Pakistan: ఆ ప్లేయర్లు జట్టులో ఉంటే.. పాకిస్తాన్ ఎప్పటికీ గెలవదు
ABN , Publish Date - Jun 12 , 2024 | 11:16 AM
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. అఫ్‌కోర్స్.. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ గెలుపొందిన మాట వాస్తవమే. కానీ..
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్‌కప్‌లో (T20 World Cup) పాకిస్తాన్ (Pakistan) జట్టు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. అఫ్‌కోర్స్.. కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ గెలుపొందిన మాట వాస్తవమే. కానీ.. అంతకుముందు యూఎస్ఏ, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లలో మాత్రం ఘోర పరాజయాల్ని చవిచూసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాక్ జట్టు సూపర్-8కు అర్హత సాధించడం దాదాపు కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే.. పాక్ మాజీలు తమ జట్టు ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తాజాగా పాక్ మాజీ చీఫ్ సెలెక్టర్ మహ్మద్ వసీం సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్‌లో కొందరు ప్లేయర్లు ఉన్నంతవరకూ.. ఆ జట్టు ఎప్పటికీ గెలవదని కుండబద్దలు కొట్టారు.
Read Also: 5.4 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్.. ఊచకోత కోశారుగా!
‘‘పాకిస్తాన్ జట్టులో కొందరు ప్లేయర్లు ఉన్నారు. ఆ ఆటగాళ్ల పేర్లను నేను ప్రస్తావించను కానీ.. వాళ్లు పాక్ జట్టుని క్యాన్సర్‌లా పట్టిపీడిస్తున్నారు. ఇది నేనే కాదు.. నలుగురు కోచ్‌ల బృందంలోనూ ఆ ప్లేయర్ల పట్ల ఇదే అభిప్రాయం ఉంది. ఆ ఆటగాళ్లు జట్టులో ఉన్నంతవరకూ.. పాక్ విజయం సాధించడం కష్టమే. గతంలో నేను చీఫ్ సెలెక్టర్‌గా ఉన్నప్పుడు.. వాళ్లను జట్టు నుంచి తప్పించేందుకు చాలా ప్రయత్నించా. కానీ.. మేనేజ్‌మెంట్ మాత్రం వారిని తిరిగి జట్టులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది’’ అంటూ మహ్మద్ వసీం చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పాక్ క్రికెట్ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ.. ఆయన చెప్పినట్లు క్యాన్సర్‌లా జట్టుని పీడిస్తున్న ఆ ఆటగాళ్లు ఎవరు? అని చర్చించుకుంటున్నారు.
Read Also: ప్రేమపెళ్లిలో షాకిచ్చిన మహిళ.. నాన్న కోసం వెళ్లి మాయం!
ఇదిలావుండగా.. ఈ టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో.. సూపర్-8కు చేరే అవకాశం క్లిష్టతరంగా మారింది. ఇప్పటికే కెనడాతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందిన పాక్.. సూపర్-8లోకి చేరాలంటే ఐర్లాండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌లోనూ తప్పక గెలవాలి. అలాగే.. యూఎస్ఏ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవాలి. ఒక్క మ్యాచ్‌లో అమెరికా గెలిచినా.. పాకిస్తాన్ ఇంటిదారి పట్టినట్టే! ఒకవేళ రెండు మ్యాచ్‌లు గెలిచినా.. పాయింట్లు సమానం అవుతాయి కాబట్టి నెట్ రన్‌రేట్ కీలకం అవుతుంది. మరి.. పాక్ ఫేట్ ఎలా ఉందో వేచి చూడాల్సిందే.
Read Latest Sports News and Telugu News