T20 World Cup Ireland vs India : వేటకు వేళాయె!
ABN , Publish Date - Jun 05 , 2024 | 05:19 AM
భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం తమ తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. 2007లో తొలి ప్రపంచకప్‌ను అందుకున్నాక భారత జట్టుకు ఈ మెగా టోర్నీ ఊరిస్తూనే ఉంది. కెప్టెన్ రోహిత్,
టీ20 ప్రపంచకప్‌లో తొలి పోరుకు భారత్ సై
నేడు ఐర్లాండ్‌తో ఢీ
రాత్రి 8 గం. నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
న్యూయార్క్: భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం తమ తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. 2007లో తొలి ప్రపంచకప్‌ను అందుకున్నాక భారత జట్టుకు ఈ మెగా టోర్నీ ఊరిస్తూనే ఉంది. కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీలాంటి అనుభవజ్ఞులు.. సూర్యకుమార్, పంత్, బుమ్రాలాంటి యువ ఆటగాళ్ల సహకారంతో ఈసారైనా కప్‌ను ఖాతాలో వేసుకోవాలనుకుంటోంది. ఇక తాజా టోర్నీలో చిన్న జట్లు అద్భుతంగా పోరాడుతున్న సమయం లో ఐర్లాండ్‌ను తక్కువగా అంచనా వేయడానికి లేదు. అలాగే ఈ జట్టుకు గతంలో పెద్ద జట్లకు షాకిచ్చిన అనుభవం కూడా ఉంది. ఆసీ్‌సలో జరిగిన చివరి వరల్డ్‌కప్‌లో ఈ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించింది. అలాగే ఇటీవల పాక్‌ను కూడా మట్టికరిపించింది. బల్బిర్నీ, స్టిర్లింగ్, వికెట్ కీపర్ టక్కర్‌లతో పాటు పేసర్ జోషువా లిటిల్ జట్టులో కీలక ఆటగాళ్లు. అటు స్థానిక నసౌ కౌంటీ క్రికెట్ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్ ఎలా స్పందిస్తుందనేది ఇరు జట్లకు సవాల్‌గా మారింది. ఐపీఎల్ మాదిరి ఇక్కడ బ్యాటర్లు చెలరేగుదామనుకుంటే బోర్లా పడక తప్పదు. మంగళవారం దక్షిణాఫ్రికా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఐర్లాండ్‌తో ఆడిన ఏడు టీ20ల్లోనూ భారత్ గెలిచింది.
ఓపెనింగ్ ఎవరో?: ఈ టోర్నీలో భారత్ ఓపెనర్లుగా ఎవరిని బరిలోకి దింపుతారనేది చర్చనీయాంశంగా మారింది. కోచ్ ద్రవిడ్ ఈ విషయమై స్పష్టత ఇవ్వకపోయినా.. రోహిత్‌కు జతగా కోహ్లీని ఆడించే అవకాశం ఉంది. అలా జరిగితే జైస్వాల్ బెంచీకే పరిమితమవుతాడు. ఐపీఎల్ ఫామ్‌ను విరాట్ ఇక్కడా కొనసాగిస్తే జట్టుకు లాభమే. వికెట్ కీపర్‌గా పంత్ ఆడడం ఖాయమే. సూర్యకుమార్‌తో పాటు శివమ్ దూబే, హార్దిక్ మిడిలార్డర్‌లో రానున్నారు. ఇక్కడి పిచ్ స్పిన్‌కు అనుకూలించనుండడంతో లెఫ్టామ్ స్పిన్నర్లు జడేజా, అక్షర్‌లతో పాటు కుల్దీ్‌పను సైతం ఆడించనున్నారు. అయితే బుమ్రాకు జతగా రెండో పేసర్‌గా సిరాజ్, అర్ష్‌దీ్‌పలలో ఎవరిని ఎంపిక చేయాలనే డైలమాలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. హార్దిక్ మూడో పేసర్‌గా సేవలందించనున్నాడు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, పంత్, సూర్యకుమార్, దూబే, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్.
ఐర్లాండ్: బల్బిర్నీ, స్టిర్లింగ్ (కెప్టెన్), టక్కర్, టెక్టర్, కాంఫర్, డాక్‌రెల్, డిలానీ, అడెయిర్, మెక్‌కార్తి, యంగ్, లిటిల్.
పిచ్, వాతావరణం: పిచ్ స్పందనపై అనిశ్చితి కొనసాగుతోంది. చివరి మ్యాచ్‌లో శ్రీలంక 77 పరుగులకు కుప్పకూలింది. అటు సఫారీలు కూడా ఇబ్బందిపడ్డారు. స్పిన్, పేస్‌కు కూడా అనుకూలించడం సానుకూలాంశం.