Share News

నీరజ్‌కు ఎదురుందా?

ABN , Publish Date - Jul 20 , 2024 | 05:32 AM

పారిస్‌ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నా..అథ్లెటిక్స్‌కు ఉండే క్రేజే వేరు. గతంలో ఈ విభాగానికి సంబంధించి భారత్‌కు పెద్దగా చెప్పుకోవాల్సింది ఉండేది కాదు. కానీ టోక్యో విశ్వ క్రీడల జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా చారిత్రక స్వర్ణ పతకం కొల్లగొట్టడంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ దృష్టి ఒక్కసారిగా భారత్‌పై నిలిచింది.

నీరజ్‌కు ఎదురుందా?

పారిస్‌ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతున్నా..అథ్లెటిక్స్‌కు ఉండే క్రేజే వేరు. గతంలో ఈ విభాగానికి సంబంధించి భారత్‌కు పెద్దగా చెప్పుకోవాల్సింది ఉండేది కాదు. కానీ టోక్యో విశ్వ క్రీడల జావెలిన్‌ త్రోలో నీరజ్‌ చోప్రా చారిత్రక స్వర్ణ పతకం కొల్లగొట్టడంతో ప్రపంచ అథ్లెటిక్స్‌ దృష్టి ఒక్కసారిగా భారత్‌పై నిలిచింది. ఈ నేపథ్యంలో పారిస్‌ ఒలింపిక్స్‌ అథ్లెటిక్స్‌లో భారత్‌పై అంచనాలు పెరిగిపోయాయి. టోక్యో గేమ్స్‌ తర్వాత నీరజ్‌ చోప్రా మరింత అద్భుతంగా రాణిస్తుండడం, పురుషుల మూడు వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో అనివాష్‌ సబ్లే మెరుపులు మెరిపిస్తుండడంతో పారిస్‌ క్రీడల ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో పతకాల పరంగా భారత్‌ మెరుగవుతుందేమో చూడాలి. ఈసారి విశ్వ క్రీడల్లో అథ్లెటిక్స్‌ పోటీలు ఆగస్టు ఒకటిన ప్రారంభం కానున్నాయి. 29 మందితో కూడిన భారత అథ్లెటిక్స్‌ బృందం 16 అంశాల్లో అదృష్టాన్ని పరీక్షించుకొంటోంది.

షాట్‌పుట్‌

భారత షాట్‌పుట్‌కు పర్యాయపదంగా నిలిచే తజిందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ ఆసియా దిగ్గజంగానూ పేరు పొందాడు. అయితే తరచూ గాయాలతో ప్రపంచ స్థాయిలో అంతగా పేరు తెచ్చుకోలేకపోయాడు. ఫెడరేషన్‌ కప్‌లో 20.38 మీ. గుండు విసిరి సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శన చేసిన తూర్‌..ప్రపంచ స్థాయిలో సత్తా చాటేందుకు ‘పారి్‌స’ను మించిన వేదిక లేదు.

జావెలిన్‌ త్రో

పారిస్‌ క్రీడల్లో భారత్‌ కచ్చితంగా పసిడి పతకం గెలిచే ఈవెంట్‌ జావెలిన్‌ త్రో. టోక్యోలో టైటిల్‌ నెగ్గిన 26 ఏళ్ల నీరజ్‌ చోప్రా అనంతరం వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో రజత, స్వర్ణ పతకాలతో తన సంచలన ప్రదర్శనను కొనసాగించాడు. ‘90’ మీటర్ల లక్ష్యానికి గురి పెట్టిన నీరజ్‌..

పారిస్‌లో దానిని అందుకోవడంతోపాటు స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకోగలనన్న విశ్వాసంతో ఉన్నాడు. 28 ఏళ్ల కిషోర్‌ జెనా కూడా తలపడుతున్నాడు. మహిళల విభాగంలో అన్నూ రాణి బరిలో దిగుతోంది.

వీళ్లపైనా ఆశలు

వరల్డ్‌ ర్యాంకింగ్స్‌తో పారిస్‌ క్రీడలకు అర్హత సాధించిన ట్రిపుల్‌ జంపర్లు ప్రవీణ్‌ చిత్రవేల్‌ (17.12మీ), అబ్దుల్లా అబూబాకర్‌ (17మీ.) ఈ సీజన్‌లో 17 మీటర్ల మార్క్‌ను దాటారు. పారి్‌సలో ఈ ఇద్దరిలో ఎవరైనా ఫైనల్‌కు చేరితే వారి కెరీర్‌లో అది అత్యుత్తమ ప్రదర్శనే అవుతుంది. పురుషుల హైజంప్‌లో సర్వేష్‌ కుషారే, లాంగ్‌జంప్‌లో జస్విన్‌ అల్ర్డిన్‌, మహిళల 5వేల మీటర్ల పరుగులో పారుల్‌ చౌధురి, 400 మీ.లలో కిరణ్‌ పహల్‌, 100 మీ. హర్డిల్స్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ, 4గీ400మీ. పురుషులు, మహిళల రిలేలు, 20 కి.మీ. రేస్‌ వాక్‌లో ముగ్గురు పురుషులు, ఓ మహిళ, మిక్స్‌డ్‌ మారథాన్‌ రిలేలో ఇద్దరు భారత అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. 4గీ400మీ. రిలేలో తెలుగు అథ్లెట్‌ జ్యోతికశ్రీ దండి కూడా తలపడుతోంది.

3 వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌

ఈసారి విశ్వ క్రీడల్లో జావెలిన్‌ తర్వాత పురుషుల మూడు వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ ఆసక్తి రేపుతోంది. 29 ఏళ్ల అవినాశ్‌ సబ్లే ఈ విభాగంలో ఇటీవలే ఎనిమిది నిమిషాల 9.91 సెకన్ల టైమింగ్‌తో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఇది ఆసియాలో నాలుగో అత్యుత్తమ సమయం కావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌ హీట్స్‌లో నయా జాతీయ రికార్డుతో సబ్లే అంచనాలను పెంచినా..ఫైనల్‌కు చేరడంలో మాత్రం విఫలమయ్యాడు. 2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో కెన్యాకు చెందిన హెగిమొనీ మీట్‌ రికార్డును బద్దలుగొట్టిన అవినాశ్‌ రజత పతకం సాధించాడు. దరిమిలా పారి్‌సలో అతడిపై అంచనాలు పెరిగాయి. ఇక..మహిళల 3వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లో జాతీయ రికార్డు హోల్డర్‌ (9:15.31సె.) పారుల్‌ చౌధురి పారి్‌సలో తనదైన ముద్ర వేయాలంటే తన శక్తికి మించి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.


sportsdf.jpg

రోయింగ్‌ ఒకే ఒక్కడు

పారిస్‌ క్రీడలకు భారత్‌ నుంచి తొలి కోటా అందుకున్న ఆటగాడు బల్‌రాజ్‌ పన్వర్‌. హరియాణాకు చెందిన 25 ఏళ్ల ఈ ఆర్మీమ్యాన్‌.. ఈ ఒలింపిక్స్‌లో దేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక రోయింగ్‌ క్రీడాకారుడు. ఆసియా-ఓషియానియా ఒలింపిక్‌ క్వాలిఫికేషన్స్‌ ఈవెంట్‌లో మూడోస్థానంలో నిలిచిన పన్వర్‌ పురుషుల సింగిల్స్‌ స్కల్‌ ఈవెంట్‌లో పారిస్‌ బెర్త్‌ దక్కించుకున్నాడు. ఒలింపిక్స్‌ రోయింగ్‌లో భారత్‌ నుంచి గతంలో ఒక్కరు కూడా కనీసం సెమీస్‌ చేరలేకపోయారు. ఈసారి తాను సెమీస్‌ దాటగలనన్న ధీమాతో పన్వర్‌ సిద్ధమయ్యాడు.

ఈక్వెస్ట్రియన్‌ అనూష్‌

గుర్రంతో ఆటాడించే ఈక్వెస్ట్రియన్‌ క్రీడాంశంలో భారత్‌ నుంచి అర్హత సాధించింది ఒక్కడే. కోల్‌కతాకు చెందిన 24 ఏళ్ల అనూష్‌ అగర్వాల ఈక్వెస్ట్రియన్‌లో వ్యక్తిగత డ్రెసేజ్‌ ఈవెంట్‌లో పోటీపడుతున్నాడు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించి పారిస్‌ టిక్కెట్‌ బుక్‌ చేసుకున్నాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న అనూష్‌ ఇక్కడ మెరుగైన ప్రదర్శన ఇవ్వగలనన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు.

Updated Date - Jul 20 , 2024 | 05:34 AM