David Miller: మ్యాచ్‌ల కోసం పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.. మూడు మ్యాచ్‌లు ఆడి రూ.1.25 కోట్లు సంపాదించాడు..
ABN , Publish Date - Mar 13 , 2024 | 08:31 PM
దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ ఐపీఎల్‌తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ కూడా ఆడుతున్నాడు. ఆ లీగ్‌లో ఫార్చూన్ బరిషల్ టీమ్.. డేవిడ్ మిల్లర్‌కు ఇటీవల కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చిందట.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టీ-20 లీగ్‌లకు మంచి ఆదరణ కనబడుతోంది. దీంతో ఐపీఎల్ (IPL) లాంటి ఎన్నో టీ-20 లీగ్‌లను పలు దేశాలు నిర్వహించుకుంటున్నాయి. ఈ లీగ్‌ల కారణంగా హార్డ్ హిట్టర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) ఐపీఎల్‌తో పాటు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (Bangladesh Premier League) కూడా ఆడుతున్నాడు. ఆ లీగ్‌లో ఫార్చూన్ బరిషల్ టీమ్.. డేవిడ్ మిల్లర్‌కు ఇటీవల కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చిందట.
తమ జట్టు తరఫున మూడు మ్యాచ్‌లు ఆడితే ఏకంగా రూ.1.25 కోట్లు చెల్లిస్తామని డేవిడ్ మిల్లర్‌కు ఫార్చూన్ బరిషల్ టీమ్ బంపరాఫర్ ఇచ్చింది. దీంతో ఫిబ్రవరిలో జరగాల్సిన పెళ్లిని మిల్లర్ వాయిదా వేసుకున్నాడు. బీపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడాడు. దీంతో ఈ సీజన్‌లో ఫార్చూన్ బరిషల్ టీమ్ ఛాంపియన్‌గా నిలిచింది. చివరకు మార్చి 10వ తేదీన మిల్లర్ తన ప్రేయసి కామిల్లా హారిస్‌ను వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని వసీం అక్రమ్ (Wasim Akram)వెల్లడించాడు.
``బీపీఎల్ విజేత ఎవరో తెలుసుకునే క్రమంలో నాకు ఓ విషయం తెలిసింది. లీగ్‌లో చివరి మూడు మ్యాచ్‌లు ఆడితే రూ.1.25 కోట్లు చెల్లించేందుకు ఫ్రాంచైజీ ముందుకొచ్చింది. దీంతో డేవిడ్ మిల్లర్ తన పెళ్లిని వాయిదా వేసుకున్నాడ``ని అక్రమ్ చెప్పాడు. పెళ్లిని వాయిదా వేసుకున్న మిల్లర్ ఫిబ్రవరి 26 (ఎలిమినేటర్), ఫిబ్రవరి 28 (క్వాలిఫయర్-2), మార్చి 1 (ఫైనల్) తేదీల్లో మ్యాచ్‌లు ఆడాడు.