్డు అందుకున్నాడు. ఈ లీగ్‌లో రంగ్‌పూర్ రైడర్స్‌కు ప్రాతినిధ్యం వహించిన షోయబ్ ఫార్చ్యూన్ బరిషల్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా 13 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఫార్చ్యూన్ బరిషల్ జట్టు 137 పరుగులు చేసింది. 138 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన షోయబ్ మాలిక్ జట్టు 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షోయబ్ మాలిక్ 18 బంతుల్లో 17 పరుగులు చేశాడు. 7 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద 13 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.


కాగా 487 టీ20 ఇన్నింగ్స్‌ల్లో షోయబ్ మాలిక్ ఈ రికార్డును అందుకున్నాడు. 41 ఏళ్ల షోయబ్ మాలిక్ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 124 మ్యాచ్‌లు ఆడాడు. 31 సగటుతో 2435 పరుగులు చేశాడు. ఇందులో 9 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్‌లో 28 వికెట్లు పడగొట్టాడు. కాగా 14,562 పరుగులు చేసిన క్రిస్ గేల్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. 12,454 పరుగులు చేసిన కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో, 11,994 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో, 11,807 పరుగులు చేసిన అలెక్స్ హేల్స్ ఐదో స్థానంలో ఉన్నాడు. కాగా ఇటీవల షోయబ్ మాలిక్ వివాహం చేసుకున్నాడు. పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను షోయబ్ వివాహమాడాడు. 41 ఏళ్ల షోయబ్ మాలిక్‌కు ఇది మూడో వివాహం. షోయబ్‌కు ఇది వరకే రెండు వివాహాలు అయ్యాయి. 2010లో ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను షోయబ్ రెండో వివాహం చేసుకున్నాడు. వీరి 14 ఏళ్ల వివాహ బంధానికి గాను ఓ కొడుకు కూడా ఉన్నాడు.

ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 21 , 2024 | 11:38 AM