Share News

వరుణుడిదే ఆధిపత్యం

ABN , Publish Date - Sep 28 , 2024 | 05:44 AM

ఊహించినట్టుగానే జరిగింది.. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య శుక్రవారం మొదలైన రెండో టెస్టును వరుణుడు కాస్త గట్టిగానే అడ్డు నిలిచాడు. మొదటి రోజు ఆట 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్‌ ఆరంభ సమయానికి మైదానం పూర్తి చిత్తడిగా మారడంతో గంట ఆలస్యంగా ఇరు

వరుణుడిదే ఆధిపత్యం

ఆడింది 35 ఓవర్లే..

బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 107/3

తొలి రోజు ఆటకు ఆటంకం

రెండో టెస్టు

కాన్పూర్‌: ఊహించినట్టుగానే జరిగింది.. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య శుక్రవారం మొదలైన రెండో టెస్టును వరుణుడు కాస్త గట్టిగానే అడ్డు నిలిచాడు. మొదటి రోజు ఆట 35 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మ్యాచ్‌ ఆరంభ సమయానికి మైదానం పూర్తి చిత్తడిగా మారడంతో గంట ఆలస్యంగా ఇరు జట్లు బరిలోకి దిగాయి. తొలి సెషన్‌ సజావుగానే సాగినా.. ఆ తర్వాత రెండో సెషన్‌ ప్రారంభమైన కాసేపటికే వెలుతురు లేమితో మ్యాచ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. దీనికి తోడు భారీ వర్షం కురవడంతో మధ్యాహ్నం మూడుగంటలకు అంపైర్లు తొలి రోజు ఆటను ముగిస్తున్నట్టు ప్రకటించారు. అప్పటికి బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో మూడు వికెట్లకు 107 పరుగులు చేసింది. క్రీజులో మోమినుల్‌ హక్‌ (40 బ్యాటింగ్‌), ముష్ఫికర్‌ రహీమ్‌ (6 బ్యాటింగ్‌) ఉన్నారు. కెప్టెన్‌ షంటో (31) ఫర్వాలేదనిపించాడు. పేసర్‌ ఆకాశ్‌దీ్‌పనకు రెండు, అశ్విన్‌కు ఓ వికెట్‌ దక్కాయి. ఇదిలావుండగా అంతా అంచనా వేసినట్టు భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లతో కాకుండా, తొలి టెస్టు మాదిరి ఇద్దరితోనే బరిలోకి దిగడం గమనార్హం.

రాత్రి నుంచే వర్షం: ప్రస్తుతం కాన్పూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే మ్యాచ్‌కు మొదటి మూడు రోజులు ఇబ్బందేనని అంచనా వేశారు. గురువారం రాత్రి నుంచే కురిసిన వర్షంతో గ్రీన్‌పార్క్‌ అంతా చిత్తడిగా మారింది. దీంతో నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా 10.30కి మ్యాచ్‌ ఆరంభమైంది. ఆకాశం మేఘావృతంగా ఉండడంతో అంతకుముందు టాస్‌ గెలిచిన కెప్టెన్‌ రోహిత్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు.


చెలరేగిన ఆకాశ్‌: కొత్త బంతితో పేసర్లు బుమ్రా, ఆకాశ్‌, సిరాజ్‌ కట్టుదిట్టంగా బంతులు వేశారు. దీంతో 24 బంతులు ఎదుర్కొన్న ఓపెనర్‌ జకీర్‌.. యశస్వీ మెరుపు క్యాచ్‌తో డకౌట్‌గా వెనుదిరిగాడు. పేసర్‌ ఆకాశ్‌ ఈ వికెట్‌ తీశాడు. కాసేపటికే అతడు షాద్‌మన్‌ ఇస్లాం (24)ను కూడా ఎల్బీ చేశాడు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా.. ఆకాశ్‌ ఒత్తిడి మేరకు డీఆర్‌ఎ్‌సకు వెళ్లిన రోహిత్‌ ఫలితం సాధించాడు. అయితే ఈ దశలో షంటో, మోమినుల్‌ చక్కటి ఫోర్లతో ఎదురుదాడికి దిగారు. అలాగే మరో వికెట్‌ కోల్పోకుండా ఈ జోడీ తొలి సెషన్‌ను పూర్తి చేసింది. ఆ వెంటనే చిరు జల్లులు కురవడంతో మైదానాన్ని కవర్లతో కప్పేశారు. చివరకు మరో 15 నిమిషాలు ఆలస్యంగా రెండో సెషన్‌ ఆరంభమైంది. చక్కగా కుదురుకున్న షంటోను అశ్విన్‌ ఎల్బీ చేయడంతో బంగ్లా షాక్‌కు గురైంది. ఈ నిర్ణయంపై షంటో రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. మూడో వికెట్‌కు ఈ జోడీ 51 పరుగులు జత చేసింది. అయితే 35వ ఓవర్‌ తర్వాత వెలుతురు తగ్గిపోవడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. మరో పావుగంటకు భారీ వర్షం తోడవ్వడంతో చేసేదేమీ లేక తొలి రోజును ముగిస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.

స్కోరుబోర్డు

బంగ్లా తొలి ఇన్నింగ్స్‌: జకీర్‌ హసన్‌ (సి) జైస్వాల్‌ (బి) ఆకాశ్‌ దీప్‌ 0; షాద్‌మన్‌ (ఎల్బీ) ఆకాశ్‌ దీప్‌ 24; మోమినుల్‌ (బ్యాటింగ్‌) 40; షంటో (ఎల్బీ) అశ్విన్‌ 31; ముష్ఫికర్‌ (బ్యాటింగ్‌) 6; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 35 ఓవర్లలో 107/3. వికెట్ల పతనం: 1-26, 2-29, 3-80. బౌలింగ్‌: బుమ్రా 9-4-19-0; సిరాజ్‌ 7-0-27-0; అశ్విన్‌ 9-0-22-1; ఆకాశ్‌ దీప్‌ 10-4-34-2.

ఆసియాలో ఎక్కువ వికెట్లు (420) తీసిన భారత బౌలర్‌గా అశ్విన్‌. అనిల్‌ కుంబ్లే (419)ను అధిగమించాడు. మొత్తంగా అతను రెండో స్థానంలో ఉండగా మురళీధరన్‌ (612) టాప్‌లో ఉన్నాడు.

Updated Date - Sep 28 , 2024 | 05:44 AM