Share News

Olympic Games : ఆరంభ సంబరం పారిస్‌ పరవశం’

ABN , Publish Date - Jul 27 , 2024 | 06:29 AM

ప్రపంచ క్రీడాప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్‌ క్రీడలకు సరికొత్త రీతిలో పారిస్‌ తెర లేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య.. ‘గేమ్స్‌ వైడ్‌ ఓపెన్‌’ నినాదంతో ఆరు బయట సాగిన ఈ ఆరంభ వేడుకలు అందరికీ థ్రిల్‌ను పంచాయి. 205 దేశాల నుంచి 6,800 మంది

 Olympic Games : ఆరంభ సంబరం పారిస్‌ పరవశం’

సెన్‌ నదిలో అలరించిన వేడుకలు

ఘనంగా ఒలింపిక్స్‌ ఆరంభం

తిలకించిన ప్రేక్షకులు 3,20,000

బోట్ల సంఖ్య 85

పాల్గొన్న అథ్లెట్లు 6800

పరేడ్‌ దూరం 6 కి.మీ

స్టాండ్స్‌ల సంఖ్య 124

ఒలింపిక్‌ గేమ్స్‌కు వందేళ్ల తర్వాత పారిస్‌ వినూత్న రీతిలో స్వాగతం పలికింది. ఆరంభ వేడుకలను స్టేడియంలో కాకుండా చరిత్రలో తొలిసారి బయట.. అదీ ఓ నదీ ప్రవాహంలో నిర్వహించి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఓవైపు పారిస్‌ మధ్యలోని సెన్‌ నదిలో ఆయా దేశాల అథ్లెట్లంతా పడవల్లో పరేడ్‌ నిర్వహించగా.. మరోవైపు ఒడ్డున వందలాది కళాకారులు తమ నృత్య రీతులతో ఆకట్టుకున్నారు. అలాగే తమ సంస్కృతీ సంప్రదాయాలను, చరిత్రను సైతం ఆహుతుల ముందుంచారు. ఓవరాల్‌గా చిరుజల్లులలో తడుస్తూనే సాగిన ఈ వేడుకలతో పారిస్‌ ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌గా మారిందనడంలో సందేహం లేదు..

పారిస్‌: ప్రపంచ క్రీడాప్రేమికులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్‌ క్రీడలకు సరికొత్త రీతిలో పారిస్‌ తెర లేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య.. ‘గేమ్స్‌ వైడ్‌ ఓపెన్‌’ నినాదంతో ఆరు బయట సాగిన ఈ ఆరంభ వేడుకలు అందరికీ థ్రిల్‌ను పంచాయి. 205 దేశాల నుంచి 6,800 మంది అథ్లెట్లు ఈఫిల్‌ టవర్‌ వరకు ఆరు కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఇప్పటివరకు ఒలింపిక్‌ చరిత్రలో స్టేడియంలో కాకుండా బయట ఆరంభ వేడుకలను నిర్వహించడం ఇదే తొలిసారి. నది మధ్యలో ఉన్న చిన్న బ్రిడ్జిలపై ఏర్పాటు చేసిన స్టాండ్స్‌నుంచే కాకుండా పక్కన ఒడ్డున నుంచి మొత్తంగా 3,20,000 మంది ప్రత్యక్షంగా తిలకించారు. ఈ పరేడ్‌ రూట్‌లో నిర్వాహకులు 71 భారీ స్ర్కీన్లను, వెయ్యి లౌడ్‌స్పీకర్లను ఏర్పాటు చేశారు.

గ్రీస్‌ రాకతో ఆరంభం: భారత కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు వేడుకలు ఆరంభమయ్యాయి. ముందుగా ఒలింపిక్‌ జన్మస్థానమైన గ్రీస్‌ జట్టు ఆటగాళ్లు బోటుపై రాకతో వేడుకలకు తెర లేచింది. ఆ తర్వాత 37 మందితో కూడిన శరణార్థుల జట్టు అనంతరం అల్ఫాబెట్స్‌ ప్రకారం అఫ్ఘానిస్థాన్‌తో ఆయా దేశాల జట్ల రాక ఆరంభమైంది. వీటి మధ్యలోనే నది ఒడ్డున ఏర్పాటు చేసిన వేదికపై అమెరికన్‌ సింగర్‌ లేడీ గాగా ఫ్రెంచ్‌ క్యాబరెట్‌ నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. అటు ఆయా దేశాల అథ్లెట్లు బోట్లపై రావడం.. ఆ వెంటనే కాస్త విరామమిచ్చి అక్కడక్కడా ఏర్పాటు చేసిన వేదికలపై కళాకారులు తమ ప్రదర్శనతో ఆహుతులను ఆకట్టుకోవడం జరిగింది. చివరగా ఆతిథ్య జట్టు ఫ్రాన్స్‌ ఆటగాళ్లు వచ్చారు.

indian-big-size.jpg

భారత్‌ నుంచి 78 మంది...

భారత్‌ నుంచి ప్రారంభోత్సవ కార్యక్రమంలో 78 మంది అథ్లెట్లు, సిబ్బంది పాల్గొన్నారు. వరుస క్రమంలో 84వ దేశంగా పరేడ్‌లో పాల్గొన్న మన దేశం తరఫున ఫ్లాగ్‌ బేరర్‌గా పీవీ సింధు, ఆచంట శరత్‌ కమల్‌ వ్యవహరించారు. ఇక వీరితో పాటు 11 క్రీడాంశాలకు చెందిన దీపికా కుమారి, లవ్లీనా, రోహన్‌ బోపన్న, నగాల్‌, మనికా బాత్రా తదిరులు పరేడ్‌లో కనిపించారు. అయితే శనివారమే పోటీలున్న ఇతర విభాగాల అథ్లెట్లు కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. హాకీ జట్టు నుంచి ముగ్గురు రిజర్వ్‌ ఆటగాళ్లు మాత్రం వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌, రెజ్లింగ్‌ జట్లు ఇంకా పారి్‌సకు చేరుకోలేదు. మరోవైపు భారత పురుష అథ్లెట్లు కుర్తా బుందీ, మహిళలు చీరలు ధరించగా వీటిని త్రివర్ణ పతాక రంగులతో రూపొంంచారు.

మనోళ్ల పతక వేట షురూ

కోట్లాది భారతీయుల ఆశలను మోస్తూ.. ప్రఖ్యాత ఒలింపిక్స్‌ బరిలో నిలిచిన భారత అథ్లెట్లు నేటి నుంచి తమ పతకాల వేటను ఆరంభించనున్నారు. మొత్తంగా కనీసం పది పతకాలైనా సాధించాలనే పట్టుదలతో ఉన్న వేళ.. తొలి రోజున బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, హాకీ, బాక్సింగ్‌ ఇలా పలు కీలక క్రీడాంశాల్లో పోటీలు జరుగబోతున్నాయి. గట్టిగా పట్టుబడితే వీటిలో మెడల్స్‌ను అందించగల స్టార్లకు కొదువలేదు. వీరిలో పీవీ సింధు, సాత్విక్‌-చిరాగ్‌, నిఖత్‌ జరీన్‌, లవ్లీనా, మను బాకర్‌, హాకీ జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి..

‘హ్యాట్రిక్‌’ లక్ష్యంగా సింధు

భారత్‌కు కచ్చితంగా పతకం దక్కే అవకాశం ఉన్న క్రీడ బ్యాడ్మింటన్‌. ఇప్పటికే 2012 నుంచి వరుసగా మూడు ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు దక్కాయి. ఇప్పుడు భారత్‌ నుంచి ఏడుగురు షట్లర్లు, నాలుగు విభాగాల్లో బరిలోకి దిగుతున్నారు. ఇందులో సింధు హ్యాట్రిక్‌ మెడల్‌ లక్ష్యంతో ఉంది. ఇటీవలి కాలంలో తన ప్రదర్శన మెరుగ్గా లేకపోయినా.. ఒలింపిక్స్‌లో చెలరేగే అలవాటును కొనసాగించాలనుకుంటోంది. మహిళల సింగిల్స్‌లో 13వ ర్యాంకర్‌ సింధుకు గ్రూప్‌ దశను దాటడం సులువే. ఇక పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టిలపై స్వర్ణ ఆశలున్నాయి. తొలి రోజు శనివారం పోటీల్లో పురుషుల సింగిల్స్‌లో కెవిన్‌ కార్డన్‌ (గ్వాటెమాల)తో లక్ష్య సేన్‌ ఆడనున్నాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌-చిరాగ్‌ జోడీ రోనన్‌ లాబర్‌-లుకాస్‌ కార్వీ (ఫ్రాన్స్‌)తో.. మహిళల డబుల్స్‌లో అశ్విని-త్రిషా జోడీ కిమ్‌ సో యీంగ్‌-కాంగ్‌ హీ యాంగ్‌ (కొరియా)తో తలపడనున్నారు.

కివీ్‌సతో హాకీ పోరు

గతమెంతో ఘనంగా ఉన్న భారత పురుషుల హాకీ మ్యాచ్‌ వరుసగా రెండో పతకమే లక్ష్యంగా ఉంది. ఇందులో భాగంగా నేడు న్యూజిలాండ్‌తో తమ ఆరంభ మ్యాచ్‌ను ఆడబోతోంది. పూల్‌ ఆఫ్‌ డెత్‌గా భావించే పూల్‌ ‘బి’లో ఉన్న భారత్‌పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి. 41 ఏళ్ల తర్వాత టోక్యో గేమ్స్‌లో పతకం సాధించిన ఈ జట్టుకు దారి క్లిష్టంగానే ఉంది. తమ పూల్‌లోనే ఉన్న ప్రస్తుత చాంపియన్‌ బెల్జియం, ఆసీస్‌, అర్జెంటీనా, కివీస్‌, ఐర్లాండ్‌లతో గట్టి పోటీ ఉండనుంది. అందుకే తొలి మూడు మ్యాచ్‌లను గెలిస్తే నాకౌట్‌కు వెళ్లవచ్చు. చివరి రెండింటిని బెల్జియం, ఆసీ్‌సలతో ఆడాల్సి ఉంటుంది. కీపర్‌ శ్రీజే్‌షకు చివరి గేమ్స్‌ కాబోతున్నాయి. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌, సుఖ్‌జీత్‌, రాజ్‌కుమార్‌, జర్మన్‌ప్రీత్‌లతో సమతూకంగా కనిపిస్తోంది.

’నిఖత్‌, లవ్లీనాకు కఠిన డ్రా

భారత్‌ నుంచి ఆరుగురు బాక్సర్లు బరిలోకి దిగనుండగా.. అందరి దృష్టీ తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, లవ్లీనా బొర్గొహెయిన్‌లపైనే ఉంది. అయితే ఈ ఇద్దరికీ కఠిన డ్రా ఎదురైంది. తొలిసారి 50కేజీ విభాగంలో పాల్గొంటున్న నిఖత్‌ తొలి పోరులో జర్మనీ సంచలనం కరీనా క్లొయెట్జర్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. సోమవారం ఈ బౌట్‌ జరుగనుంది. ఒకవేళ ఇది గెలిస్తే టాప్‌ ర్యాంకర్‌ వూ యూ (చైనా)తో సవాల్‌ ఎదురుకానుంది. ఇక టోక్యోలో కాంస్యం గెలిచిన లవ్లీనా బుధవారం తొలి రౌండ్‌లో సున్నీవా (నార్వే)తో తలపడనుంది. మరోవైపు శనివారం మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్‌ మాత్రమే పోటీ పడనుంది.

తొలి రోజే నాలుగు విభాగాల్లో..’

12 ఏళ్లుగా భారత్‌కు షూటింగ్‌లో పతకం దక్కడం లేదు. మొత్తంగా నాలుగు మెడల్స్‌ అందించిన ఈ విభాగం గత రెండు పర్యాయాలు రిక్తహస్తాలతోనే వెనుదిరిగింది. కానీ ఈసారి ఏకంగా 21 మంది షూటర్లు గురి చేసి గన్‌ పేల్చేందుకు సిద్ధమయ్యారు. అయితే 10మీ. ఎయిర్‌ పిస్టల్‌, 25మీ. పిస్టల్‌ ఈవెంట్లలో బరిలోకి దిగబోతున్న మను బాకర్‌తో పాటుగా 50మీ. రైఫిల్‌ 3 పొజిషన్‌లో అదరగొడుతున్న సిఫ్ట్‌ కౌర్‌ శర్మపై పతక ఆశలున్నాయి. అలాగే 25మీ. ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో పోటీ పడుతున్న హైదరాబాదీ ఇషా సింగ్‌పైనా అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు భారత్‌ తొలి రోజు నాలుగు విభాగాల్లో పోటీ పడనుంది. ఇందులో రెండు మెడల్స్‌ ఈవెంట్లున్నాయి.

Updated Date - Jul 27 , 2024 | 06:29 AM